సోమవారం ఎమ్మెల్యే క్వార్టర్స్‌ను ప్రారంభిస్తున్న సీఎం కేసీఆర్. చిత్రంలో స్పీకర్ పోచారం, మంత్రులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర శాసనసభ్యులు, శాసనమండలి సభ్యుల కోసం రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని హైదర్‌గూడలో ఆధునిక సదుపాయాలతో నిర్మించిన నివాస గృహ సముదాయాన్ని శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డితో కలసి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సోమవారం ప్రారంభించారు. వేద పండితుల సమక్షంలో జరిగిన గృహప్రవేశ పూజా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం నివాస సముదాయంలోని భవనాలను ఆయన పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, జగదీశ్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, వేముల ప్రశాంత్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, శాసనసభ కార్యదర్శి వి.నర్సింహాచారి, ఎంపీ జోగినిపల్లి సంతోశ్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఆదర్శ్‌నగర్, హైదర్‌గూడలోని పాత ఎమ్మెల్యే క్వార్టర్లు శిథిలావస్థకు చేరుకోవడంతో 2012లో కొత్తభవన సముదాయం నిర్మాణ పనులను ప్రారంభించారు. ఎన్నో ఆటంకాల అనంతరం పనులు పూర్తికావడంతో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వారి సహాయకులు, సిబ్బంది కోసం కొత్త నివాస గృహాలు అందుబాటులోకి వచ్చాయి.
క్వార్టర్స్‌లో ఏర్పాటుచేసిన ఫర్నీచర్
కాంగ్రెస్, మజ్లీస్ సభ్యుల డుమ్మా!
కొత్త ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నివాస సముదాయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కాంగ్రెస్, ఎంఐఎం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు డుమ్మా కొట్టారు. అధికార టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు బీజేపీ తరఫున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ లోధా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
హైదరాబాద్‌లోని హైదర్‌గూడలో ఎమ్మెల్యేల కోసం నిర్మించిన భవన సముదాయం
కొత్త నివాస సముదాయం హైలైట్స్
- ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం 6,01,532 చదరపు అడుగుల విస్తీర్ణంలో 120 ఫ్లాట్లతో మెయిన్ బ్లాక్ నిర్మించారు. మూడు సెల్లార్లు+గ్రౌండ్ ఫ్లోర్+12 ఫ్లోర్లతో ఈ బ్లాక్ సిద్ధమైంది. ఒక్కో ఫ్లాట్ విస్తీర్ణం 2,500 చదరపు అడుగులు.. అంతస్తుకు 10 చొప్పున ఫ్లాట్లున్నాయి. ఒక్కో ఫ్లాట్‌లో పెద్దల పడక గది, పిల్లల పడక గది, అతిథుల పడక గది, కామన్ టాయిలెట్, కార్యాలయ గది, లివింగ్ అండ్ డైనింగ్ రూం, వంట గది, స్టోర్‌రూంలు ఉన్నాయి.
- మెయిన్ బ్లాక్‌లోని సెల్లార్‌లో 81, ఒకటో సబ్ సెల్లార్‌లో 94, రెండో సబ్ సెల్లార్‌లో 101 276 కార్ల పార్కింగ్ సదుపాయం కల్పించారు.
- మెయిన్ బ్లాక్ గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఎమ్మెల్యేల కోసం 150 చ.అడుగుల విస్తీర్ణంతో 23 క్యాబిన్లు, ఒక సెక్యూరిటీ రూం, 6 ప్యాసేజ్ లిఫ్టులు, 2 సర్వీసు లిఫ్టులు, 5 మెట్ల మార్గాలను ఏర్పాటు చేశారు.
- ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సహాయకుల (అటెం డెంట్ల) కోసం 120 ఫ్లాట్లను నిర్మించారు. ఒక్కో ఫ్లాట్ 325 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది.
- సిబ్బంది కోసం 36 ఫ్లాట్లను నిర్మించారు. ఒక్కో ఫ్లాట్ 944 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది.
- లక్షా 25 వేల 928 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐటీ, మౌలిక సదుపాయాల బ్లాక్‌ను నిర్మిం చారు. గ్రౌండ్‌ఫ్లోర్‌లో 4,128.50 చదరపు అడుగుల విస్తీర్ణంలో సూపర్ మార్కెట్, కిచెన్‌తో కూడిన క్యాంటీన్, స్టోర్‌రూంల సదుపాయం ఉంది. తొలి అంతస్తులో 4,701 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆస్పత్రి, రెండో అంతస్తులో ఇండోర్ గేమ్స్, మూడో అంతస్తులో గ్రంథాలయం/రీడింగ్ హాల్, వ్యాయామశాల, ఆడియో విజువల్ రూం, నాలుగో ఫ్లోర్‌లో బాంకెట్ హాల్ సదుపాయం కల్పించారు.
- భవన సముదాయం అవసరాల కోసం 0.73 ఎంఎల్‌డీ నిల్వ సామర్థ్యంతో మంచినీటి సంపు నిర్మించారు.
- 250 కేఎల్‌డీ సామర్థ్యంతో మురుగు నీటి శుద్ధి ప్లాంట్ ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment