పార్టీ అధినేత కేసీఆర్
సర్వేలన్నీ టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఉన్నాయని, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 13 స్థానాలూ గెలుచుకోవాలని గులాబీ దళపతి, సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. తనకున్న సమాచారం మేరకు ముందస్తు ఎన్నికల్లో వంద సీట్లు గెలుచుకుని టీఆర్‌ఎస్ పార్టీ చరిత్ర సృష్టించబోతోందని, సమయాన్ని వృథా చేయకుండా.. ఒక్కరోజు కూడా విరామం తీసుకోకుండా.. ప్రతిఓటరును కలిసి ప్రభుత్వ పథకాలను వివరించి చెప్పాలని హితవు చేశారు.
సాక్షిప్రతినిధి, కరీంనగర్: మంత్రులు, తాజామాజీ ఎమ్మెల్యేలు, పార్టీ అభ్యర్థులతో హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆదివారం నిర్వహించిన అవగాహన సమావేశంలో కేసీఆర్ దిశానిర్దేశనం చేశారు. మూడు గంటల పాటు నిర్వహించిన ఈ సమావేశంలో ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహం, పోలింగ్ రోజు వరకు సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలనే అంశాలపై వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు సంక్షేమ పథకాలను వినియోగించుకుంటున్న వారు ప్రతి నియోజకవర్గంలోనూ సుమారు 60 వేల మంది వరకు ఉన్నట్లు గుర్తించి.. నియోజకవర్గాల వారీగా వారి వివరాలను అభ్యర్థులకు సమావేశంలో అందజేశారు. కరీంనగర్ జిల్లాలో అన్ని సీట్లల్లో అభ్యర్థుల ప్రచార తీరు బాగుందని, జగిత్యాలలో కొంత పుంజుకోవాల్సిన అవసరం ఉందని సూచించినట్లు సమాచారం.
ఉత్తర తెలంగాణలో 54 సీట్లల్లో అధిక్యత దిశగా కొనసాగుతున్నామని, మెజార్టీ ఎంత అన్న విషయంపై దృష్టిసారించాలని అభ్యర్థులకు సూచించారు. పార్టీ పాక్షిక మేనిఫెస్టోపై ప్రజల్లో విసృతంగా ప్రచారం నిర్వహించాలని, ప్రతిపక్షాలు చేస్తున్న గోబెల్స్ ప్రచారాన్ని తిప్పికొట్టాలని వివరించారు. శాసనసభ రద్దు చేసిన నాటి నుంచి నేటి వరకు చేసిన సర్వేలలో టీఆర్‌ఎస్ పార్టీకి అనుకూలంగా ఉందని, అందరికీ 60 శాతంపైగానే ప్రజలు మద్దతు పలుకుతున్నారన్నారు. అభ్యర్థులు మరింత కష్టపడి ప్రజల మద్దతు కూడగట్టుకుంటే విజయం నల్లేరుమీదనడకే అని భరోసా ఇచ్చారు.
50 రోజుల్లో తెలంగాణలో 100 సభలు నిర్వహించాలని అనుకుంటున్నామని, నవంబర్ మొదటి వారంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భారీ బహిరంగ సభ ఉంటుందని, అభ్యర్థులు, టీఆర్‌ఎస్ శ్రేణులు బహిరంగసభను విజయవంతం చేసే దిశగా ముందుకు సాగాలని సూచించారు. నవంబర్ 12న ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోగా ఉత్తర తెలంగాణలో 30 నియోజకవర్గాల్లో బహిరంగ సభలు పూర్తి చేసేందుకు పార్టీ కార్యాచరణ రూపొందించిందని, అభ్యర్థులు ప్రతి ఓటరు కలిసేలా ప్రణాళికను రూపొందించుకొని ముందుకు సాగాలని సూచించారు.
నవంబర్ మొదటి వారంలో భారీ సభ.. నియోజకవర్గం కేంద్రాల్లో బ్యాక్ ఆఫీసులు..
తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులతో సమావేశమైన ఆ పార్టీ అధినేత కేసీఆర్ కొందరు అభ్యర్థులకు గట్టిగా క్లాస్ తీసుకున్నట్లు సమాచారం. ప్రజల్లో ఉన్నప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించినట్లు తెలుస్తోంది. కోడ్ ఉంది జాగ్రత్త..! అంటూ అభ్యర్థులకు కేసీఆర్ హెచ్చరించినట్లు వినికిడి. అభ్యర్థులు ప్రచారంపై నిర్లక్ష్యం చూపవద్దని సూచించారు. సమావేశంలో అభ్యర్థులకు ఆయన సూచనలు చేసినట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అంతేకాకుండా పాక్షిక మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై అభ్యర్థులకు ఆయన దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం నుంచి లబ్ధి పొందినవారి జాబితాను.. నియోజకవర్గాల వారీగా అభ్యర్థులకు కేసీఆర్ అందజేశారు. ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహాలను అధినేత కేసీఆర్ వివరించారు.
నోటిఫికేషన్‌కు ముందు, తర్వాత సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో చెప్పారు. సమయాన్ని వృథా చేసుకోవద్దని, ఒక్క రోజు కూడా విరామం తీసుకోవద్దని, ప్రతి ఓటర్‌ను కలిసి ప్రభుత్వ పథకాలు వివరించాలని కేసీఆర్ ఆదేశించారు. మళ్లీ టీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి రావాల్సి ఉందని, నియోజకవర్గ కేంద్రాల్లో పార్టీ కార్యాలయాలు, బ్యాక్ ఆఫీసులు వెంటనే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అసమ్మతి అనేది పూర్తిగా తగ్గిపోయిందని, ఎక్కడైనా ఉంటే ఆ జిల్లా మంత్రులే చూసుకుంటారని పేర్కొన్నట్లు తెలిసింది.
కొత్త అభ్యర్థులకు బీఫాం ఎలా ఫైల్‌చేయాలి? ఎన్నికల అఫిడవిట్, ఆస్తుల వివరాలు, కేసుల వివరాలు ఎలా ఫైల్ చేయాలో కేసీఆర్ సూచించారు. హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో మంత్రులు ఈటల రాజేందర్, కేటీఆర్, చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, రసమయి బాలకిషన్, చెన్నమనేని రమేశ్‌బాబు, దాసరి మనోహర్‌రెడ్డి, కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, సోమారపు సత్యనారాయణ, పుట్ట మధు, వొడితెల సతీష్‌బాబు, జగిత్యాల అభ్యర్థి సంజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్‌తో భేటీ అనంతరం మంత్రి ఈటల రాజేందర్ ఇంట్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేతలంతా సమావేశం అయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment