కొత్తపల్లి రోడ్ షోలో మాట్లాడుతున్న రేవంత్‌రెడ్డి
సాక్షి, మద్దూరు (కొడంగల్): రాష్ట్రంలో వచ్చేది ప్రజాకుటమి ప్రభుత్వమేనని టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మద్దూరు మండలంలోని కొత్తపల్లి, నిడ్జింత, భూనీడ్ గ్రామాల్లో గురువారం నిర్వహించిన రోడ్డు షోలో అయన మాట్లాడారు.
కోస్గిలో బుధవారం నిర్వహించిన రాహుల్‌గాంధీ సభకు వచ్చిన జనాన్ని చూసి కేసీఆర్ భయం పుట్టుకొచ్చిందని తెలిపారు. దీంతోనే కొడంగల్‌లో ఎన్నికల ప్రచారానికి వస్తున్నారని పేర్కొన్నారు. అయితే, ఎవరు ఎన్ని కుట్రలు చేసినా రాష్ట్రంలో ప్రజాకుటమి అధికారంలోకి రావడాన్ని ఆపలేరని స్పష్టం చేశారు.
అధికారంలోకి రాగానే రైతులకు రూ.2లక్షల వరకు రుణమాఫీ చేసి 20 రోజుల్లో బ్యాంకుల్లో ఉన్న పట్టాపుస్తకాలు తిరిగి ఇప్పిస్తామని వెల్లడించారు. అలాగే, ఇళ్లులేని వారందరికీ రూ.5లక్షలతో ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరైన వారికి అదనంగా మరో గది కట్టుకోవడానికి రూ. 2లక్షలు అందజేయనున్నట్లు తెలిపారు.
ఇక 58 ఏళ్లు నిండిన వారు ఇంట్లో ఇద్దరు ఉన్నా రూ.2వేల చొప్పున పింఛన్ అందజేస్తామని వివరించారు. కాగా, గ్రామాల్లో కాంగ్రెస్ కార్యకర్తలను ఎవరైనా బెదిరిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఇక నియోజకవర్గంలో ఏదైనా అభివృద్ధి జరిగిందంటే అది తనతోనే సాధ్యమైందని రేవంత్‌రెడ్డి వెల్లడించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తిరుపతిరెడ్డి, శివరాజ్, చంద్రశేఖర్, నర్సింహా, రమేష్‌రెడ్డి, మధుసుధన్‌రెడ్డి, చెన్నప్ప, ఆశోక్, మహేందర్‌రెడ్డి, చందు, వెంకట్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment