టీఆర్‌ఎస్ అధినేత కె చంద్రశేఖర్‌రావు
సాక్షిప్రతినిధి, నిజామాబాద్ : శాసనసభ ముంద స్తు ఎన్నికల ప్రచార పర్వానికి టీఆర్‌ఎస్ అధినేత కె చంద్రశేఖర్‌రావు ఇందూరు నుంచే శంఖారావం పూరించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి జిల్లా ల వారీగా నిర్వహించతలపెట్టిన బహిరంగసభల షెడ్యుల్‌ను ఇప్పటికే ప్రకటించిన అధినేత, మిగిలిన సభలకు ఊపు తెచ్చే విధంగా నిజామాబాద్ ప్రజా ఆశీర్వాద సభను నిర్వహించాలని నిర్ణయించారు. ఇందుకోసం ఆ పార్టీ శ్రేణులు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. సభను విజయవంతం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానంగా జన సమీకరణపై ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్రంలోనే తొలి సభ కావడంతో ఈ సభను ఆ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. నిర్వహణ, ఏర్పాట్ల బాధ్యతలను నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత, మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డిలకు అప్పగించింది. వారం రోజులుగా జిల్లాలోనే ఉంటున్న ఇద్దరు నేతలు సభ నిర్వహణకు అవసరమైన ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. సభ నిర్వహణ ఏర్పాట్లపై అధినేత కేసీఆర్ పలుమార్లు ఎంపీ కవిత, పోచారం శ్రీనివాస్‌రెడ్డితో ఫోన్లో మాట్లాడారు. నిర్వహణ ఏర్పాట్లపై ఆరా తీశారు.
నియోజకవర్గం నుంచి ..
ఒక్కో నియోజకవర్గం నుంచి 25 వేల మంది చొప్పున ఈ బహిరంగసభకు తరలించాలని పార్టీ నిర్ణయించింది. జిల్లా కేంద్రమైన నిజామాబాద్‌అర్బన్‌తో పాటు సమీపంలోని నిజామాబాద్ రూర ల్, ఆర్మూర్, బోధన్ నియోజకవర్గాల నుంచి వీలై నంత ఎక్కువ మంది తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బాల్కొండ, బాన్సువాడ, కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో జన సమీకరణకు ఏర్పాట్లు చేశా రు. ఆయా నియోజకవర్గాల నుంచి జనాలను తీసుకు వచ్చే బాధ్యతలను ఆ పార్టీ అభ్యర్థులకు అప్పగించారు. దీంతో తమ నియోజకవర్గాల నుంచి అధిక సంఖ్యలో జనాలను తరలించేందుకు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఈ మేరకు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
సమాయత్తం చేసిన ఎంపీ..
వారం రోజులుగా జిల్లాలోనే ఉన్న ఎంపీ కవిత సభకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేశారు. నియోజకవర్గాల వారీగా సమావేశాలను నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. ముఖ్యంగా అర్బన్ పరిధిలోని కార్పొరేటర్లు, నగర పార్టీ నాయకత్వంతో ఇటీవల ఓ ప్రైవేటు హోటర్‌లో సమావేశమైన ఎంపీ.. వారి పనితీరుపై క్షుణ్ణంగా సమీక్షించారు. సుమారు ఆరు గంటల పాటు అర్బన్‌పైనే ఫోకస్ చేశారు. ఆయా డివిజన్ల నుంచి పెద్ద ఎత్తున జన సమీకరణ చేపట్టాలని ఆదేశించారు. బాల్కొండ, నిజామాబాద్ రూరల్, బోధన్ నియోజకవర్గాల కార్యకర్తల సమావేశాల్లో కూడా ఆమె పాల్గొని పలు సూచనలు చేశారు. తాజాగా సోమవారం నగరంలోని ప్రధాన కుల సంఘాలతో సమావేశమయ్యారు. జిల్లాలో అత్యధిక సంఖ్య కలిగిన ఈ ప్రధాన నాలుగు కుల సంఘాల పెద్దలతో భేటీ అయ్యారు. మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి కామారెడ్డి జిల్లాలోని పార్టీ శ్రేణులను సమాయత్తం చేశారు.
సిద్ధమైన వేదిక, హెలీపాడ్
నిజామాబాద్ నగరంలోని గిరిరాజ్ కళాశాల మైదానంలో సీఎం సభకు అన్ని ఏర్పాట్లు చేశారు. భారీ విస్తీర్ణంలో సభా వేదిక సిద్ధమైంది. సభకు హాజరైన ప్రజలకు ఇబ్బందులు కలగకుండా మైదానాన్ని చదును చేశారు. బైపాస్‌రోడ్డుకు అవతల వైపు పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నుంచి హెలిక్యాప్టర్‌లో బయలుదేరనున్న సీఎం కేసీఆర్ నేరుగా సభాస్థలానికి చేరుకునేలా అక్కడే హెలిప్యాడ్‌ను నిర్మించారు.
నిర్వహణకు ప్రత్యేక కమిటీలు..
సభ నిర్వహణ ఏర్పాట్లను వివిధ కమిటీలకు అప్పగించారు. వేదిక నిర్మాణ కమిటీ, మైదానం సిద్ధం చేసేందుకు మరో కమిటీని నియమించారు. సభకు వచ్చే వారి సౌకర్యం కోసం తాగునీటి వసతి వంటి ఏర్పాట్లను చేపట్టారు. అలాగే ప్రజా ఆశీర్వాద సభకు ప్రజలు తరలివచ్చేలా గ్రామాల్లో ప్రత్యేకంగా ప్రచార కార్యక్రమాలను చేపట్టారు.
ఇతర జిల్లాల వాహనాలు, బస్సులు..
సభకు జనాలను తరలించేందుకు సుమారు మూడు వందల బస్సులను వినియోగించే అవకాశాలున్నాయి. వీటితో పాటు, డీసీఎంలు, ఐచర్‌లలో జనాలను తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. నిర్మల్, జగిత్యాల, మెదక్, సిద్దిపేట్ డిపోల నుంచి కూడా ఆర్టీసీ బస్సులను తరలించనున్నారు. ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా పోలీసులు రూట్‌మ్యాప్‌ను సిద్ధం చేస్తున్నారు.
ఆర్మూర్, కామారెడ్డి, బాన్సువాడ, వర్ని, బోధన్ రూట్ల వైపు నుంచి వచ్చే వాహనాల పార్కింగ్ వంటి అంశాలపై దృష్టి సారించింది.
Comments
Please login to add a commentAdd a comment