సర్వ సన్నద్ధం కండి | KCR Orders On Kaleshwaram Projects To Boost Irrigation Works | Sakshi
Sakshi News home page

సర్వ సన్నద్ధం కండి

Published Sat, May 25 2019 1:44 AM | Last Updated on Sat, May 25 2019 3:31 AM

KCR Orders On Kaleshwaram Projects To Boost Irrigation Works - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఈ ఏడాది జూలై నుంచి కాళేశ్వరం నీటిని ఎత్తిపోయనున్న నేపథ్యంలో ప్రాజెక్టు పరిధిలోని బ్యారేజ్‌లు, రిజర్వాయర్లు, కాల్వలు, డిస్ట్రిబ్యూటర్లు, తూములను నిర్వహించడానికి సర్వ సన్నద్ధం కావాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఇకపై నిరంతర నీటి ప్రవాహం ఉంటుందని, దీనికి తగినట్లుగా కాల్వల నిర్వహణ కోసం సమగ్ర వ్యూహం రూపొందించాలని సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీటిని ఎత్తిపోయడం ప్రారంభిస్తున్న నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్‌ శుక్రవారం ప్రగతి భవన్‌లో సమీక్షించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె.జోషి, ముఖ్య కార్యదర్శి రామకృష్ణ, కార్యదర్శి స్మితా సభర్వాల్, నీటి పారుదల ఈఎన్‌సీలు మురళీధర్, హరేరామ్, సీఈలు ఖగేందర్, శంకర్‌ ఈ భేటీలో పాల్గొన్నారు.  

20 రోజుల్లో పూర్తి చేయాలి.. 
‘తెలంగాణ ఇప్పటివరకు కరువు ప్రాంతం. సాగునీటికి అష్టకష్టాలు పడిన నేల. శ్రీరాం సాగర్‌ ప్రాజెక్టు కాల్వలతోపాటు ఇతర కాల్వల్లో మూడు నాలుగేళ్లకు ఓ సారి నామమాత్రంగా నీళ్లు వచ్చేవి. దీంతో నీటి ప్రవాహాన్ని పంట పొలాల వరకు తరలించేందుకు కాల్వల నిర్వహణను పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారుతోంది. రాష్ట్రంలో వర్షం పడకున్నా సరే, ప్రాణహిత ద్వారా గోదావరిలోకి పుష్కలంగా నీళ్లు వస్తాయి. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఈ ఏడాది జూలై నుంచే నీటిని ఎత్తిపోయడం ప్రారంభం అవుతుంది. మేడిగడ్డ నుంచి సుందిళ్ల, అన్నారం ద్వారా మిడ్‌ మానేరు, ఎల్లంపల్లికి అక్కడి నుంచి శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు, మల్లన్నసాగర్, కొండ పోచమ్మ సాగర్‌ వరకు నీరు పంపింగ్‌ జరుగుతుంది.

ఈ నేపథ్యంలో నీటి పారుదల శాఖ అప్రమత్తం కావాలి’ అని సీఎం సూచించారు. మిడ్‌ మానేరు, లోయర్‌ మానేరు, ఎల్లంపల్లి, శ్రీరాంసాగర్‌ రిజర్వాయర్లలో పూర్తిస్థాయిలో నీరు నింపుతామని, ఈ దృష్ట్యా ఆ జలాశయాల్లో గేట్లు, తూములు ఎలా ఉన్నాయో పరిశీలించి అవసరమైన మరమ్మతులు యుద్ధప్రాతిపదికన నిర్వహించాలని తెలిపారు. ఇదే సమయంలో ‘వరద కాలువ, కాకతీయ, లక్ష్మీ, సరస్వతి, గుత్ప, అలీ సాగర్‌ కాల్వలన్నింటినీ సిద్ధం చేయాలి. ఈ కాలువల తూములు, డిస్ట్రిబ్యూటరీలు, రెగ్యులేటర్లు ఎలా ఉన్నాయో పరిశీలించి అవసరమైన మరమ్మతులను 20 రోజుల్లో పూర్తి చేయాలి. దీనికి కావాల్సిన నిధులను వెంటనే విడుదల చేస్తాం. నీటి మళ్లింపు పనులు పర్యవేక్షించేందుకు లష్కర్లను నియమించుకోవాలి. కాల్వల మొదటి నుంచి చివరి వరకు కూడా నీటి ప్రవాహానికి అనుగుణంగా అన్ని వ్యవస్థలను సర్వసన్నద్ధం చేయాలి. కాల్వల వెంట పూర్తి సామర్థ్యంలో నీటి ప్రవాహం ఉంటుంది కాబట్టి రెండు వైపులా ఒడ్డులు పటిష్టంగా ఉండేట్లు చూడాలి. దీని కోసం నీటిపారుదల ఇంజనీర్లతో వర్క్‌షాపు ఏర్పాటు చేసి విధానాన్ని ఖరారు చేయాలి’ అని సీఎం చెప్పారు.  

అప్రమత్తంగా ఉండండి... 
మేడిగడ్డ నుంచి నీటిని ఎత్తి రిజర్వాయర్లకు తరలించే క్రమంలో బాలారిష్టాలు ఎదురవుతాయని, వాటిని అధిగమించేందుకు ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాలని సీఎం సూచించారు. బ్యారేజీల నుంచి రిజర్వాయర్లకు, చెరువులకు నీళ్లు పంపించే క్రమంలో ఎదురయ్యే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించుకోవాలని సూచించారు. బ్యారేజీల నుంచి రిజర్వాయర్లకు నీరంది, రిజర్వాయర్ల నుంచి పొలాల వరకు నీరు చేరే వరకు సమయం పడుతుందని, అప్పటివరకు అప్రమత్తంగా ఉండి పనులు నిర్వహించాలని సీఎం సూచించారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement