మన పోలీసు భేష్ | kcr praises telangana police | Sakshi
Sakshi News home page

మన పోలీసు భేష్

Published Mon, Nov 23 2015 2:43 AM | Last Updated on Wed, Oct 17 2018 5:37 PM

మన పోలీసు భేష్ - Sakshi

మన పోలీసు భేష్

సీఎం కేసీఆర్ ప్రశంసల జల్లు
*  జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు ఉంది
*  రాష్ట్రంలో పెట్టుబడులకు శాంతిభద్రతలే కీలకం
* సింగపూర్, చైనా పోలీసుల మాదిరి మనోళ్లు కూడా తయారవ్వాలి
* అక్కడి మాదిరి 'నైబర్‌హుడ్ వాచ్' ప్రవేశపెడతాం
* హైదరాబాద్‌లో 10 వేల సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాం
* జంట ఆకాశహర్మ్యాలకు శంకుస్థాపన.. అత్యాధునికంగా తీర్చిదిద్దుతామని వెల్లడి

 సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీసు శాఖపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రశంసల జల్లు కురిపించారు. తెలంగాణ పోలీసు విభాగానికి జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు ఉందని కొనియాడారు. కేంద్ర హోంశాఖ మంత్రి, జాతీయస్థాయిలో పోలీసు ఉన్నతాధికారులు, హోం సెక్రటరీతో జరిగే ఆంతరంగిక సమావేశాల్లో వారంతా మన పోలీసులను అభినందించినప్పుడు ఎంతో గర్వపడుతుంటానని చెప్పారు. పోలీసు శాఖలో వివిధ హోదాల్లో పని చేసిన పెద్దలు చేపట్టిన కార్యక్రమాల వల్లే ఈ గుర్తింపు లభించిందన్నారు.  హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో నిర్మించనున్న సిటీ పోలీసు కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్ అండ్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (హెచ్‌సీపీసీహెచ్‌క్యూ, ఐసీసీసీ) భవనాలకు ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశంలోనే అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మిస్తున్న ఈ ట్విన్ టవర్స్ నిర్మాణానికి, అందులో ఏర్పాటు చేసే టెక్నాలజీకి రూ.302 కోట్లు మంజూరు చేశామని, రానున్న బడ్జెట్‌లో మరో రూ.700 కోట్లు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఈ ఏడాది రాష్ట్రంలోని కార్పొరేట్, ప్రభుత్వ రంగ సంస్థలు కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బులిటీ (సీఎస్సార్) కార్యక్రమం కింద ఖర్చు చేసే నిధులన్నింటినీ పోలీసు విభాగం సాంకేతిక అభివృద్ధి కోసమే వెచ్చించేలా చర్యలు తీసుకుంటామని, దీన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పర్యవేక్షిస్తారని తెలిపారు.

నగర ఎంపీలు కూడా తమ ఎంపీ లాడ్స్ నుంచి వీలైనంత మంజూరు చేయాలని కోరారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి కనీసం రూ.50 లక్షల చొప్పున ఇవ్వాలని, ఇలా ప్రజా ప్రతినిధులే రూ.100 కోట్ల నిధులు సమీకరించాలని సూచించారు. ఈ భవనం కేవలం పోలీస్ కమిషనర్ బిల్డింగ్ కాదని, అన్ని విభాగాలు ఇందులో ఉంటాయని పేర్కొన్నారు. విపత్కర పరిస్థితుల పర్యవేక్షణ, ప్రకృతి విపత్తుల నిర్వహణకు ఇది ఉపకరిస్తుందని చెప్పారు. గతంలో పోలీసు అంటే ప్రజలకు ఒక విధమైన అభిప్రాయం ఉండేదని, అయితే ఏ పరిస్థితినీ ఒక్కరోజులో మార్చలేమని సీఎం పేర్కొన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం ముంబైలో 9 వేల సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తోందని, అయితే మనం ముంబై కంటే ఒక అడుగు ముందుకు వేసి జంట కమిషనరేట్లలో ప్రభుత్వ నిధులతో 10 వేల కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.

 పెట్టుబడులకు శాంతిభద్రతలే కీలకం
 అంతర్జాతీయంగా ఏ సదస్సుకు వెళ్లినా తనను పెట్టుబడిదారులు రాష్ట్రంలోని శాంతిభ్రదతల పరిస్థితిపైనే తొలి ప్రశ్న అడిగారని సీఎం చెప్పారు. శాంతిభద్రతలు పటిష్టంగా ఉంటేనే పెట్టుబడులు వస్తాయని స్పష్టం చేశారు. సింగపూర్, చైనాలో రోడ్డుపై ఒక్క పోలీసు కనిపించరని, అయినా నిత్యం పరిశీలిస్తుంటారన్నారు. బాధితులు ఫోన్ చేస్తే చాలు.. ఇంగ్లిషు సినిమాలో చూసినట్టు రెండున్నర లేదా మూడు నిమిషాల్లో వచ్చేస్తారని, తనకు పలువురు స్నేహితులు చెప్పారని, ఇది టెక్నాలజీ వల్లే సాధ్యమని వివరించారు. ఆ దిశగా మన పోలీసు కూడా ఎదగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. చైనా, సింగపూర్‌లో పోలీసు వ్యవస్థలు విజయవంతం కావడానికి అక్కడి ప్రజల భాగస్వామ్యం కీలకమైందన్నారు. ఆ దేశాల్లో 'నైబర్‌హుడ్ పోలీసు' ప్రయోగం మంచి ఫలితాలు ఇచ్చిందని, ఇక్కడ కూడా ఇలాంటిది ఏర్పాటు చేసే యోచన ఉందన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ మాదిరిగా ఫ్రెండ్లీ పీపుల్ కూడా అవసరమని స్పష్టం చేశారు.

 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి
 నగరంలోని వర్తక వాణిజ్య వేత్తలు, పారిశ్రామిక వేత్తలు, ఇతర వ్యాపారస్తులు హైదరాబాద్‌ను కాపాడుకోవడానికి ముందుకు రావాలిని, వీలైనన్ని కమ్యూనిటీ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. నిత్యం కాలుష్యం మధ్య పని చేసే ట్రాఫిక్ కానిస్టేబుళ్లకు 30 శాతం అదనంగా అలవెన్స్ ఇస్తున్నామని, ప్రభుత్వం కట్టిస్తున్న డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లలో ప్రతి ఏడాదీ మాజీ సైనికోద్యోగులతో పాటు కానిస్టేబుళ్లకు 10 శాతం ఉచితంగా కేటాయిస్తున్నామన్నారు.


ఐసీసీసీకి అవసరమైన ఫైబర్ ఆప్టిక్ బ్యాండ్‌విడ్త్‌ను ఐదేళ్లపాటు ఉచితంగా అందించేందుకు ముందుకు వచ్చిన రిలయన్స్ కంపెనీని సీఎం అభినందించారు. కార్యక్రమంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి మాట్లాడుతూ... విదేశాల్లో ఉన్న మాదిరి తక్షణ స్పందన కోసం సిటీ పోలీసుకూ నాలుగైదు హెలీకాప్టర్లు కేటాయించాలి'అని సీఎంను కోరారు. సీపీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. 'అభివృద్ధి చెందిన దేశాల్లో మాదిరి ఆడపిల్లలు కూడా ఒంటరిగా, భద్రతతో జీవించేలా నగరంలో పరిస్థితుల్ని మారుస్తున్నాం. రానున్న రెండేళ్లల్లో రోడ్లపై ట్రాఫిక్ పోలీసు లేని వ్యవస్థను చూడనున్నాం' అని చెప్పారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, హైదరాబాద్, సైబరాబాద్ పోలీసు కమిషనర్లు మహేందర్‌రెడ్డి, ఆనంద్, ఇన్‌చార్జి డీజీపీ సుదీప్ లక్టాకియా తదితరులు పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement