సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ఇతర దేశాల నుంచి వచ్చినవారికే కరోనా వైరస్ సోకిందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణలో కరోనా వచ్చివారు 14 మంది ఉన్నారని.. వారిలో 5 మంది విమానమార్గం ద్వారా, 9 మంది ఇతర మార్గాల్లో వచ్చారని చెప్పారు. కరోనా నియంత్రణపై సీఎం కేసీఆర్ గురువారం ప్రగతిభవన్‌లో మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. మార్చి 1 తర్వాత విదేశాల నుంచి వచ్చినవారిని గుర్తించాలని అధికారులను ఆదేశించారు. విదేశాల నుంచి వచ్చిన వారు స్వతహాగా అధికారులకు రిపోర్ట్ చేయాలని పిలుపునిచ్చారు. అప్పుడే వైరస్ వ్యాప్తిని నివారించవచ్చన్నారు. కరీంనగర్‌లో కరోనా సోకినవారు మత ప్రచారం కోసం వచ్చారని.. ప్రస్తుతం వారు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని తెలిపారు.
ముందు జాగ్రత్తలు తీసుకోని దేశాల్లో కరోనా ప్రభావం ఎక్కువగా ఉందన్నారు. దేవాలయాలు, మసీదులు, చర్చిలు, గురుద్వారాల్లోకి ప్రజలను అనుమతించవద్దని విజ్ఞప్తి చేశారు. ముందు జాగ్రత్త చర్యలో భాగంగా ఉగాది, శ్రీరామనవమి ఉత్సవాలను రద్దు చేశామని తెలిపారు. ఉగాది రోజున పంచాగ శ్రవణం లైవ్ టెలికాస్ట్ చేస్తామని అన్నారు. పట్టణాలు, గ్రామాల్లో శానిటైజేషన్ పెంచాలని మున్సిపల్, గ్రామ పంచాయతీ సిబ్బందిని ఆదేశించారు. తెలంగాణలో 1125 మందిని క్వారంటైన్ చేశామని తెలిపారు. విదేశాలు నుంచి వచ్చినవారు తప్పకుండా 14 రోజులు క్వారంటైన్‌లో ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. ఒకవేళ ఎవరైనా హోమ్ క్వారంటైన్ వెళ్తామంటే పంపిస్తున్నామని.. అలాంటి వారిపై పూర్తి నిఘా ఉంటుందన్నారు.
మార్చి 22 నుంచి కాదని శుక్రవారం నుంచే విమాన సర్వీసులు రద్దుచేయాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరతామన్నారు. తెలంగాణ సరిహద్దుల్లో 18 చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. సరిహద్దు రాష్ట్రాల నుంచి వచ్చేవారిని క్షుణంగా తనిఖీ చేస్తామన్నారు. పదో తరగతి పరీక్షలను యథాతథంగా కొనసాగిస్తామని స్పష్టం చేశారు. విద్యార్థుల పరీక్ష కేంద్రాలను హై శానిటైజ్ చేయమని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్‌లో సీసీఎంబీని వాడుకునేందుకు రాష్ట్రానికి అవకాశం ఇవ్వాలని శుక్రవారం జరగనున్న వీడియో కాన్ఫరెన్స్ లో కోరనున్నట్టు తెలిపారు. ముందే ముహుర్తం కుదిరిన పెళ్లిలకు 200 మందిలోపే అతిథులు ఉండాలని.. రాత్రి 9 గంటలలోపు వేడుకలు నిర్వహించుకోవాలని సూచించారు. నిబంధనలు అతిక్రమించిన ఫంక్షన్ హాల్స్‌ను సీజ్ చేస్తామని హెచ్చరించారు. ముందు జాగ్రత్త చర్యలే శ్రీరామరక్ష అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment