ఎమ్మెల్యేలకు కార్పొరేషన్ పదవులు | KCR set to reward majority party MLAs with plum posts | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యేలకు కార్పొరేషన్ పదవులు

Published Wed, Dec 17 2014 2:20 AM | Last Updated on Tue, Oct 30 2018 5:17 PM

KCR set to reward majority party MLAs with plum posts

సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వరంగ సంస్థల చైర్మన్ పదవులను ఎమ్మెల్యేలు చేపట్టేందుకు వీలు కల్పించే ఆంధ్రప్రదేశ్ వేతనాలు, పెన్షన్లు, అనర్హతల తొలగింపు చట్టం-1953ని తెలంగాణకు అన్వయించుకునే తీర్మానాన్ని రాష్ర్ట కేబినెట్ మంగళవారం ఆమోదించింది. ఈ చట్టాన్ని రాష్ట్రానికి వర్తింపజేయకపోతే ఎమ్మెల్యేలకు కార్పొరేషన్ పదవులు కట్టబెట్టడం సాధ్యం కాదు. ప్రజాప్రతినిధులు లాభదాయక పదవుల్లో కొనసాగితే అనర్హతకు గురయ్యే అవకాశముండటంతో రాష్ర్ట ప్రభుత్వం నివారణ చర్యలు చేపట్టింది.

ఇందులో భాగంగానే ఉమ్మడి రాష్ర్టంలోని సంబంధిత చట్టాన్ని తెలంగాణకు అన్వయిస్తూ నిర్ణయం తీసుకుంది. మంత్రివర్గ విస్తరణ అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు సచివాలయంలో సీఎం కేసీఆర్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. కొత్తగా మంత్రి పదవులు చేపట్టిన తుమ్మల నాగేశ్వరరావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఇంద్రకరణ్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, అజ్మీరా చందులాల్ కూడా ఇందులో పాల్గొన్నారు. దుబాయ్ పర్యటన నుంచి మంగళవారమే తిరిగొచ్చిన మంత్రి కేటీఆర్ మాత్రం దీనికి హాజరుకాలేదు.

కాగా, ప్రభుత్వం ఇటీవలే ఏర్పాటు చేసిన రాష్ర్ట ఎన్నికల సంఘంలో సిబ్బంది నియామకానికి కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం కార్యదర్శిని మాత్రమే నియమించారు. ఈసీ కమిషనర్‌గా ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి వి.నాగిరెడ్డిని నియమిస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ అయినప్పటికీ ఆయన ఇంకా బాధ్యతలు చేపట్టలేదు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వరంగ సంస్థలకు తెలంగాణ రాష్ట్రం పేరుతో తక్షణమే బోర్డులను ఏర్పాటు చేయాలని కూడా మంత్రిమండలి తీర్మానించింది. రాష్ర్ట ప్రణాళికా సంఘం ఏర్పాటు, దాని వైస్‌చైర్మన్ నియామక ఉత్తర్వులను, పీడీ చట్టానికి సవరణను కూడా ఆమోదించింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement