సీఎంగా.. తొలిసారి | KCR to Launch Karimnagar City Renovation Plan | Sakshi
Sakshi News home page

సీఎంగా.. తొలిసారి

Published Tue, Aug 5 2014 1:42 AM | Last Updated on Wed, Aug 15 2018 8:58 PM

సీఎంగా.. తొలిసారి - Sakshi

సీఎంగా.. తొలిసారి

నేడు కేసీఆర్ పర్యటన
కరీంనగర్ నుంచే శ్రీకారం
అభివృద్ధి పనులకు ముహూర్తం
నేడు జిల్లాలో కేసీఆర్ పర్యటన
రుణమాఫీ కోసం ఎదురుచూపులు
జిల్లా ప్రణాళికకు రూ.10వేల కోట్లు
నిధులు లేక నీరసించిన ప్రాజెక్టులు
జిల్లాపై వరాల జల్లు కురిపిస్తారా..!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు అచ్చొచ్చిన జిల్లాలో అడుగు పెడుతున్నారు. సీఎం హోదాలో తొలిసారిగా మంగళవారం కరీంనగర్‌లో పర్యటించనున్నారు. నవ తెలంగాణ నిర్మాణంలో భాగంగా చేపట్టే అభివృద్ధి పనులకు ఇక్కడే పునాదిరాయి వేస్తారు. పార్టీ ఆవిర్భావం నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు... తొలి ప్రభుత్వం పాలనాపగ్గాలు చేపట్టే వరకు అడుగడుగునా కేసీఆర్ ఇదే జిల్లాను నమ్ముకున్నారు. మూడుసార్లు ఇక్కణ్నుంచే ఎంపీగా గెలిచిన కేసీఆర్ ఇటీవలి సార్వత్రిక ఎన్నికల ప్రచారాన్ని జిల్లా నుంచే ప్రారంభించారు.

ఇందులో ఘన విజయం సాధించి తెలంగాణ తొలి ప్రభుత్వ పగ్గాలు చేపట్టారు. ఉద్యమంతో పాటు రాజకీయంగా తనకు కలిసొచ్చిన జిల్లా కావటంతో అదే సెంటిమెంట్‌ను ఆయన కొనసాగిస్తున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టాక జిల్లాల పర్యటనకు బయల్దేరటం ఇదే తొలిసారి. తన తొలి పర్యటన కావటంతో సీఎం జిల్లాపై వరాలు కురిపిస్తారని ప్రజలు ఎదురుచూస్తున్నారు. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు.. ఎన్నెన్నో అభివృద్ధి పనులకు కదలిక వస్తుందని.. ఆయనేం మాట ఇస్తారో అని ఆశగా చూస్తున్నారు.                     
 
 
మెగా టెక్స్‌టైల్‌పై కోటి ఆశలు
మరమగ్గాల పరిశ్రమకు నిలయమైన సిరిసిల్లలో మెగా టెక్స్‌టైల్ క్లస్టర్ ఏర్పాటుపై ఆశలు చిగురిస్తున్నాయి. ఇక్కడ దాదాపు 38 వేల మరమగ్గాలతో ఏటా రూ.350 కోట్లకు పైగా విలువైన వస్త్రోత్పత్తి జరుగుతోంది. రాష్ట్రంలోనే తొలి టెక్స్‌టైల్ పార్కు ఇక్కడే వెలిసింది. దీనికి సమీపంలోనే మెగా టెక్స్‌టైల్ క్లస్టర్ ఏర్పాటు చేసేం దుకు అవసరమైన స్థలం, వనరులు కూడా ఉన్నా యి. దీంతో వస్త్రశుద్ధి కర్మాగారాలు, సైజింగ్ పరిశ్రమలు, అద్దకం పరిశ్రమలతో పాటు అత్యాధునిక మరమగ్గాల పరిశ్రమలు, సాంకేతిక సలహాలను అందించే ప్రత్యేక పరిశ్రమలు ఇక్కడి కార్మికులకు అందుబాటులోకి వస్తాయి.
 
హార్టికల్చర్ యూనివర్సిటీ
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన హార్టికల్చర్ యూనివర్సిటీ... ప్రతిష్టాత్మకమైన ఐఐఎం ఏర్పాటుకు అనువైన స్థలాల కోసం జిల్లాలో సర్వే చేపట్టారు. దీంతో ఈ రెండు ప్రతిష్టాత్మక సంస్థలు ఎప్పుడెప్పుడు వస్తాయా.. అని ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే  జిల్లాలో వ్యవసాయ పరిశోధన కేంద్రం, అగ్రికల్చర్ కాలేజీ, వ్యవసాయ పాలిటెక్నిక్ కాలేజీ, చల్‌గల్ వ్యవసాయ ప్రదర్శన క్షేత్రాలున్నాయి. వీటికి సమీపంలో యూనివర్సిటీ నెలకొల్పితే జిల్లా అగ్రికల్చర్ హబ్‌గా వెలుగొందే అవకాశముంది. కేంద్రం పరిశీలనలో ఉన్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ విద్యాసంస్థ ఏర్పాటు చేస్తే సిరిసిల్ల ప్రాంతం అభివృద్ధికి నోచుకోనుంది.
 
రుణాలపైనే ఆశ..
వర్షాభావంతో ఖరీఫ్ సీజన్ కష్టకాలాన్ని తలపిస్తోంది. సాగువిస్తీర్ణం తగ్గిపోయింది. కేబినేట్‌లో తీసుకున్న నిర్ణయాల మేరకు రుణమాఫీ రైతులను ఊరిస్తోంది. జిల్లా పరిధిలో మొత్తంగా రూ.2984 కోట్లు మాఫీ చేసేందుకు సర్కారు తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తమవుతోంది. జిల్లాలో 5.05 లక్షల మందికి మేలు చేసే ఈ పథకాన్ని సకాలంలో అమలు చేస్తే.. బ్యాంకులు కొత్త రుణాలు పంపిణీ చేస్తాయని అన్నదాతలు ఆశగా ఎదురుచూస్తున్నారు.
 
రూ.10 వేల కోట్లు ?
ప్రజల భాగస్వామ్యంతో వినూత్నంగా రూపొందించిన మన గ్రామం.. మన మండలం.. మన జిల్లా ప్రణాళికలు తుది దశకు చేరుకున్నాయి. ప్రాధాన్య క్రమంలో గుర్తించిన పనులకు రూ.10 వేల కోట్లు అంచనా వ్యయమవుతుందని లెక్క తేలింది. బడ్జెట్‌లో ఈ ప్రణాళికలకు పెద్ద వాటా దక్కితే పల్లె పల్లెనా ప్రజలు కోరుకున్న తక్షణ సామాజిక అవసరాలు నెరవేరుతాయి.
 
పరిశ్రమలపై ఆశలు
అస్ట్రేలియాకు చెందిన కంపెనీ కరీంనగర్, మెదక్ జిల్లాలో ఇనుము, ఉక్కు కర్మాగారాల ఏర్పాటుకు ముందుకు రావటం కొత్త ఆశలు చిగురింపజేస్తోంది. కరీంనగర్‌లో ఇనుప ఖనిజం, ఉక్కు కర్మాగారాల ఏర్పాటుకు గొల్లపల్లి మండలంలో ఇనుప ఖనిజపు గుళికల తయారీ, ఉక్కు పరిశ్రమల ఏర్పాటుకు అస్ట్రేలియా కంపెనీ ప్రతిపాదనలు సమర్పించింది. దీనిపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాల్సి ఉంది.
 
ఎల్లంపల్లి ఎదురుచూపులు
కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో 2.50 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించేందుకు గోదావరిపై తలపెట్టిన ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణం దాదాపుగా పూర్తయింది. 20.175 టీఎంసీల నీటిని నిల్వ చేసేందుకు గోదావరి నదికి అడ్డంగా ఇక్కడ బ్యారేజీ నిర్మించారు. నాలుగేళ్లలోనే పూర్తి కావాల్సిన ఈ ప్రాజెక్టుకు ఇప్పటికే తొమ్మిదేళ్ల కాలం పట్టింది. రూ.3356 కోట్లు ఖర్చు చేసినప్పటికీ  నిర్వాసితులకు పునారావాస కాలనీలు, పరిహారపు సమస్యలు ఇప్పటికీ వెంటాడుతున్నాయి.
 
‘మానేరు’కు ప్రాణహితం

ప్రాణహిత-చేవెళ్ల సుజల స్రవంతి మెగా ప్రాజెక్టు... మిడ్ మానేరు ప్రాజెక్టులపై కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. నియోజకవర్గానికి లక్ష ఎకరాల సాగునీటిని అందించే ప్రణాళికలో భాగంగా ఈ పనులకు ప్రభుత్వం ప్రాధాన్యతగా ఎంచుకోవటం గమనార్హం. మిడ్‌మానేరు వరకు ప్రాణహిత ప్రాజెక్టు పనులను వేగంగా పూర్తి చేయాలని నిర్ణయించటంతో.. జిల్లాలో దాదాపు 80 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుంది. మిడ్‌మానేరు రిజర్వాయర్‌లో నీటిని నిల్వ చేస్తే.. సిరిసిల్ల, హుస్నాబాద్ నియోజకవర్గాల పరిధిలోని 10 మండలాలు, 157 గ్రామాలకు సాగునీరు, తాగునీటి సమస్య తీరిపోనుంది.
 
యూజీడీ కథ కంచికేనా..?
కరీంనగర్ నగర ప్రజలకు ప్రత్యక్షంగా నరకం చూపించిన అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులు అర్ధాతరంగా నిలిచిపోయాయి. ఏడేళ్లుగా రోడ్లను తవ్వి ఎక్కడికక్కడే వదిలేశారు. రూ.76.5 కోట్లతో చేపట్టిన ఈ పనుల్లో ఇప్పటికే రూ.55 కోట్లు చెల్లించారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, అధికారుల అలసత్వంతో ఈ పనులు ఆగిపోయాయి. సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ (ఎస్‌టీపీ) సివిల్ పనులు పూర్తయినా, ఎలక్ట్రికల్ మెకానిక్ ఫిట్టింగ్‌ల ఊసేలేదు. ఏడాదిగా కాంట్రాక్టర్ పనులు నిలిపేయడంతో.. ఈ పని రద్దు చేసినట్లేనా.. మళ్లీ రోడ్లు తవ్వి తోడే పని మొదలవుతుందా.. అనే ఆందోళన ప్రజలను పట్టి పీడిస్తోంది.
 
వలస బతుకులకేదీ భరోసా?
బతుకు దెరువుకు జిల్లా నుంచి వేలాది మంది విదేశాలకు తరలి వెళుతున్నారు. రోజుకో సంక్షోభంతో గల్ఫ్ దేశాలకు వెళ్లిన 3.5 లక్షల మంది వలస కార్మికుల ఉపాధి గాలిలో దీపంలా మారింది. అప్పులు తీర్చలేక.. తిరిగి రాలేక ఎంతో మంది తల్లడిల్లుతున్నారు. గల్ఫ్ బాధిత కుటుంబాలన్నీ తమకు భరోసా కావాలని.. తమ గోడు పట్టించుకోవాలని ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్నాయి. గల్ఫ్ బాధితులను ఆదుకునేందుకు కేరళ తరహాలో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్న హామీని ప్రభుత్వం నిలబెట్టుకోవాల్సిన అవసరముంది.
 
‘కేసీఆర్’ ప్రోగ్రాంకు శ్రీకారం
కరీంనగర్ సిటీ రెనోవేషన్ (కేసీఆర్) పేరిట స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ వినూత్న కార్యక్రమానికి రూపకల్పన చేశారు. ప్రజల నుంచి వచ్చే విరాళాలతో నగరపాలక సంస్థ భాగస్వామ్యంతో నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాలనే ఆలోచనకు కేసీఆర్ పేరు పెట్టారు. ఈ కార్యక్రమాన్ని కూడా కేసీఆర్ చేతుల మీదుగానే ప్రారంభించనున్నారు. దీనికోసం ఐదేళ్ల ప్రణాళికలను రూపొందించారు.
 
లక్ష మొక్కల పెంపం
జిల్లాకేంద్రంలో లక్ష మొక్కల పెంపకం కార్యక్రమానికి సీఎం చేతుల మీదుగా శ్రీకారం చుట్టనున్నారు. నగరంలోని ప్రధాన రోడ్లకు ఇరువైపుల లక్ష మొక్కలు నాటేందుకు రెండేళ్ల క్రితం పూనుకున్నారు. ఎన్టీపీసీ, కేశోరామ్ సిమెంట్ కంపెనీ ట్రీగార్డులు అందించేందుకు ముందుకు వచ్చాయి. కానీ.. కేవలం రెండు వేల మొక్కులే నాటి చేతులు దులుపుకున్నారు. వాటిని సైతం సంరక్షించలేకపోయారు. మళ్లీ అదే లక్ష మొక్కల కార్యక్రమానికి సీఎం చేతుల మీదుల మీదుగా ప్రారంభించనున్నారు. ఈసారైనా శ్రద్ధ చూపి పచ్చదనం కోసం పనిచేస్తారని ఆశిద్దాం.
 
ఆ మూడు ప్రాజెక్టులు అంతేనా..?
హుస్నాబాద్ మెట్ట ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే తోటపల్లి, గండిపల్లి, గౌరవెల్లి ప్రాజెక్టుల పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. చిగురుమామిడి మండలం ఓగుళాపూర్‌లో 1.71 టీఎంసీలతో నిర్మించే తోటపల్లి ప్రాజెక్టు పనులు ఇంతవరకు ప్రారంభం కాలేదు. హుస్నాబాద్ మండలం గౌరవెల్లి వద్ద 1.4.1 టీఎంసీల సామర్థ్యంతో నిర్మాణం చేపట్టిన గౌరవెల్లి జలాశయం పనులు సగంలోనే నిలిచిపోయి రెండేళ్లవుతోంది.

ఇదే మండలం గండిపల్లిలో 0.0518 టీఎంసీతో నిర్మించే రిజర్వాయర్ పనులు సైతం నత్తనడకనే సాగుతున్నాయి. ఓగుళాపూర్ రిజర్వాయర్‌నుంచి 38 కిలోమీటర్ల మేర కాల్వ నిర్మాణం పనులుచేపట్టాల్సి ఉండగా.. ఇందులో 12 కిలోమీటర్లు సొరంగమార్గం నిర్మించాల్సి ఉంది. ఈ సొరంగమార్గం ఇప్పటివరకు 70 శాతం పూర్తయింది.

భూసేకరణ, నిర్వాసుతులకు పరిహారం, నిధుల కొరత పనులకు అడ్డంకిగా మారింది. ఎన్నికల సమయంలో ఈ ఏడాది ఏప్రిల్ 17న హుస్నాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న కేసీఆర్ నియోకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరందిస్తామని హామీ ఇచ్చారు. ఈ మూడు జలాశయాలను పూర్తి చేస్తే 1.69 లక్షల ఎకరాలకు సాగునీరందుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement