రాష్ట్ర రాజధానికి 35 కి.మీ దూరంలో ఉన్న ప్రఖ్యాత శైవక్షేత్రం. చారిత్రక ప్రాముఖ్యత కలిగిన పుణ్యక్షేత్రం. ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరుగా నిలుస్తోంది కీసరగుట్ట. భక్తులు ఆధ్యాత్మికతతో పాటు ఆహ్లాదభరిత వాతావరణాన్ని ఆస్వాదించేందుకుఅనువైన దేవాలయం. మహా శివరాత్రిని పురస్కరించుకుని ఈ నెల 2 నుంచి 7వ తేదీ వరకు కీసరగుట్టలోని రామలింగేశ్వరుడి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. భక్తులు పెద్దసంఖ్యలో స్వామివారిని దర్శించుకోనున్నారు. ఈ సందర్భంగా కీసరగుట్ట ప్రత్యేకత, ఇక్కడి సందర్శనీయ ప్రాంతాలపై ప్రత్యేక కథనం.
ఆలయానికి మూడు ప్రత్యేకతలు..
ఇక్కడి శివాలయం పశ్చిమాభిముఖంగా ఉంది. గర్భగుడిలోని శివలింగం సైకత లింగంగా ప్రసిద్ధికెక్కింది. దేశంలో ఎక్కడాలేని విధంగా ఈ శివాలయానికి ఎదురుగా హనుమంతుడిచే విసిరివేసినట్లు చెబుతున్న శివలింగాలు చెల్లాచెదురుగా పడిఉన్నాయి. కీసరగుట్ట దాని పరిసర ప్రాంతాల్లో 107 శివలింగాలు ఉండగా.. చివరి లింగం యాదాద్రి జిల్లాకొలనుపాకలో ఉంది. జైన విగ్రహాలు కూడా ఉండటం ఇక్కడి మరో విశేషం.
ఆంజనేయస్వామి విగ్రహం: కీసరగుట్టలో భక్తుల విరాళాలతో ఇక్కడ 32 అడుగుల ఆంజనేయస్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. యాత్రికులకు ఈ విగ్రహం ఎంతో కనువిందుచేస్తుంది.
హుడాపార్కు
యాత్రికులు సేదతీరేందుకు కీసరగుట్ట దిగువ ప్రాంతంలో ప్రభుత్వం హుడాపార్కును అభివృద్ధి చేసింది. సుమారు 20 ఎకరాల్లో ఈ పార్కును సుందరంగా తీర్చిదిద్దారు. స్వామివారి దర్శనానంతరం భక్తులు ఈ పార్కులో సేదతీరవచ్చు.
టీటీడీ వేదపాఠశాల: కీసరగుట్ట దిగువ ప్రాంతంలో టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేద పాఠశాల ఉంది. భారతీయ సంసృతీ సంప్రదాయాలు, గురుకుల విద్య తరహాలో కొనసాగుతున్న వేదపాఠశాలను యాత్రికులు సందర్శించవచ్చు. ఇటీవల ఇక్కడ సుమారు 3 కోట్ల రూపాయల వ్యయంతో వేద విద్యార్థుల సౌకర్యార్థం వివిధ భవనాలను టీటీడీ నిర్మించింది.
దర్శనీయ ప్రాంతాలివీ..
సీతమ్మగుహ: ఏకశిలతో ఏర్పడిన సీతమ్మ గుహ సందర్శకులను ఆకట్టుకుంటుంది. మహిషా సురమర్దని ఆలయం ఈ గుహలో ఉంది. ప్రధాన ఆలయానికి ఈశాన్యంలో సీతమ్మ గుహ ఉంది. భక్తులు వెళ్లడానికి ఇటీవల కొత్తగా ఆలయం నుంచి సీతమ్మ గుహ వరకు మెట్లు నిర్మించారు.
మ్యూజియం: కీసరగుట్టను ఆయుధాగారంగా ఏర్పాటు చేసుకొని పాలన కొనసాగించిన విష్ణుకుండినుల చరిత్రకు ఆనవాలుగా, రాజ ప్రాసాదాలు, నాణేలు, ఇటీవల బయట పడిన జైనతీర్థంకుల విగ్రహాలు) తదితర అవశేషాలను తిలకించేందుకు మ్యూజియాన్ని యాత్రికులు తిలకించవచ్చు.
శివలింగాలు: కీసరగుట్టలో స్వామి వారి దర్శనానంతరం ప్రధాన ఆలయానికి ఎదురుగా ఉన్న 101 శివలింగాలను యాత్రికులు దర్శించవచ్చు. బ్రహ్మోత్సవాల సందర్భంగా శివలింగాలకు భక్తులు పాలు, పూలు, పసుపు, కుంకుమలతో పూజలు నిర్వహించడం ఆనవాయితీ.
తామర కొలను: ప్రధానకొండ దిగువ భాగంలో తెల్ల తామర కొలను యాత్రికులకు ఆహ్లాదాన్ని పంచుతుంది. గుట్ట ప్రాంతమంతా అక్కడక్కడా ఉన్న రాతి మండపాలు ఆధ్యాత్మిక
వాతావరణాన్ని ప్రతిబింబిస్తాయి.
అతిరథ మహాయాగంనిర్వహించిన ప్రదేశం
సప్త సోమయాగాల్లో ఒకటైన అతిరథ మహా యాగాన్ని తపస్ సంస్థ ఆధ్వర్యంలో కేరళకు చెందిన నంబూద్రి వంశస్తులు కీసరగుట్టలో 2013 ఏప్రిల్ మాసంలో పదిరోజుల పాటు కీసరగుట్టలో నిర్వహించారు. ఈ యాగంతో ఈ ప్రదేశం ఎంతో ప్రవిత్రతను సముపార్జించుకుంది. యాత్రికులు అతిరథ మహాయాగం జరిగిన స్థలాన్ని కూడా సందర్శించవచ్చు.
లక్ష్మీనరసింహస్వామి దేవాలయం: ప్రధాన ఆలయ సమీపంలో యోగి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం ఉంది. స్వామివారి దర్శనానంతరం భక్తులు ఇక్కడి యోగి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవచ్చు. కీసరస్వామి దర్శనానంతరం తిరుగు ప్రయాణంలో భక్తులు చీర్యాల లక్ష్మీనర్సింహస్వామి, నాగారంలోని శివాలయం, షిరిడీ సాయి బాబా దేవాలయాలను కూడా దర్శించుకోవచ్చు.
కీసరగుట్టకు ఇలాచేరుకోవచ్చు
సాధారణ రోజుల్లో కీసరగుట్టకు సికింద్రాబాద్ నుంచి బస్సు సౌకర్యం ఉంది. ఈసీఐఎల్ నుంచి 15 కి.మీ ప్రయాణిస్తే కీసరగుట్ట వస్తుంది. బ్రహ్మోత్సవాల సందర్భంగా నగరంలోని అన్ని ప్రాంతాలతో పాటు, యాదాద్రి తదితర జిల్లాల్లోని గ్రామాల నుంచి ఆర్టీసీ 300 ప్రత్యేక బస్సులు నడపనుంది. యాత్రికుల సౌకర్యార్థం పున్నమి హోటల్, టీటీడీ ధర్మశాల, గెస్ట్ హౌస్‌లున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment