
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ విత్తన సలహా మండలి అధ్యక్షునిగా రాష్ట్ర విత్తన, సేంద్రియ ధ్రువీకరణ సంస్థ సంచాలకుడు డాక్టర్ కె.కేశవులు ఎంపికయ్యారు. విత్తన భాండాగారంకోసం కృషి చేస్తున్న తెలంగాణకు ఇది అరుదైన అవకాశమని వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. ఈ సలహామండలిలో 8 మంది ఓఈసీడీ, ఇస్టా, ఐఎస్‌ఎఫ్ వంటి అంతర్జాతీయ విత్తన సంస్థల అధికారులు, విత్తన పరిశ్రమల ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. ఈ సలహా మండలి విత్తన పరిశ్రమ అవసరాలు, పరిశోధన అంశాలు, జాతీయ, అంతర్జాతీయ విత్తన నాణ్యత, అంతర్జాతీయ ఎగుమతి, దిగుమతులు, నియమ నిబంధనల రూపకల్పన తదితర విషయాలలో కీలక పాత్ర పోషించనుంది.
డాక్టర్ కేశవులు నియామకంతో దేశీయంగా విత్తన పరీక్షా కేంద్రాలను బలోపేతం చేయడం, విత్తన రంగంలో జాతీయ, అంతర్జాతీయ ప్రమాణాల మధ్య సమతుల్యత సాధించడం సులభతరమవుతుంది. నాణ్యమైన విత్తనోత్పత్తికి అవకాశం ఉంటుందని, విదేశాలకు విత్తన ఎగుమతులు గణనీయంగా పెరుగుతాయని కేశవులు తెలిపారు. కేశవులు నియామకం పట్ల వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి హర్షం వ్యక్తంచేశారు. రైతాంగానికి నాణ్యమైన విత్తనాలను అందించటానికి కేశవులు చేస్తున్న కృషిని ప్రశంసించారు. మన రాష్ట్రానికి చెందిన విత్తన శాస్త్రవేత్తకు ఈ హోదా దక్కడం అరుదైన విషయమన్నారు. విత్తన భాండాగారం సాధనకు విశేష కృషి జరుగుతున్న ఈ తరుణంలో ఇది శుభసూచకమని వ్యవసాయశాఖ కార్యదర్శి సి.పార్థసారథి, కమిషనర్ జగన్‌మోహన్ అన్నారు.