జేసీ నేర చరిత్రపై త్వరలో మూడో భాగం.. | Kethireddy Pedda Reddy Fires on JC Diwakar Reddy Frauds | Sakshi
Sakshi News home page

జేసీ గజదొంగ

Published Sat, Feb 8 2020 10:11 AM | Last Updated on Sat, Feb 8 2020 10:11 AM

Kethireddy Pedda Reddy Fires on JC Diwakar Reddy Frauds - Sakshi

అనంతపురం సెంట్రల్‌: ‘అధికారాన్ని అడ్డుపెట్టుకొని జేసీ సోదరులు తాడిపత్రిలో తమ నేర సామ్రాజ్యాన్ని విస్తరించారు. చివరకు రేషన్‌ బియ్యం కూడా వదలని గజదొంగలు’ అని తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శుక్రవారం ఆయన స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో వైఎస్సార్‌సీపీ నాయకులు కందిగోపుల మురళీమోహన్‌రెడ్డి కలిసి విలేకరులతో మాట్లాడారు. 2019 సెప్టెంబర్‌ 10న గుత్తిలో బలరాం అనే వ్యక్తి అక్రమంగా రేషన్‌ బియ్యాన్ని తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారని, అయితే ఇందుకు సంబంధించిన రికార్డులు, కేసు పూర్వాపరాలు పోలీసులు వెల్లడించలేదన్నారు. సదరు నిందితుడు జేసీ ప్రభాకర్‌రెడ్డి బినామీ అన్నారు. నకిలీ సర్టిఫికెట్ల దందాలో ఆంధ్ర , కర్ణాటక రాష్ట్రాల్లో పేరు మోసిన గుంతకల్లు చెందిన గ్లెయిన్‌ బ్రిక్స్‌ను జేసీ ప్రభాకర్‌రెడ్డి మించిపోయాడని పెద్దారెడ్డి విమర్శించారు. నకిలీ సీళ్లతో ఎన్‌ఓసీ పొంది బెంగళూరులో విక్రయించిన లారీలన్నీ జేసీ ప్రభాకర్‌రెడ్డి భార్య జేసీ ఉమారెడ్డి పేర్ల మీద ఉన్నాయన్నారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి పేరుతో కేవలం 2 వాహనాలే ఉండగా, జేసీ ఉమారెడ్డి పేరుతో ఏకంగా 80 వాహనాలు, కోడలు నిఖిలారెడ్డి పేరుతో 10 వాహనాలు ఉన్నట్లు వెల్లడైందన్నారు. సదరు వాహనాలన్నీ అక్రమమేనని, ఒకే నంబర్‌తో రెండు మూడు వాహనాలు నడపడం, ఇన్సూరెన్స్‌ తదితర రికార్డులన్నీ నకిలీవి సృష్టించారన్నారు. వీటికి సంబంధించిన ‘మీ–సేవ’ సర్టిఫికెట్లు కూడా నకిలీవేనన్నారు. అధికారులు పట్టుకుంటే ఇబ్బందలొస్తాయనుకున్న వాహనాలన్నింటినీ కుటుంబంలోని మహిళల పేర్లతో రిజిస్ట్రేషన్‌ చేయించడం చూస్తే.. జేసీ ప్రభాకర్‌రెడ్డి ఎంతకైనా దిగజారుతాడని అర్థమవుతోందన్నారు. 

సీఐ దాడి వెనుక జేసీ మంత్రాంగం
జేసీ ప్రభాకర్‌రెడ్డి తాడిపత్రిలో ఎవరికీ తెలియని చికెన్‌స్కాం(అధిక రేట్లకు విక్రయించి) నడిపాడన్నారు. మట్కా నిర్వాహకున్ని అరెస్ట్‌ చేయడానికి కడప జిల్లా నుంచి ఓ సీఐ వస్తే అతనిపై దాడి చేయించాడన్నారు. అంతేకాకుండా మట్కా నేరస్తున్ని కాపాడేందుకు ఎమ్మెల్యే హోదాలో రోడ్డుపై ధరా>్న చేసిన నీచమైన వ్యక్తి జేసీ ప్రభాకర్‌రెడ్డి అన్నారు. తాను ఎమ్మెల్యే అయిన తర్వాత తాడిపత్రిలో జేసీ సోదరులు చేసిన నేరాలు మొత్తం ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయన్నారు. దీన్ని తట్టుకోలేని జేసీ దివాకర్‌రెడ్డి ముఖ్యమంత్రిపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నాడన్నారు. జేసీ తన అక్రమ సంపాదన కోసం అక్రమ రూట్‌లో బస్సు నడిపి గతంలో ఆత్మ డీపీడీ ప్రసాద్‌ను పొట్టనపెట్టుకున్నాడన్నారు. ఇప్పటికే జేసీ నేరచరిత్రకు సంబంధించిన రెండు భాగాలు విడుదలయ్యాయని, త్వరలో మూడో భాగం విడుదలవుతుందన్నారు. జేసీ సోదరులు యల్లనూరు మండలం యల్లుట్ల అటవీ ప్రాంతంలో అక్రమ మైనింగ్‌ చేయగా.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే తాను దాన్ని అడ్డుకున్నానన్నారు. రాజీకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవని, ఎవరైనా నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలన్నారు. లేదంటే ఇప్పడు జేసీ సోదరులకు పట్టే గతే పడుతుందని హెచ్చరించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement