
ఖైరతాబాద్ భారీ గణేషుడి నిమజ్జనం పూర్తి
హైదరాబాద్ :నగరంలో లక్షలాది మంది భక్తులచే పూజలందుకున్న ఖైరతాబాద్ భారీ వినాయకుడిని హుస్సేన్ సాగర్లో నిమజ్జనం అయ్యాడు. మంగళవారం 8 గంటలపాటు సాగిన గణేషుడి శోభాయాత్రలో లక్షలాది మంది భక్తులు పాల్గొన్నారు. అధికారులు ఏర్పాటు చేసిన ప్రత్యేక క్రేన్తో వినాయకుడిని సాగర్ జలాల్లో నిమజ్జన కార్యక్రమం పూర్తి చేశారు. అరవై వసంతాలు పూర్తి చేసుకున్నసందర్భంగా 60 కేజీల భారీ విగ్రహంతో 11 రోజుల పాటు భక్తులను అలరించిన గణనాథుడు నేటి సాయంత్రం తల్లి గంగమ్మ ఒడిలో సేద తీరాడు.
గణనాధుడి నిమజ్జనాన్ని తిలకించేందుకు నగరవాసులు తరలి రావటంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ఖైరతాబాద్, తెలుగు తల్లి ఫ్లై ఓవర్, ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్ బండ్ ప్రాంతాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. తెలుగు తల్లి ఫ్లై ఓవర్ వద్ద ట్రాఫిక్ స్తంభించగా, సచివాలయం వెళ్లేవైపు కాసేపు రాకపోకలు ఆగిపోయాయి. పోలీసులు ట్రాఫిక్ను పునరుద్ధరించారు.