ఖానాపూర్ బస్టాండ్ ప్రాంతం
సాక్షి, ఖానాపూర్ : ప్రస్తుతం మేజర్ గ్రామపంచాయతీగా ఉన్న నియోజకవర్గ కేంద్రమైన ఖానాపూర్ (తిమ్మాపూర్)ను ప్రభుత్వం మున్సిపాలిటీగా ఏర్పాటు చేయనుంది. రాష్ట్రంలో కొత్తగా 28 మున్సిపాలిటీలు ఏర్పాటు చేస్తుండగా.. ఆ జాబితాలో ఖానాపూర్ కూడా ఉంది. సంబంధిత అధికారులు జిల్లా నుంచి ఖానాపూర్ (తిమ్మాపూర్) మున్సిపాలిటీ కోసం ఇప్పటికే ప్రతిపాదనలు కూడా పంపారు. 15వేల జనాభా ఉన్న మేజర్ పంచాయతీలను మున్సిపాలిటీలను చేయనున్న నేపథ్యంలో ఖానాపూర్‌లో ఇప్పటికే 20వేల పైచిలుకు జనాభా ఉండడంతో ఖానాపూర్ మున్సిపాలిటీగా మారడం ఖాయమైంది. మొదట్లో నగర పంచాయతీ ఏర్పాటవుతుందన్న క్రమంలో ప్రస్తుతం మున్సిపాలిటీ ఏర్పాటు కోసం ప్రక్రియ పూర్తికానుంది. ప్రభుత్వ ఉత్తర్వులు జారీ కావడమే తరువాయిగా ఉంది. ఇందుకోసం ప్రభుత్వం ముందుగా ప్రజాభిప్రాయ సేకరణకు గ్రామసభలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
వేగం కానున్న అభివృద్ధి..
మేజర్ గ్రామపంచాయతీల కంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మున్సిపాలిటీలకే ఎక్కువ నిధులు కేటాయిస్తున్నాయి. దీంతో ఖానాపూర్ ప్రజల చిరకాల కోరిక సెంటర్ లైటింగ్, రోడ్డు వెడల్పుతో పాటు ఆసుపత్రిలో అధునాతన సౌకర్యాలు మెరుగుపడి ఖానాపూర్ మరింత అభివృద్ధికి నోచుకోనుంది. ఇదివరకే ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించడంతో పాటు పంచాయతీ ఎన్నికలకు ముందే మున్సిపాలిటీలా ఏర్పాటు ప్రక్రియ ఉపందుకోవడంతో ఇదివరకు వార్డు మెంబర్, సర్పంచ్‌గా బరిలోకి దిగుతామన్న నేతలు, ప్రస్తుతం కౌన్సిలర్‌గా పోటీ చేస్తామనే ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. ప్రస్తుతం మేజర్ గ్రామపంచాయతీలో ఉన్న 20వార్డుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది. సమీపంలోని ఇతర గ్రామాలను విలీనం చేస్తే వాటి సంఖ్య రెట్టింపు కానుంది.
సామాన్యుల్లో ఒకింత ఆందోళన..
మున్సిపాలిటీ కావడంతో పేదలు ఇక్కడ భూమి కొనలేని పరిస్థితులు ఏర్పడనుండడంతో పాటు పన్నుల భారం కూడా పెరుగుతుందనే ఆందోళన సామాన్యుల్లో మొదలైంది. మున్సిపాలిటీ అయ్యాక భూముల ధరలు మరింత పెరిగి సామాన్యులకు సొంతింటి కల నెరవేరదేమోనని ఆందోళన వ్యక్తమవుతోంది. మున్సిపాలిటీ ఏర్పాటు నేపథ్యంలో ఇక్కడి భూములకు ధరలు పెరిగి రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే కొద్ది నెలలుగా ఈ విషయం తెరమీదికి రావడంతో ఖానాపూర్‌లో భూముల ధరలు ఆకాశాన్నంటాయి.
ఖానాపూర్ మరింత అభివృద్ధి
ప్రజాసంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది. 15వేల జనాభా దాటిన మేజర్‌పంచాయతీలను మున్సిపాలిటీ చేస్తుండడం హర్షనీయం. ఖానాపూర్‌ను మున్సిపాలిటీ చేస్తున్నందుకు సీఎంతో పాటు మంత్రి కేటీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు. ప్రభుత్వ నిర్ణయం ద్వారా ఖానాపూర్ మరింత అభివృద్ధి చెందనుంది. – రేఖానాయక్, ఎమ్మెల్యే
Comments
Please login to add a commentAdd a comment