new municipality
-
రాష్ట్రంలో కొత్త మున్సిపాలిటీల చట్టం
-
మున్సిపాలిటీగా ఖానాపూర్
సాక్షి, ఖానాపూర్ : ప్రస్తుతం మేజర్ గ్రామపంచాయతీగా ఉన్న నియోజకవర్గ కేంద్రమైన ఖానాపూర్ (తిమ్మాపూర్)ను ప్రభుత్వం మున్సిపాలిటీగా ఏర్పాటు చేయనుంది. రాష్ట్రంలో కొత్తగా 28 మున్సిపాలిటీలు ఏర్పాటు చేస్తుండగా.. ఆ జాబితాలో ఖానాపూర్ కూడా ఉంది. సంబంధిత అధికారులు జిల్లా నుంచి ఖానాపూర్ (తిమ్మాపూర్) మున్సిపాలిటీ కోసం ఇప్పటికే ప్రతిపాదనలు కూడా పంపారు. 15వేల జనాభా ఉన్న మేజర్ పంచాయతీలను మున్సిపాలిటీలను చేయనున్న నేపథ్యంలో ఖానాపూర్‌లో ఇప్పటికే 20వేల పైచిలుకు జనాభా ఉండడంతో ఖానాపూర్ మున్సిపాలిటీగా మారడం ఖాయమైంది. మొదట్లో నగర పంచాయతీ ఏర్పాటవుతుందన్న క్రమంలో ప్రస్తుతం మున్సిపాలిటీ ఏర్పాటు కోసం ప్రక్రియ పూర్తికానుంది. ప్రభుత్వ ఉత్తర్వులు జారీ కావడమే తరువాయిగా ఉంది. ఇందుకోసం ప్రభుత్వం ముందుగా ప్రజాభిప్రాయ సేకరణకు గ్రామసభలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. వేగం కానున్న అభివృద్ధి.. మేజర్ గ్రామపంచాయతీల కంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మున్సిపాలిటీలకే ఎక్కువ నిధులు కేటాయిస్తున్నాయి. దీంతో ఖానాపూర్ ప్రజల చిరకాల కోరిక సెంటర్ లైటింగ్, రోడ్డు వెడల్పుతో పాటు ఆసుపత్రిలో అధునాతన సౌకర్యాలు మెరుగుపడి ఖానాపూర్ మరింత అభివృద్ధికి నోచుకోనుంది. ఇదివరకే ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించడంతో పాటు పంచాయతీ ఎన్నికలకు ముందే మున్సిపాలిటీలా ఏర్పాటు ప్రక్రియ ఉపందుకోవడంతో ఇదివరకు వార్డు మెంబర్, సర్పంచ్‌గా బరిలోకి దిగుతామన్న నేతలు, ప్రస్తుతం కౌన్సిలర్‌గా పోటీ చేస్తామనే ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. ప్రస్తుతం మేజర్ గ్రామపంచాయతీలో ఉన్న 20వార్డుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది. సమీపంలోని ఇతర గ్రామాలను విలీనం చేస్తే వాటి సంఖ్య రెట్టింపు కానుంది. సామాన్యుల్లో ఒకింత ఆందోళన.. మున్సిపాలిటీ కావడంతో పేదలు ఇక్కడ భూమి కొనలేని పరిస్థితులు ఏర్పడనుండడంతో పాటు పన్నుల భారం కూడా పెరుగుతుందనే ఆందోళన సామాన్యుల్లో మొదలైంది. మున్సిపాలిటీ అయ్యాక భూముల ధరలు మరింత పెరిగి సామాన్యులకు సొంతింటి కల నెరవేరదేమోనని ఆందోళన వ్యక్తమవుతోంది. మున్సిపాలిటీ ఏర్పాటు నేపథ్యంలో ఇక్కడి భూములకు ధరలు పెరిగి రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే కొద్ది నెలలుగా ఈ విషయం తెరమీదికి రావడంతో ఖానాపూర్‌లో భూముల ధరలు ఆకాశాన్నంటాయి. ఖానాపూర్ మరింత అభివృద్ధి ప్రజాసంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది. 15వేల జనాభా దాటిన మేజర్పంచాయతీలను మున్సిపాలిటీ చేస్తుండడం హర్షనీయం. ఖానాపూర్‌ను మున్సిపాలిటీ చేస్తున్నందుకు సీఎంతో పాటు మంత్రి కేటీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు. ప్రభుత్వ నిర్ణయం ద్వారా ఖానాపూర్ మరింత అభివృద్ధి చెందనుంది. – రేఖానాయక్, ఎమ్మెల్యే -
కొత్త పురపాలికలపై ఆస్తి పన్ను మోత
-
కొత్త పురపాలికలపై ఆస్తి పన్ను మోత
సాక్షి, హైదరాబాద్: కొత్త పురపాలికల ప్రజల నడ్డి విరిగింది. ఆస్తి పన్నుల డిమాండు నోటీసులు గుండె దడ పుట్టిస్తున్నాయి. ఒక్కసారిగా ఆస్తి పన్నులు భారీగా పెరిగిపోవడంతో ప్రజలు లబోదిబోమంటున్నారు. గ్రామ పంచాయతీలుగా ఉన్నప్పుడు చెల్లించిన పన్నుతో పోల్చితే 30 శాతం పెరిగిపోవడంతో ఆందోళనకు గురవుతున్నారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన 31 నగర పంచాయతీలు, మున్సిపాలిటీల్లో ఆస్తి పన్నుల సవరణ గత ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. గ్రామ పంచాయతీలుగా ఉన్నప్పుడు నామమాత్రంగా ఆస్తి పన్ను వసూలు చేసేవారు. మున్సిపల్ చట్టం మేరకు ఈ కొత్త పురపాలికల్లో ఆస్తి పన్ను సవరణ కోసం ప్రభుత్వం చేపట్టిన చర్యలు కొలిక్కి వచ్చాయి. గ్రామ పంచాయతీలుగా ఉన్నప్పుడు రూ. 162.04 కోట్లున్న ఆస్తి పన్ను డిమాండు .. నగర పంచాయతీలుగా మారిన తర్వాత రూ. 215 కోట్లకు పెరిగింది. ఈ పురపాలికల్లో ప్రజలపై రూ.50 కోట్లకు పైనే అదనపు భారం పడింది. 31 కొత్త మున్సిపాలిటీలతో పాటు వందలాది విలీన గ్రామాల పరిధిలోని 50 వేల నివాస, నివాసేతర సముదాయాలపైనా పన్నుల పెంపు పడనుంది. పన్నుల సవరణ ప్రక్రియ ముగియడంతో తాజాగా అన్ని నగర పంచాయతీలు, మున్సిపాలిటీల్లో ప్రజలకు డిమాండు నోటీసులు జారీ చేస్తున్నారు. వార్షిక అద్దె విలువ ఆధారంగా ఆస్తి పన్నును నిర్ణయించడంతో విలువైన ప్రాంతాల్లో ఉన్న నివాస, నివాసేతర భవనాల పన్నులు రెండు మూడు రెట్లు పెరిగాయి. దీంతో పన్నుల సవరణను పునఃసమీక్షించాలని కోరుతూ భారీ ఎత్తున దరఖాస్తులు వస్తున్నాయి. విలీన గ్రామాలపై పిడుగు రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో వందల సంఖ్యలో శివారు గ్రామాలు విలీనమయ్యాయి. పురపాలికల పరిధిలోకి వచ్చిన ఈ గ్రామాల్లో సైతం ఆస్తి పన్నుల సవరణ అమలు చేస్తున్నారు. శివారు గ్రామ పంచాయతీలను విలీనం చేయడంతో వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్లో రూ.1.76 కోట్లు, నిజామాబాద్ కార్పొరేషన్లో రూ.3.64 కోట్లు, కరీంనగర్ కార్పొరేషన్లో రూ.2.93 కోట్లు, రామగుండంలో రూ.2.93 కోట్లు ఆస్తి పన్నులు పెరిగాయి. పన్నులు సరే.. సదుపాయాలేవీ! గత కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ల కిందట ఉన్నఫళంగా ఈ గ్రామ పంచాయతీల స్థాయిని పెంచి నగర పంచాయతీలు, మున్సిపాలిటీల హోదాను కల్పించింది. గతేడాది అక్టోబర్‌లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ కొత్త పురపాలికల్లో ఆస్తి పన్నుల పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేవలం పేరుకే హోదా పెరిగినా.. నేటికీ ఈ ప్రాంతాల్లో ఎలాంటి అభివృద్ధి పనులను ప్రభుత్వాలు చేపట్టలేదు. కనీసం తాగునీటి సరఫరా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెగ్యులర్ మున్సిపల్ కమిషనర్లు లేక చాలా నగర పంచాయతీల బాగోగులు పట్టించుకునే వారే కరువయ్యారు. కనీస వసతులను కల్పించకుండానే ఆస్తి పన్నులను భారీగా పెంచడం పట్ల ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. -
కొత్త మున్సిపాలిటీల కథ కంచికే!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: కొత్త మున్సిపాలిటీల కథ ముగిసింది. ‘ప్రాదేశిక’ సమరానికి నోటిఫికేషన్ జారీ కావడంతో శివార్లలోని 35 పంచాయతీలను కొత్త మున్సిపాలిటీల పరిధిలోకి తేవాలనే ప్రతిపాదనలకు ఫుల్స్టాప్ పడినట్లయింది. నగరీకరణ నేపథ్యంలో రాజధానిని ఆనుకొని ఉన్న గ్రామాలను హైదరాబాద్ నగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ)లో విలీనం చేయాలని ప్రభుత్వం భావించింది. ఈ ప్రతిపాదనలకు స్థానిక ప్రజాప్రతినిధుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురుకావడంతోపాటు వీటి విలీనం అంశంలో చట్ట ప్రకారం నడుచుకోలేదని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఈ ప్రతిపాదనలను వెన క్కి తీసుకున్న రాష్ట్ర సర్కారు.. వీటన్నింటిని కలుపుతూ 12 కొత్త పురపాలక సంఘాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అందుకనుగుణంగా ఆయా పంచాయతీల్లో తీర్మానాలను కూడా చేసి ప్రభుత్వానికి జిల్లా యంత్రాంగం నివేదించింది. రాష్ర్ట విభజన అనంతరం చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో సీఎం పదవికి కిరణ్‌కుమార్‌రెడ్డి రాజీనామా చేయడంతో ఫైలుకు మోక్షం కలగలేదు. మరోవైపు ‘ప్రాదేశిక’ ఎన్నికలు నిర్వహించాల్సిందేనని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. దీంతో అనివార్యంగా వీటికి కూడా ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మున్సిపాలిటీలుగా మార్చే అంశం పరిశీలనలో ఉందని, ఈ గ్రామాలను మండల/జెడ్పీటీసీ ఎన్నికల నుంచి మినహాయించాలని న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయాలని ఒక దశలో ప్రభుత్వం భావించింది. ప్రస్తుతం రాష్ట్రపతి పాలనలో సాగుతుండడంతో దీనిపై నిర్ణయం తీసుకునే సాహసం పంచాయతీరాజ్, పురపాలకశాఖలు చేయలేకపోయాయి. మరోవైపు సమయాభావం కూడా ఈ ఎన్నికలపై ప్రభావం చూపాయి. ఈ నేపథ్యంలోనే సోమవారం శివార్లలోని 35 గ్రామాల్లో ఎంపీటీసీ/జెడ్పీటీసీ పోరు మొదలైంది. ప్రాదేశిక పోరు ఈ గ్రామాల్లో ఉండదని భావించిన స్థానిక నేతలు.. అనూహ్యంగా తెరపైకి వచ్చిన ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు చకచకా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. త్వరలో పంచాయతీ ఎన్నికలు! ‘పురపాలిక’ల అంశం ముగియడంతో త్వరలోనే ఈ గ్రామాలకు పంచాయతీ ఎన్నికలు జరుగనున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగగానే పలు గ్రామాల ప్రజాప్రతినిధులు కోర్టుకెక్కారు. తమ గ్రామాలకు పంచాయతీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించకుండా ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా వాయిదా వేస్తోందని, ఫలితంగా గ్రామంలో అభివృద్ధి కొరవడిందని న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు.. 11 శివారు గ్రామాలకు ఏప్రిల్ 15లోగా ఎన్నికలు నిర్వహించాలని స్పష్టం చేసింది. దీంతో ఈ పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. వీటికేకాకుండా.. కొత్త మున్సిపాలిటీల పరిధిలోకి తేవాలనుకున్న మిగతా పంచాయతీల(24)కు త్వరలోనే సర్పంచ్ ఎన్నికలు జరుగనున్నాయి. ప్రస్తుతం సార్వత్రిక, మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో తలమునకలైన రాష్ట్ర ఎన్నికల కమిషన్ త్వరలోనే వీటికి కూడా షెడ్యూల్‌ను విడుదల చేసే అవకాశముంది.