కొత్త పురపాలికలపై ఆస్తి పన్ను మోత
సాక్షి, హైదరాబాద్: కొత్త పురపాలికల ప్రజల నడ్డి విరిగింది. ఆస్తి పన్నుల డిమాండు నోటీసులు గుండె దడ పుట్టిస్తున్నాయి. ఒక్కసారిగా ఆస్తి పన్నులు భారీగా పెరిగిపోవడంతో ప్రజలు లబోదిబోమంటున్నారు. గ్రామ పంచాయతీలుగా ఉన్నప్పుడు చెల్లించిన పన్నుతో పోల్చితే 30 శాతం పెరిగిపోవడంతో ఆందోళనకు గురవుతున్నారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన 31 నగర పంచాయతీలు, మున్సిపాలిటీల్లో ఆస్తి పన్నుల సవరణ గత ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చింది.
గ్రామ పంచాయతీలుగా ఉన్నప్పుడు నామమాత్రంగా ఆస్తి పన్ను వసూలు చేసేవారు. మున్సిపల్ చట్టం మేరకు ఈ కొత్త పురపాలికల్లో ఆస్తి పన్ను సవరణ కోసం ప్రభుత్వం చేపట్టిన చర్యలు కొలిక్కి వచ్చాయి. గ్రామ పంచాయతీలుగా ఉన్నప్పుడు రూ. 162.04 కోట్లున్న ఆస్తి పన్ను డిమాండు .. నగర పంచాయతీలుగా మారిన తర్వాత రూ. 215 కోట్లకు పెరిగింది. ఈ పురపాలికల్లో ప్రజలపై రూ.50 కోట్లకు పైనే అదనపు భారం పడింది.
31 కొత్త మున్సిపాలిటీలతో పాటు వందలాది విలీన గ్రామాల పరిధిలోని 50 వేల నివాస, నివాసేతర సముదాయాలపైనా పన్నుల పెంపు పడనుంది. పన్నుల సవరణ ప్రక్రియ ముగియడంతో తాజాగా అన్ని నగర పంచాయతీలు, మున్సిపాలిటీల్లో ప్రజలకు డిమాండు నోటీసులు జారీ చేస్తున్నారు. వార్షిక అద్దె విలువ ఆధారంగా ఆస్తి పన్నును నిర్ణయించడంతో విలువైన ప్రాంతాల్లో ఉన్న నివాస, నివాసేతర భవనాల పన్నులు రెండు మూడు రెట్లు పెరిగాయి. దీంతో పన్నుల సవరణను పునఃసమీక్షించాలని కోరుతూ భారీ ఎత్తున దరఖాస్తులు వస్తున్నాయి.
విలీన గ్రామాలపై పిడుగు
రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో వందల సంఖ్యలో శివారు గ్రామాలు విలీనమయ్యాయి. పురపాలికల పరిధిలోకి వచ్చిన ఈ గ్రామాల్లో సైతం ఆస్తి పన్నుల సవరణ అమలు చేస్తున్నారు. శివారు గ్రామ పంచాయతీలను విలీనం చేయడంతో వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్‌లో రూ.1.76 కోట్లు, నిజామాబాద్ కార్పొరేషన్లో రూ.3.64 కోట్లు, కరీంనగర్ కార్పొరేషన్‌లో రూ.2.93 కోట్లు, రామగుండంలో రూ.2.93 కోట్లు ఆస్తి పన్నులు పెరిగాయి.
పన్నులు సరే.. సదుపాయాలేవీ!
గత కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ల కిందట ఉన్నఫళంగా ఈ గ్రామ పంచాయతీల స్థాయిని పెంచి నగర పంచాయతీలు, మున్సిపాలిటీల హోదాను కల్పించింది. గతేడాది అక్టోబర్‌లో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఈ కొత్త పురపాలికల్లో ఆస్తి పన్నుల పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేవలం పేరుకే హోదా పెరిగినా.. నేటికీ ఈ ప్రాంతాల్లో ఎలాంటి అభివృద్ధి పనులను ప్రభుత్వాలు చేపట్టలేదు.
కనీసం తాగునీటి సరఫరా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెగ్యులర్ మున్సిపల్ కమిషనర్లు లేక చాలా నగర పంచాయతీల బాగోగులు పట్టించుకునే వారే కరువయ్యారు. కనీస వసతులను కల్పించకుండానే ఆస్తి పన్నులను భారీగా పెంచడం పట్ల ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది.