సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: కొత్త మున్సిపాలిటీల కథ ముగిసింది. ‘ప్రాదేశిక’ సమరానికి నోటిఫికేషన్ జారీ కావడంతో శివార్లలోని 35 పంచాయతీలను కొత్త మున్సిపాలిటీల పరిధిలోకి తేవాలనే ప్రతిపాదనలకు ఫుల్‌స్టాప్ పడినట్లయింది. నగరీకరణ నేపథ్యంలో రాజధానిని ఆనుకొని ఉన్న గ్రామాలను హైదరాబాద్ నగర పాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ)లో విలీనం చేయాలని ప్రభుత్వం భావించింది. ఈ ప్రతిపాదనలకు స్థానిక ప్రజాప్రతినిధుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురుకావడంతోపాటు వీటి విలీనం అంశంలో చట్ట ప్రకారం నడుచుకోలేదని హైకోర్టు స్పష్టం చేసింది.
దీంతో ఈ ప్రతిపాదనలను వెన క్కి తీసుకున్న రాష్ట్ర సర్కారు.. వీటన్నింటిని కలుపుతూ 12 కొత్త పురపాలక సంఘాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అందుకనుగుణంగా ఆయా పంచాయతీల్లో తీర్మానాలను కూడా చేసి ప్రభుత్వానికి జిల్లా యంత్రాంగం నివేదించింది. రాష్ర్ట విభజన అనంతరం చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో సీఎం పదవికి కిరణ్‌కుమార్‌రెడ్డి రాజీనామా చేయడంతో ఫైలుకు మోక్షం కలగలేదు. మరోవైపు ‘ప్రాదేశిక’ ఎన్నికలు నిర్వహించాల్సిందేనని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. దీంతో అనివార్యంగా వీటికి కూడా ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
మున్సిపాలిటీలుగా మార్చే అంశం పరిశీలనలో ఉందని, ఈ గ్రామాలను మండల/జెడ్పీటీసీ ఎన్నికల నుంచి మినహాయించాలని న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయాలని ఒక దశలో ప్రభుత్వం భావించింది. ప్రస్తుతం రాష్ట్రపతి పాలనలో సాగుతుండడంతో దీనిపై నిర్ణయం తీసుకునే సాహసం పంచాయతీరాజ్, పురపాలకశాఖలు చేయలేకపోయాయి. మరోవైపు సమయాభావం కూడా ఈ ఎన్నికలపై ప్రభావం చూపాయి. ఈ నేపథ్యంలోనే సోమవారం శివార్లలోని 35 గ్రామాల్లో ఎంపీటీసీ/జెడ్పీటీసీ పోరు మొదలైంది. ప్రాదేశిక పోరు ఈ గ్రామాల్లో ఉండదని భావించిన స్థానిక నేతలు.. అనూహ్యంగా తెరపైకి వచ్చిన ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు చకచకా ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
త్వరలో పంచాయతీ ఎన్నికలు!
‘పురపాలిక’ల అంశం ముగియడంతో త్వరలోనే ఈ గ్రామాలకు పంచాయతీ ఎన్నికలు జరుగనున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగగానే పలు గ్రామాల ప్రజాప్రతినిధులు కోర్టుకెక్కారు. తమ గ్రామాలకు పంచాయతీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించకుండా ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా వాయిదా వేస్తోందని, ఫలితంగా గ్రామంలో అభివృద్ధి కొరవడిందని న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు.. 11 శివారు గ్రామాలకు ఏప్రిల్ 15లోగా ఎన్నికలు నిర్వహించాలని స్పష్టం చేసింది. దీంతో ఈ పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. వీటికేకాకుండా.. కొత్త మున్సిపాలిటీల పరిధిలోకి తేవాలనుకున్న మిగతా పంచాయతీల(24)కు త్వరలోనే సర్పంచ్ ఎన్నికలు జరుగనున్నాయి. ప్రస్తుతం సార్వత్రిక, మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో తలమునకలైన రాష్ట్ర ఎన్నికల కమిషన్ త్వరలోనే వీటికి కూడా షెడ్యూల్‌ను విడుదల చేసే అవకాశముంది.
కొత్త మున్సిపాలిటీల కథ కంచికే!
Published Mon, Mar 17 2014 11:41 PM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM
Advertisement