కొనుగోల తప్పదా! | Kharif are behind mahilasanghalu to buy grain | Sakshi
Sakshi News home page

కొనుగోల తప్పదా!

Published Thu, Oct 2 2014 2:54 AM | Last Updated on Sat, Sep 2 2017 2:14 PM

Kharif are behind mahilasanghalu to buy grain

నీలగిరి :ఖరీఫ్ ధాన్యం కొనుగోలు చేసేందుకు మహిళాసంఘాలు వెనుకడుగు వేస్తున్నాయి. కొనుగోళ్ల భారమంతా కూడా సంఘాలు భరించాల్సి రావడమే దీనికి ప్రధాన కారణం. కేంద్రప్రభుత్వం లెవీ సేకరణలో మిల్లుల వాటాను పూర్తిగా తగ్గించిన నేపథ్యంలో  ధాన్యం సేకరణ మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలపైనే పడింది. అది కాస్తా ఖరీఫ్ సీజన్ నుంచే ప్రారంభంకావడంతో జిల్లా యంత్రాంగం ఉక్కిరిబిక్కిరవుతోంది. లెవీ మార్పు కారణంగా గతేడాదితో పోలిస్తే ఈ సీజన్‌లో ఐకేపీ, సహకార కేంద్రాలు రెట్టింప య్యాయి. దీంతో పాటు ధాన్యం కొనుగోళ్ల లక్ష్యాన్ని కూడా పెంచారు. ధాన్యం సేకరణలో మిల్లర్ల గుత్తాధిపత్యాన్ని నివారించి..పండిన పంటకు రైతుకు పూర్తి మద్దతు చెల్లించే క్రమంలో కేంద్రం తీసుకున్న నిర్ణయం పర్వాలేదనిపించినా ధాన్యం కొనుగోళ్ల విషయానికొచ్చేసరికి ఆర్థికంగా మహిళాసంఘాలు నష్టపోయే పరిస్థితి ఏర్పడింది.
 
 మోయలేని భారం...
 కొత్త లెవీ మార్గదర్శకాల ప్రకారం మిల్లర్లు కొనుగోలు చేసిన ధాన్యంలో 75 శాతం బియ్యాన్ని బహిరంగ మార్కెట్లో అమ్ముకోవచ్చు. మిగిలిన 25 శాతం బియ్యాన్ని ప్రభుత్వం లెవీగా సేకరిస్తుంది. మిల్లర్లు సిండికేట్‌గా ఏర్పడి బియ్యం మార్కెట్‌ను తమ గుప్పిట్లో పెట్టుకోకుండా నియంత్రించేందుకుగాను ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను రెట్టింపు చేసింది. ప్రధానంగా ప్రజాపంపిణీ అవసరాల దృష్ట్యా బియ్యం కొరత రాకుండా ఉండేలా చర్యలు చేపట్టింది. కానీ ఐకేపీ కేంద్రాలు ధాన్యం కొనేందుకు అవసరమైన మౌలిక వసతుల విషయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సాయం అందడం లేదు. కొనుగోలుకు అవసరమయ్యే టార్పాలిన్లు, కాంటాలు, చిన్నత్రాసులు, వరిశుద్ధి యంత్రాలను సంఘాలే కొనుగోలు చేయాలని అధికారులు తేల్చిచెప్పారు.
 
 వీటి కొనుగోలుకు అవసరమయ్యే వ్యయాన్ని సంఘాలకు సమకూరే ధాన్యం కమీషన్ నుంచే తీసుకోవాలని చెప్పడంతో వారు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే వివిధ సాకులతో ధాన్యం కమీషన్‌లో అధికారులు కోత విధిస్తున్నారు. తాజాగా కొనుగోలుకు అవసరయ్యే ఖర్చులన్నింటినీ సంఘాలే భరించాలని చెప్పడంతో ఐకేపీ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు సంఘాలు  ముందుకు రావట్లేదు. తిరుమలగిరి మండలం జలాల్‌పురం, తాటిపాముల, ఈటూరు సంఘాలు ఐకేపీ సెంటర్లు ఏర్పాటు చేయబోమని అధికారులకు స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి జిల్లా కేంద్రంలో మహిళా సంఘాలకు నిర్వహించిన శిక్షణ కు  కూడా 40 సంఘాలకు మించి హాజరుకాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ధాన్యం కొనుగోళ్లపైఅధికార యంత్రాంగంలో సందిగ్ధత నెలకొంది.
 
 రెట్టింపైన కేంద్రాలు...
 కిందటేడు ఖరీఫ్ సీజన్‌లో ఐకేపీ, పీఏసీఎస్‌లు కలిపి మొత్తం 55 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆ సీజన్‌లో కేవలం 56 వేల క్వింటాళ్ల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారు. కానీ ప్రస్తుతం మారిన పరిస్థితుల నేపథ్యంలో ఐకేపీ ఆధ్వర్యంలో 80, పీఏసీఎస్‌లు 42 కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ సీజన్‌లో వరి 1.55 లక్షల హెక్టార్లలో సాగైంది. దీనికిగాను 7.55 లక్షల క్వింటాళ్ల  ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. దీంట్లో ఐకేపీ 75 వేలు, పీఏసీఎస్‌లు 30 వేల క్వింటాళ్లు కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. అయితే ఈ సీజన్‌లో బీపీటీ బియ్యం (సన్న బియ్యం) దిగుబడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొనుగోళ్లు నామమాత్రంగానే ఉంటాయి. కానీ రబీ సీజన్‌కు వచ్చే సరికి మాత్రం నాన్ బిపీటీ బియ్యం కొనేందుకు ప్రభుత్వ సంస్థలు, మిల్లర్లకు మధ్య పోటీ తీవ్రంగానే ఉంటుంది. ఈ విషయమై డీఆర్‌డీఏ ప్రాజెక్ట్ డెరైక్టర్ చిర్రా సుధాకర్ ‘సాక్షి’ తో మాట్లాడుతూ కొనుగోళ్లకు అవసరమయ్యే మౌలిక వసతులను సంఘాలే సమకూర్చుకోవాలన్నారు. ఈ నెల రెండోవారం నుంచి కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తామన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement