ముగ్గురిని బలిగొన్న అతివేగం
- మరొకరి పరిస్థితి విషమం
- మృతుల్లో నవదంపతులు
- నకిరేకల్ సమీపంలోదుర్ఘటన
- మృతులంతా ఖమ్మం జిల్లా వాసులు
నకిరేకల్, న్యూస్‌లైన్ : అతివేగం మూడు నిండు ప్రాణాలను బలిగొంది. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. కారును మితిమీరిన వేగంతో నడుపుతూ ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్‌టేక్ చేయబోయి రోడ్డు పక్కనున్న కల్వర్టు గోడను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. వీరిలో ఇద్దరు నవదంపతులున్నారు. ఈ విషాదకర ఘటన నకిరేకల్ బైపాస్ వద్ద సోమవారం ఉదయం చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా ఇల్లందుకు చెందిన బుక్యవరపు వెంకటకృష్ణప్రసాద్(31) అతని భార్య బుక్యవరపు సౌమ్య హైదరాబాద్‌లోని మియాపూర్‌లో నివాసం ఉంటున్నారు. వెంకటకృష్ణప్రసాద్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా, సౌమ్య మల్లారెడ్డి కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. శుభకార్యం ఉండటంతో వీరిద్దరూ స్వగ్రామం వెళ్లారు. తిరుగుప్రయాణంలో వెంకటకృష్ణప్రసాద్ బావ సత్తుపల్లికి చెందిన తిన్నవల్లి చైతన్యకుమార్-విష్ణుప్రియ దంపతులతో కలిసి కారులో ఇల్లందు నుంచి హైదరాబాద్‌కు బయలుదేరారు.
ఉదయం 7 సమయంలో నకిరేకల్ బైపాస్ వద్దకు రాగానే కారు నడుపుతున్న వెంకటకృష్ణప్రసాద్ అతివేగంగా ముందు వెళ్తున్న వాహనాన్ని తప్పించబోయే క్రమంలో రోడ్డు పక్కనున్న కల్వర్టు గోడను ఢీకొట్టాడు. ఈ ఘటనలో కారు ముందు సీట్లో కూర్చున్న సౌమ్య అక్కడికక్కడే మృతి చెందగా వెంకటకృష్ణప్రసాద్, అతని బావ తిన్నవల్లి చైతన్యకుమార్(31), విష్ణుప్రియలు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తరలిం చారు. పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌లోని ఎల్బీ నగర్ కామినేని వైద్యశాలకు తరలించగా చికిత్స పొందు తూ వెంకటకృష్ణప్రసాద్, చైతన్యకుమార్‌లు మృతి చెందారు. విష్ణుప్రియ చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది.
ఘటనా స్థలాన్ని సందర్శించిన పోలీసులు
ప్రమాద స్థలిని నకిరేకల్ సీఐ నాగేశ్వర్, ఎస్‌ఐ ప్రసాద్‌రావులు సందర్శించారు. సౌమ్య మృతదేహానికి నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం బంధువులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ తెలిపారు.
నాలుగు నెలల క్రితమే వివాహం
రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వెంకటకృష్ణప్రసాద్‌కు కరీంనగర్‌కు చెందిన సౌమ్యతో నాలుగు నెలల క్రితమే వివాహం జరిగింది. శుభకార్యం నిమిత్తం ఇల్లందుకు వెళ్లి తిరిగి హైదరాబాద్‌కు వస్తుండగా రోడ్డు ప్రమాద రూపంలో మృత్యువు వారిని కబళించింది. వారిద్దరి మృతితో ఇరు కుటుంబాల సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.