సాక్షి, సిటీబ్యూరో : బస్తీలు, కాలనీల్లో ఉన్న చిన్న చిన్న కిరాణా షాపులు కరోనా వైరస్‌కు కేంద్రంగా మారుతున్నాయి. బేగంబజార్, మలక్‌పేట్ గంజ్ హోల్‌సేల్ మార్కెట్ వ్యాపారుల నుంచి చిరు వ్యాపారులకు వైరస్ విస్తరిస్తుంది. వీరి ద్వారా వారి కుటుంబ సభ్యులకు, కాలనీల్లోని కొనుగోలుదారులకు వైరస్ సోకుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా శివారు ప్రాంతాల్లోని బస్తీలు, కాలనీల్లోని చిన్న చిన్న కిరాణా షాపు నిర్వాహకుల్లో చాలా మందికి కరోనాపై సరైన అవగాహన లేదు. వీరు హోల్ సేల్ దుకాణాల నుంచి వస్తువులు తెచ్చిన తర్వాత వాటిపై శానిటైజ్ స్ప్రేలు చల్లడం లేదు. కనీసం షాపునకు వచ్చిన వారు సామాజిక దూరం పాటిస్తున్నారో..? లేదో కూడా చూడటం లేదు. అంతే కాదు వీరిలో ఎవరికి..? ఏ ఆరోగ్య సమస్య ఉందో..? గుర్తించక పోవడం..ఆయా వస్తువులనే నేరుగా కొనుగోలదారుల చేతికి అందిస్తుండటం..వారు ఇచ్చిన నగదును నేరుగా తీసుకోవడం వల్ల ఒకరి నుంచి మరొకరికి వైరస్ సోకుతున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. (లాక్‌డౌన్ : వర్క్ ఫ్రం హోమ్ చాలా బాగుంది)
ఆ ఇద్దరి నుంచే ముగ్గురు వ్యాపారులకు...
జల్‌పల్లి, పహడీషరీఫ్‌కు చెందిన ఇద్దరు వ్యక్తుల వల్ల మలక్‌పేటగంజ్‌లోని ముగ్గురు వ్యాపారులకు కరోనా సోకింది. ఇటీవల నమోదవుతున్న కేసుల్లో చాలా వరకు మలక్‌పేట్‌గంజ్ మూలాలే ఉండటం ఆందోళన కలిగిస్తుంది. మార్కెట్‌లో పల్లీనూనె వ్యాపారం చేసే సరూర్‌నగర్‌కు చెందిన వ్యక్తి(55) నుంచి వనస్థలిపురం ఏ–క్వార్టర్స్‌లో ఉండే ఆయన తండ్రి, తల్లి, సోదరుడు, సోదరుని భార్య, ఇద్దరు కుమార్తెలు, సోదరుని బావ, ఆయన ఇద్దరు పిల్లలకు ఇలా ఒక్కరి నుంచి మొత్తం తొమ్మిది మందికి పాజిటివ్ వచ్చింది. రెండు రోజుల క్రితం పల్లీ నూనె వ్యాపారి తండ్రి(76) కరోనాతో మృతి చెందగా, తాజాగా శుక్రవారం ఆయన సోదరుడు(45) మృతి చెందాడు. ప్రస్తుతం ఆయన తల్లి ఆరోగ్య పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలిసింది. (కరోనా : మొన్న తండ్రి.. నిన్న కొడుకు)
ఇలా ఒకే కుటుంబంలో ఇద్దరు చనిపోవడం స్థానికంగా కలకలం సృష్టిస్తుంది. ఇక్కడ పని చేస్తున్న ఓ హమాలి కార్మికుడు రెండు రోజుల క్రితం మృతి చెందగా, మరో పండ్ల వ్యాపారికి కూడా పాజిటివ్ నిర్ధారణ కావడం కలకలం సృష్టిస్తుంది. ఇదిలా ఉంటే ఇదే మార్కెట్ కేంద్రంగా ఎక్కువ కేసులు నమోదు కావడంతో శనివారం ఆ మార్కెట్‌ను రెడ్‌జోన్‌గా ప్రకటించి, దారులను మూసివేశారు. గత 45 రోజుల్లో మార్కెట్‌కు వచ్చిన వారితో పాటు వ్యాపారులు, హమాలీలు, ఇతర వర్కర్లను గుర్తించే పనిలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది.
►బోడుప్పల్ పెంటారెడ్డి కాలనీకి చెందిన కిరాణ షాపు నిర్వాహకునికి (46)కి వారం రోజుల క్రితం కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఆయన నుంచి కుమార్తె సహా కుమారునికి వైరస్ సోకింది. ఈయన బేగంబజార్ హోల్‌సేల్ దుకాణాల నుంచి నిత్యావసరాలు తీసుకొచ్చి ఇక్కడ విక్రయిస్తుంటాడు. ఈ క్రమంలో ఆయనకు కరోనా సోకినట్లు తేలింది.
►రామంతాపూర్ శ్రీరమణపురం చర్చికాలనీకి చెందిన కిరాణా షాపు నిర్వాహకుడు(53)కి కరోనా వైరస్ సోకినట్లు పది రోజుల క్రితం నిర్ధారణ అయింది. ఆయన ద్వారా ఆయన భార్యకు కూడా వైరస్ సోకింది. ఈయనకు కూడా హోల్‌సేల్ వ్యాపారుల నుంచే వైరస్ సోకినట్లు తెలిసింది.
►చర్లపల్లి డివిజన్ వీఎన్‌రెడ్డి నగర్‌కు చెందిన కుర్‌కురే హోల్‌సేల్ వ్యాపారి(65)కి కరోనా సోకినట్లు నాలుగు రోజుల క్రితం నిర్ధారణ అయింది. ఆయన నుంచి ఆయన సోదరుడు, పెద్ద కోడలు, చిన్న కుమారుడు, ఇద్దరు మనవళ్లుకు వైరస్ విస్తరించింది.
►తాజాగా శనివారం సరూర్‌నగర్ జింకలబావి కాలనీకి చెందిన కిరాణాషాపు నిర్వాహకుడు(60)కి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఆయన కుమారుడు రెగ్యులర్‌గా మలక్‌పేటగంజ్ మార్కెట్‌కు వెళ్లి వస్తువులను తెస్తుంటాడు. ఇలా కుమారుని నుంచి ఆయనకు సన్నిహితంగా ఉన్న ఆయన భార్య సహా నలుగురు కుమారులు, ముగ్గురు కోడళ్లు, నలుగురు పిల్లలు, అదే ఇంట్లో అద్దెకు ఉంటున్న మూడు కుటుంబాలు ఇలా మొత్తం 12 మందిని క్వారంటైన్ చేశారు. ఇదే కిరాణా షాపు నుంచి సుమారు 25 కుటుంబాలు వస్తువులను కొనుగోలు చేస్తుంటాయి. దీంతో వారంతా ఆందోళన చెందుతున్నారు.
►లింగోజిగూడ డివిజన్ భాగ్యనగర్ కాలనీకి చెందిన బియ్యం వ్యాపారి(40)కి శనివారం కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ఆయన కుటుంబంలోని నలుగురు సభ్యులను హోం క్వారంటైన్ చేశారు. కిరాణా షాపులకు బియ్యం సరఫరా చేసి, డబ్బుల వసూళ్లకు వెళ్తుంటారు. ఈ క్రమంలో ఆయనకు వైరస్ సోకి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment