
సాక్షి, హైదరాబాద్: పాకిస్తాన్, బంగ్లాదేశ్, అప్ఘనిస్తాన్ ఇస్లామిక్ దేశాలని.. భారత్ సర్వ మతాల కలయిక గల సెక్యులర్ దేశమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. దేశంలోని ముస్లింలను గౌరవిస్తూ వారి అభివృద్ధికి తోడ్పడుతున్నామన్నారు. సికింద్రాబాద్‌లోని పద్మరావునగర్‌లో బీజేపీ నేతలు ఆదివారం ‘గృహ సంపర్క్ అభియాన్’ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. సీఏఏ, ఎన్‌ఆర్‌సీ చట్టాలపై ప్రజలను అనవసరంగా రెచ్చగొడుతున్నారని కాంగ్రెస్ నేతలపై మండిపడ్డారు. ఇల్లు కాలి ఒకరేడుస్తుంటే.. ఆ మంటల్లో కాంగ్రెస్ చలి కాచుకుంటోందని ఎద్దేవా చేశారు.ఈ కార్యక్రమంలో కిషన్‌రెడ్డితో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కె లక్ష్మణ్ పాల్గొన్నారు. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ పౌర పట్టిక (ఎన్నార్సీ) చట్టాలపై ఇంటింటికి తిరుగుతూ అవగాహన కల్పించారు.
బంగ్లాదేశ్‌లో జరుగుతున్న దాడుల కారణంగా భారత్‌లోకి శరణార్థులు వస్తున్నారని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ఇలాంటి వారికోసం మాత్రమే కొత్త చట్టం తీసుకొచ్చామని ఆయన స్పష్టం చేశారు. శరణార్థులను ఆదుకోవడం, వారికి రక్షణ కల్పించడం కోసం పౌరసత్వం ఇవ్వాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. కానీ దీన్ని కాంగ్రెస్, టీఆర్‌ఎస్, మజ్లిస్ పార్టీ నేతలు వ్యతిరేకిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనివల్ల ముస్లింలకు అన్యాయం జరిగినట్టు, ఆకాశం ఊడిపడ్డట్టు, భూమి బద్దలైనట్టు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఈ చట్టం ఒక్క ముస్లింను కూడా వెళ్లగొట్టదని, దీనివల్ల ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపారు. చదవండి: పాకిస్తాన్‌తో సంబంధాలా? కోర్టుకీడుస్తా..!