రైతుల ఆత్మహత్యలపై కేసీఆర్ నిర్లక్ష్యం
హైదరాబాద్ : రైతుల ఆత్మహత్యలపై తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు. ఇప్పటికి 270మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. ఒక్క దీపావళి రోజే 14మంది ఆత్మహత్యలు చేసుకున్నట్లు సమాచారం ఉందని కిషన్ రెడ్డి అన్నారు.
కుటుంబ పాలనతో తెలంగాణలో ఆత్మహత్యలు జరుగుతున్నయని ఆయన మండిపడ్డారు. ఇది బంగారు తెలంగాణ? లేక ఆత్మహత్యల తెలంగాణా? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. సమస్యను పరిష్కరించకుండా ఇతరుల్ని తిడుతూ కాలం గడిపే ప్రయత్నం చేయకూడదని ఆయన హితవు పలికారు. ఛత్తీస్గఢ్ కరెంట్ ఇవ్వటానికి ముందుకు వస్తే దానిపై కార్యచరణ కూడా చేయలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని కిషన్ రెడ్డి విమర్శించారు.
హైదరాబాద్ మరోసారి దేశ వ్యతిరేక కార్యక్రమాలకు వేదిక అవుతోందని ఆయన అన్నారు. హైదరాబాద్లో ఉగ్రవాద స్థావరాలు ఇంకా కొనసాగుతున్నాయని, బ్యాంకులను దోపిడీ చేసి ఆ డబ్బును ఉగ్రవాద కార్యకలాపాలకు వాడుకోవటం చాలా ఆందోళనకర అంశమన్నారు. దేశంలో ఎక్కడ ఉగ్రవాద కార్యకలాపాలు జరిగినా దానికి మూలాలు హైదరాబాద్లో ఉంటున్నాయని కిషన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ పోలీస్ వ్యవస్థలో మార్పులు తీసుకు రావాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పుడున్న ప్రభుత్వం దీనిపై ఆలోచించినట్లు కనిపించటం లేదని కిషన్ రెడ్డి అన్నారు.