హైదరాబాద్: నాగార్జునసాగర్ జలాల విషయంలో సంయమనం పాటించాలని ఇరు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, కేసీఆర్లకు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్రెడ్డి హితవు పలికారు. శనివారం హైదరాబాద్లో విలేకర్ల సమావేశంలో కిషన్రెడ్డి మాట్లాడుతూ... ఈ అంశంలో జోక్యం చేసుకుని కఠినంగా వ్యవహరించాలని ఆయన గవర్నర్ను కోరారు. తమ పార్టీకి చెందిన స్థానిక ప్రజాప్రతినిధులను టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వేధిస్తున్నారని కిషన్రెడ్డి ఆరోపించారు.
టీఆర్ఎస్లో చేరకుంటే నియోజకవర్గ నిధులు మంజూరు చేయకుండా ఆపేస్తామని బెదిరిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే తమ పార్టీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారని విమర్శించారు. ఈ విషయంపై త్వరలో గవర్నర్, ప్రధాని మోదీని కలవనున్నట్లు కిషన్రెడ్డి వివరించారు. ఈ అంశంపై అవసరమైతే టీఆర్ఎస్పై ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.