జిల్లాకు చివరిది...కష్టాల్లో మొదటిది
అందని ఎస్పారెస్పీ నీరు
గుంటిమడుగు ఎత్తిపోతలతో పది గ్రామాలకు ఉపయోగం
కిష్టంపేట.. మన జిల్లాకు చివరన ఉన్న గ్రామం... ఈ ఊరు పేరు చెబితే మావోయిస్టు పార్టీ కార్యకలాపాలు, కంకణాల రాజిరెడ్డి గుర్తొస్తారు.. ఇది నాణేనికి ఒక వైపు. మరోవైపు పరికించి చూస్తే ఆ గ్రామంలోని సమస్యలు కళ్ల ముందు కదలాడుతారుు. పక్కనుంచే మానేరువాగు పారుతున్నా ఆ పల్లె ప్రజలు మంచినీటి కోసం అల్లాడుతున్నారు. ఊరికి రెండువైపులా ఎస్సారెస్పీ కాలువలున్నా.. సాగునీటి భాగ్యం లేదు. ఇలా ఎన్నో సమస్యలతో సతమతమవుతున్న కాల్వశ్రీరాంపూర్ మండలం కిష్టంపేటలో పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి ‘సాక్షి వీఐపీ రిపోర్టర్’గా మారి కిష్టంపేటతోపాటు మీర్జంపేట, తారుపల్లి, మొట్లపెల్లి, గ్రామాల ప్రజల అవస్థలు తెలుసుకున్నారు.
అధికారులు చెబుతున్నారు. మాకూ అలాగే కన్పిస్తోంది. గ్రామంలో సగానికి పైగా భూములు పడావే. రెండోపంట వేసేందుకు వెళ్తే భూమి సాలుకూడా రాదు. ఎస్సారెస్పీ కాలువలు ఉన్నట్టేగానీ అవి ఎన్నడూ మాపంట పొలాల మడి తడపలేదు. ఎస్పారెస్పీ నీళ్లకోసం తిప్పలు పడుతున్నాం.
మనోహర్‌రెడ్డి: ఎస్సారెస్పీ నీళ్లు రాక ఎన్నేళ్లవుతోంది? కాలువల మరమ్మతు జరగలేదా?
గీస రాజయ్య, రైతు: ఎస్సారెస్పీ కాలువల్లో నీళ్లు చూడక ఎన్నేళ్లైందో చెప్పలేం. మా కిష్టంపేటతోపాటు చుట్టు పక్కల గ్రామాల పంట చేలు ఎండిపోతున్నాయి. వానలు కురిస్తేనే పంటలు పండేది. కాలువనీళ్లు రాక కరువు ఎదుర్కొంటున్నాం. వరి పండించే భూములైనా మొక్కజొన్న వేసుకుంటున్నం.
మనోహర్‌రెడ్డి: ప్రత్యామ్నాయం ఉన్నదా?
మల్లారెడ్డి: ఎందుకులేదు సార్. మానేరు దగ్గర్లో గుంటిమడుగు ఉంది. అక్కడ ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేస్తే ఒక్క మా ఊరేకాదు చుట్టుపక్కల పది ఊళ్ల రైతులు బాగుపడుతరు. ఈ ప్రాజెక్ట్ కోసం ఎన్నో ఏండ్ల నుంచి ఎదురుచూస్తున్నం. తెలంగాణ వచ్చిన తర్వాత ఎత్తిపోతల పథకం వస్తుందని ఆశ పడుతున్నం. ఎస్సారెస్పీ నీళ్లపై ఆశలు లేవు.
మనోహర్‌రెడ్డి: ఇప్పటికిప్పుడు పంటల బాగుకోసం ఏం కావాలి?
సదయ్య: తారుపల్లి వద్ద నక్కల ఒర్రె చెక్‌డ్యాం ఉండేది. అక్కడినుంచి మా ఊరికి నీళ్లచ్చేవి. నక్కలవాగు చెక్‌డ్యాం దెబ్బతినడంతో తారుపల్లితోపాటు మా ఊళ్లకు కూడా నీల్లత్తలేవు. తారుపల్లి చెక్‌డ్యాం మంచిగ చేస్తే నీళ్లస్తయ్.
'
మనోహర్‌రెడ్డి: గ్రామంలో రోడ్లెలా ఉన్నాయి?
మ్యాడగోని సదయ్య: ఎస్సీ కాలనీలో డ్రెరుునేజీ లేదు, బీసీ కాలనీలో సీసీ రోడ్లు లేవు. ఇక తాటివనం వెళ్లే దారి ఎగుడు దిగుడుగా మారడంతో వెళ్లడం కష్టమైతంది. అదే దారిలో పంటచేన్లకు వెళ్తున్నవారు ఇబ్బందులు పడుతున్నారు. కనీసం మట్టిరోడ్డైన కావాలి.
మనోహర్‌రెడ్డి: తారురోడ్లున్నాయి కదా.. బస్సులు వస్తున్నాయా?
రాజు: మా ఊరికి తారురోడ్డు వేశారు. కాల్వశ్రీరాంపూర్ నుంచి ఇక్కడికి రోజుకు ఒకసారి మాత్రమే ఒక ట్రిప్పు బస్సు వచ్చి వెళ్తోంది. బస్సు కోసం ఇబ్బందులు పడుతున్నం. పేపర్ ద్వారానన్న అధికారుల్లో చలనం వచ్చి బస్సులు వేస్తారని ఆశిస్తున్నాం.
మనోహర్‌రెడ్డి: గ్రామాభివృద్ధికి ఏం కావాలి?
కాసర్ల తిరుపతిరెడ్డి: మా ఊళ్లె ప్రధాన సమస్య తాగునీరు. వాటిని సాధించడం కోసం సర్పంచ్, ఎంపీటీసీలకు యువకులం అందరం అండగా ఉంటాం. అవసరమైతే తలాకొంత నిధులు సేకరిస్తాం. అందరూ చదువుకునేలా ప్రోత్సహిస్తాం. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు పాటుపడుతాం.
మనోహర్‌రెడ్డి: మానేరు దాటితే ఏ ఊరు?
గోపగాని సారయ్యగౌడ్ : కరీంనగర్ జిల్లాకు ఇదే చివరి గ్రామం. పెద్దపల్లి డివిజన్ ప్రజలు ఏటూరునాగారం, భూపాల్‌పల్లికి కరీంనగర్ లేదా మంథని నుంచి వెళ్తున్నారు. కిష్టంపేట నుంచి మానేరు దాటితే 50కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. మానేరుపై వంతెన నిర్మిస్తే కరీంనగర్, వరంగల్ జిల్లా ముఖ్యంగా పెద్దపల్లి, పరకాల ప్రయాణం సులభమవుతుంది.
మనోహర్‌రెడ్డి: సర్పంచుగా మీరేం అభివృద్ధి చేశారు?
పల్లెర్ల వనిత: ఈ మధ్యనే సీసీ రోడ్డు, డ్రెరుునేజీలు వేశాం. తాగునీటికి ఇబ్బందులు అవుతున్నాయి. ట్యాంకు నిర్మించినా పదేళ్లయినా సంపు లేక నీటి సరఫరా నిలిచిపోయింది. రూ.2 లక్షలుంటే మానేరు నీళ్లు ఇంటింటికీ చేరుతాయి. అధికారుల దృష్టికి తీసుకెళ్లా. ఈ వేసవిలో నీళ్లు అందిస్తామనుకుంటున్నం.
తెలుసుకున్నా.. పరిష్కరిస్తా..
- దాసరి మనోహర్‌రెడ్డి, ఎమ్మెల్యే
వీఐపీ రిపోర్టర్‌గా చాలా సమస్యలు ప్రజలనుంచి తెలుసుకున్నా. సంపు నిర్మాణం చేపట్టాలని అప్పటికప్పుడు ఎంపీపీని ఆదేశించా. దీనికి నిధులు మంజూరుచేస్తా. నెలరోజుల్లోగా ఇంటింటికీ నల్లా నీరు చేరాలి. వాటర్‌గ్రిడ్‌తో ప్రతి ఇంటికీ నల్లా నీరు ఖాయం. అప్పటిదాకా సంపుతో సరిపుచ్చుకోవాలి. ఎస్సారెస్పీ నీటిని కిష్టంపేట చుట్టుప్రక్కల గ్రామాలకు సైతం అందేలా అధికారులతో మాట్లాడుతా. కాలువ నీటి సంఘాల కృషి మెరుగుపడాలి. అప్పుడే రైతులకు న్యాయం జరుగుతుంది.