అక్రమ రవాణాకు చెక్ | know cheack post in armed police | Sakshi
Sakshi News home page

అక్రమ రవాణాకు చెక్

Published Wed, Jun 25 2014 3:55 AM | Last Updated on Fri, Sep 28 2018 7:14 PM

అక్రమ రవాణాకు చెక్ - Sakshi

అక్రమ రవాణాకు చెక్

ఇక అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడనుంది. ఇసుక.. రేషన్ సరుకులు.. ఇలా పలు రకాల వస్తువులు యథేచ్ఛగా జిల్లా సరిహద్దులు దాటి వెళుతున్నాయి. వీటికి ‘చెక్’ పెట్టడంలో ఇంతకాలం ఉదాసీనంగా వ్యవహరించిన అధికారులు ఇకపై పటిష్ట నిఘా ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. ఇందుకోసం చెక్‌పోస్టుల వద్ద సాయుధులైన పోలీసులతో పహారాను పెంచాలని భావిస్తున్నారు. దీనిపై పలు శాఖల అధికారులతో సమావేశం ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ నిర్ణయించారు.
 
చెక్‌పోస్టుల్లో ఇక ‘సాయుధ’ పహారా
- రాత్రి సమయాల్లో ప్రత్యేక నిఘా
- ‘రేషన్’ పక్కదారి పట్టకుండా చర్యలు
- అవసరమైన చోట ఎస్‌ఐ స్థాయి అధికారితో బందోబస్తు
- త్వరలోనే వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశం

సాక్షి ప్రతినిధి, ఖమ్మం : జిల్లాలో ఉన్న చెక్‌పోస్టుల్లో నిఘా పటిష్టం కానుంది. ఇప్పటివరకు కేవలం రవాణా శాఖకు చెందిన ఓ అధికారి, నలుగురైదుగురు సిబ్బందితో కార్యకలాపాలు నిర్వహించిన చెక్‌పోస్టులు త్వరలోనే సాయుధ పోలీసుల పహారాలోకి వెళ్లనున్నాయి. జిల్లా నుంచి అక్రమంగా తరలుతున్న కోట్ల రూపాయల రేషన్ సరుకులు, ఇసుకకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా జిల్లా యంత్రాంగం ఈ చర్యలకు పూనుకుంటోంది. దీనిపై త్వరలోనే జిల్లా కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ నేతృత్వంలో రెవెన్యూ, పోలీస్, మైనింగ్, ఆర్టీఏ, ఇతర భాగస్వామ్య శాఖలతో సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశం అనంతరం అన్ని చెక్‌పోస్టుల్లో నిఘా పెంచనున్నారు.
 
ఉపయోగం లేని ‘చెక్’..
జిల్లాలో ఉన్న చెక్‌పోస్టుల ద్వారా ప్రస్తుతం మొక్కుబడి తనిఖీలే నడుస్తున్నాయి. చెక్‌పోస్ట్ గుండా వెళుతున్న వాహనాలపై అనుమానం వచ్చినప్పుడో, అధిక లోడుతో వెళుతోందని గుర్తించినప్పుడో సిబ్బంది ఆపి తనిఖీలు నిర్వహిస్తున్నారే తప్ప.. అక్రమ రవాణాను అడ్డుకునే దిశలో కృషి చేయడం లేదు. కాగా, సక్రమంగా వెళుతున్న వాహనాలను ఆపి తనిఖీల పేరుతో ఇబ్బందులు పెడుతున్న ఘటనలు కూడా ఉన్నాయి. ఇక, రాత్రి వేళల్లో విధులు నిర్వహించడం చెక్‌పోస్టు సిబ్బందికి కత్తిమీద సాములా తయారైంది. కొందరు అక్రమ వ్యాపారులు బెదిరింపులకు పాల్పడడం, మరికొన్ని సందర్భాలో సరుకు తీసుకు వెళుతున్న వారే చెక్‌పోస్టు సిబ్బందిని భయభ్రాంతులకు గురిచేయడం వంటి ఘటనలు కూడా జరిగాయి.

పెద్ద ఎత్తున ఇసుక రవాణా...
ఆంధ్ర ప్రాంతంతో పెద్ద ఎత్తున సరిహద్దులున్న జిల్లా నుంచి లక్షల టన్నుల నిత్యావసరాలు, వేల క్యూబిక్ మీటర్ల ఇసుక తరలి వెళుతున్నాయి. ఇసుక అయితే పెద్ద ఎత్తున హైదరాబాద్ కూడా తరలివెళుతోంది. అయినా వీటిని నియంత్రించేందుకు చెక్‌పోస్టుల సామర్థ్యం సరిపోవడం లేదు. ఇటీవలి కాలంలో చెక్‌పోస్టుల సంఖ్య పెంచినా ఫలితం లేకుండా పోయింది. ఈ అక్రమ రవాణాలో కింది స్థాయి సిబ్బంది నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు భాగస్వాములేననే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీటిని అరికట్టేందుకు చెక్‌పోస్టు వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని జిల్లా కలెక్టర్ నిర్ణయించడంతో ఈ దిశలో యంత్రాంగం చర్యలు ప్రారంభించింది.
 చెక్‌పోస్టుకో కానిస్టేబుల్...
 
అవసరమైతే ఎస్‌ఐ కూడా
నిఘాను పటిష్టం చేసేందుకు ప్రతి చెక్‌పోస్టు వద్ద పోలీసు బలగాలను కాపలా ఉంచాలని కలెక్టర్ భావిస్తున్నారు. ఇందుకోసం పోలీసు శాఖ సహకారంతో ప్రతి చెక్‌పోస్టు దగ్గర కనీసం సాయుధుడైన కానిస్టేబుల్‌ను ఉంచాలని, తద్వారా చెకింగ్ నిర్వహిస్తున్న సిబ్బందికి మానసిక స్థైర్యం కల్పించాలనే  యోచనతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు ఎస్పీ కూడా అంగీకరించినట్టు తెలుస్తోంది.

ఇప్పటివరకు కేవలం రవాణా శాఖ సిబ్బంది నేతృత్వంలోనే నడిచిన చెక్‌పోస్టుల్లో సిబ్బందిని పెంచడంతో పాటు పోలీసు కాపలా కూడా పెట్టడం ద్వారా రాత్రి వేళల్లో పెద్ద ఎత్తున జరుగుతున్న అక్రమ రవాణాను నియంత్రించాలన్నది జిల్లా యంత్రాంగం ఆలోచనగా కనిపిస్తోంది. ముఖ్యంగా రాత్రి 11 నుంచి తెల్లవారుజామున ఐదు గంటల వరకు సరుకులు అక్రమంగా జిల్లా దాటివెళుతున్నాయని అధికారుల నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో ఆ సమయంలో ప్రత్యేక నిఘా ఉంచాలని, అవసరమైతే ఎస్‌ఐ స్థాయి అధికారిని కాపలా ఉంచాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. దీనిపై త్వరలో నిర్వహించబోయే సమావేశంలో కలెక్టర్ నిర్ణయం తీసుకోనున్నారు.
 
ఇసుకపైప్రత్యేక దృష్టి...
జిల్లాలో పెద్ద ఎత్తున ఇసుక నిల్వలను బంగారు బాతులుగా చేసుకుని కొందరు అక్రమార్కులు లక్షల రూపాయలు అర్జిస్తున్నారు. పట్టాదారు స్థలాల్లో తవ్వకాల పేరుతో ఇసుక నిల్వలను హరించివేస్తున్నారు. గోదావరి తీరంలో గిరిజన సొసైటీల ద్వారా ఇప్పటికే సేకరించిన దాదాపు 20 వేల క్యూబిక్ మీటర్ల ఇసుక నిల్వలున్నాయి. వీటి విలువ రూ. కోటి పైమాటే. ఇప్పుడు ఈ నిల్వలు అక్రమంగా తరలివెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది.

ఈ ఇసుకను ఎలా వినియోగించాలన్న దానిపై కూడా సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు. మరోవైపు పట్టాదారు స్థలాల్లో తవ్వకాలకు సంబంధించిన అనుమతులను పరిశీలించి, సర్వే చేసి, ఆ స్థలాలను మార్కింగ్ చేయడంతో పాటు రెడ్‌ఫ్లాగ్‌లు ఏర్పాటు చేయడం ద్వారా పట్టాదారులు తమ స్థలాలకు మించి ఇసుక తవ్వకాలు చేపట్టకుండా నియంత్రించే దిశలో కృషి జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో జిల్లా నుంచి కోట్లాది రూపాయల విలువైన అక్రమ సరుకు రవాణా ఏ మేరకు నియంత్రించగలరో, పోలీసు పహారా ఏ మేరకు ఫలితాలనిస్తుందో వేచిచూడాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement