ఏ హామీ నెరవేర్చారో చెప్పండి..: కొణతాల | Konatala Rama krishna asks Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

ఏ హామీ నెరవేర్చారో చెప్పండి..: కొణతాల

Published Sat, Mar 15 2014 2:49 AM | Last Updated on Fri, May 25 2018 9:12 PM

ఏ హామీ నెరవేర్చారో చెప్పండి..: కొణతాల - Sakshi

ఏ హామీ నెరవేర్చారో చెప్పండి..: కొణతాల

చంద్రబాబును నిలదీసిన కొణతాల..
హామీలివ్వడం, వాటిని విస్మరించడం ఆయన నైజం
ప్రజలపై భారం మోపడం తప్ప చేసిందేమీ లేదు
స్థానిక సంస్థలను భ్రష్టుపట్టించింది బాబే

 
సాక్షి, హైదరాబాద్:  ప్రతి ఎన్నికల సందర్భంగా ఇష్టమొచ్చినట్టుగా అనేక వాగ్దానాలు చేయడం, ఆ తర్వాత వాటిని విస్మరించడం టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నైజమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమన్వయకర్త కొణతాల రామకృష్ణ దుయ్యబట్టారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నవరత్నాలు పేరిట పార్టీ ప్రణాళిక విడుదల చేయడాన్ని ప్రస్తావిస్తూ.. ప్రతి ఎన్నికలకు వాటి సంఖ్య మారుతోందే తప్ప బాబు అమలు చేసింది ఏ ఒక్కటీ లేదని ఆయన తెలిపారు. ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయిన చంద్రబాబు ఎన్ని ఉచిత హామీలిచ్చినా ఫలితముండదని, అది 2009లో నిరూపితమైందని చెప్పారు. కొణతాల పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
 
-  తన తొమ్మిదేళ్ల పాలనలో ఫలానా వాగ్దానాన్ని నిలబెట్టుకున్నానని బాబు ధైర్యంగా చెప్పగలిగే అంశం ఒక్కటైనా ఉందా?
-  ఎన్టీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన కిలో బియ్యం రూ.2 పథకానికి చంద్రబాబు తూట్లు పొడిచారు. ఖజానాపై నాలుగువేల కోట్ల భారం పడుతోందని తొలిసారి రూ.3.50కు ఆ తర్వాత రూ.5.25కు పెంచారు.
-  ఇది చాలదన్నట్టు పన్నుల పేరిట ప్రజలపై అదనంగా నాలుగువేల కోట్ల భారం మోపారు.
-  మద్యపాన నిషేధం విషయంలోనూ అలాగే వ్యవహరించారు. బెల్టు షాపులు పెట్టి ప్రతి కిళ్లీ కొట్టులో మద్యం లభించేలా చేశారు.
-  వ్యవసాయ విద్యుత్ కనెక్షన్‌ను ఎన్టీఆర్ హార్స్‌పవర్ రూ. 50కే అందజేస్తే దాన్ని రూ.650కి పెంచిన ఘనత బాబుది.
-  1999 ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా చంద్రబాబు నెరవేర్చలేదు.
-  ఆడబిడ్డ పుట్టగానే రూ.5 వేలు డిపాజిట్ చేయడంతో పాటు ఉచితంగా విద్యను అందిస్తామన్నారు. మహిళలకు ఉచిత మంగళసూత్రాలు ఇస్తామన్నారు. చేనేతన్నలకు ఆధునిక మరమగ్గాలు, నాయూ బ్రాహ్మణులకు బ్యూటీ పార్లర్లు, రజకులకు దోబీఘాట్లు, కోటి మందికి ఉద్యోగాలంటూ వాగ్దానాల వర్షం కురిపించి అధికారంలోకి వచ్చాక ఏకంగా 21 వేల మంది ఉద్యోగులను తొలగించారు.
-  జన్మభూమి కార్యక్రమం అంటూ రోడ్డు వేసుకోవాలంటే ప్రజలే వేసుకోవాలని, చెరువులు.. కాలువలు రైతులే తవ్వుకోవాలని, చివరకు గ్రామాల్లో దొంగలు పడుతుంటే ప్రజలే కాపలా ఉండాలంటూ చెప్పిన మహానీయుడు చంద్రబాబు.
-  ప్రత్యేక అధికారుల పరిపాలన తీసుకొచ్చి ప్రజాప్రతినిధులకు విలువ లేకుండా స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసిన ఘనతా బాబుదే. ప్రజా ప్రతినిధులకు చెక్‌పవర్ లేకుండా చేసి వారిని ఉత్సవ విగ్రహాలుగా మార్చారు. అలాంటి వ్యక్తికి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement