సాక్షి ప్రతినిధి, వరంగల్/సాక్షి, జనగామ: ముందస్తు అభ్యర్థుల ఖరారుతో జోరుమీద ఉన్న టీఆర్‌ఎస్ పార్టీలో ఇప్పుడిప్పుడే అసమ్మతి సెగలు రాజుకుంటున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. తూర్పు మినహా మిగిలిన అన్ని స్థానాలను సిట్టింగ్‌లకే కేటాయించారు. ‘గులాబీ’ బాస్ కేసీఆర్ ప్రత్యక్షంగా అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మూడు రోజుల అంతర్మథనం అనంతరం కొండా దంపతులు మీడియా ముందుకు వచ్చారు. కేసీఆర్‌పై తిరుగుబావుటా ఎగురవేశారు. దీంతోపాటు స్టేషన్ ఘన్‌పూర్, భూపాలపల్లి, డోర్నకల్ నియోజకవర్గాలకు సంబంధించి టీఆర్‌ఎస్‌లో ముసలం మొదలైంది.
రెండు రోజుల్లో సమాధానం చెప్పాలి : కొండా
105 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లను ప్రకటించి.. తన టికెట్‌ను పెండింగ్‌లో పెట్టడానికి కారణం ఏమిటని హైదరాబాద్‌లో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో తూర్పు నియోజకవర్గ తాజా మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ నిలదీశారు. తనకు టికెట్ రాకపోవడానికి కేటీఆరే కారణమని మండిపడ్డారు. తన ప్రశ్నలకు రెండు రోజుల్లో సమాధానం చెప్పకపోతే, బహిరంగ లేఖ రాసి పార్టీ నుంచి వైదొలుగుతానని స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్‌లో తాము రెండు సీట్లు అడిగినట్లు అసత్య ఆరోపణలు చేశారని పేర్కొన్నారు. మూడు సీట్లలో ఇండిపెండెంట్‌గా గెలిచే సత్తా తమకు ఉందన్నారు. మరో వైపు కొండా సురేఖ భర్త ఎమ్మెల్సీ మురళీధర్‌రావు కూడా టీఆర్‌ఎస్ పార్టీపై నిప్పులు చెరిగారు. పార్టీ నుంచి ఒక్క రూపాయి తీసుకోకుండా పనిచేశామన్నారు. వాళ్ల స్వరం తీవ్రతను బట్టి చూస్తే టీఆర్‌ఎస్ పార్టీని వదిలిపెట్టే ప్రయత్నంలో ఉన్నట్లు రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.
‘స్టేషన్’లో తాజాగా కడియం వర్గీయులు
టీఆర్‌ఎస్ స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గ అభ్యర్థిగా తాటికొండ రాజయ్యను ప్రకటించిన కొద్ది గంటల్లోనే ఆ నియోజకవర్గానికి, అదే పార్టీకి చెందిన టీఆర్‌ఎస్ నేత రాజారపు ప్రతాప్ తిరుగుబావుటా ఎగురవేశారు. తాను పోటీలో ఉంటాన ని ప్రకటించడంతోపాటు బరిలోకి దిగడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. తాజాగా కడియం శ్రీహరి వర్గీయులు ప్రత్యేకంగా సమావేశమయ్యా రు. చిల్పూర్ మండలంలోని దేశాయితండా, జఫర్‌గఢ్‌లో కడియం వర్గీయులు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. స్టేషన్ ఘన్‌పూర్‌కు ప్రకటించిన పార్టీ అభ్యర్థి రాజయ్యను మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. రాజయ్య స్థానంలో కడియం శ్రీహరికి లేదా ఆయన కుమార్తె కావ్యకు అవకాశం కల్పించాలని ఆయా సమావేశాల్లో చర్చించారు. జఫర్‌గఢ్ మండల కేంద్రంలోని ఓ రైస్‌మిల్‌లో సుమారు 200 మంది సమావేశానికి హాజరయ్యారు. రాజయ్య అభ్యర్థిత్వాన్ని రద్దు చేయకపోతే ఆయనకు వ్యతిరేకంగా పనిచేస్తామని తీర్మానించారు. నియోజకవర్గంలోని అన్నీ మండలాల్లోని ముఖ్య నాయకులు నియోజకవర్గ స్థాయిలో సమావేశం నిర్వహించుకోవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఒకటి, రెండు రోజుల్లో హైదరాబాద్‌కు వెళ్లి కేసీఆర్, కేటీఆర్‌ను కలిసి స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గ పరిస్థితులను వివరించాలని భావిస్తున్నారు. అభ్యర్థిని మార్చాలనే డిమాండ్‌ను బలంగా వినిపించడానికి కడియం వర్గీయులు సన్నాహాలు సిద్ధం చేసుకుంటున్నారు.
ఆది నుంచీ పోరే..
స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్య వర్గీయుల మధ్య ఆది నుంచీ ఆధిపత్యపోరు కొనసాగుతోంది. గతంలో మూడు సార్లు కడియం శ్రీహరి టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. రెండు సార్లు కేబినెట్ హోదాలో పనిచేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి తాటికొండ రాజయ్య 2009 ఎన్నికల్లో కడియం శ్రీహరిపై విజయం సాధించారు. ఆ తర్వాత రాజయ్య 2012లో తెలంగాణ ఉద్యమ సమయంలో కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టీఆర్‌ఎస్ పార్టీలో చేశారు. అదే ఏడాదిలో జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ నుంచి రాజయ్య పోటీ చేయగా.. టీడీపీ నుంచి కడియం శ్రీహరి బరిలో నిలిచారు. ఉప ఎన్నికల్లో రాజయ్య విజయం సాధించారు. అనంతరం మారిన రాజకీయ పరిస్థితుల కారణంగా కడియం శ్రీహరి ‘గులాబీ’ పార్టీలో చేరారు. 2014 ఎన్నికల్లో రాజయ్య స్టేషన్ ఘన్‌పూర్ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించగా.. కడియం శ్రీహరి మాత్రం వరంగల్ ఎంపీగా గెలుపొందారు. తెలంగాణ రాష్ట్ర తొలి ఉప ముఖ్యమంత్రిగా రాజయ్యకు కేసీఆర్ అవకాశం కల్పించారు. ఆరు నెలల్లో రాజయ్యను బర్త్‌రఫ్ చేసి ఎంపీగా ఉన్న కడియం శ్రీహరికి డిప్యూటీ సీఎం బాధ్యతలను అప్పగించారు. ఇద్దరు నేతల నియోజకవర్గం ఒకటే కావడంతో ఇరువురికి ప్రత్యేక అనుచరగణం ఉంది. ఇద్దరు నేతలు బలమైన కేడర్‌ను కలిగి ఉన్నారు. ఒకే పార్టీ అయినప్పటికీ కార్యకర్తల్లో మాత్రం ఆధిపత్యం కొనసాగుతూ వస్తుంది.
డోర్నకల్, భూపాలపల్లిలో..
భూపాలపల్లి నియోజకవర్గంలో స్పీకర్ మధుసుదనాచారి చేతిలో ఓటమి పాలైన గండ్ర సత్యనారాయణ రెండేళ్ల కిందటే టీడీపీ నుంచి టీఆర్‌ఎస్ పార్టీలోకి వచ్చి చేరారు. రేవంత్‌రెడ్డి టీడీపీ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన సమాయంలో ఆయనతో పాటు కాంగ్రెస్‌లోకి వెళ్లటానికి సత్యనారాయణ సిద్ధమయ్యారు. అయితే అనూహ్యంగా జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆయన కేటీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. గ్రామీణ ప్రాంతాల్లో మంచి పట్టున్న సత్యనారాయణ మొదటి నుంచీ టికెట్ ఆశిస్తున్నారు. టికెట్ సిట్టింగ్ ఎమ్మెల్యే మధుసూదనాచారికి ఖరారు కావడంతో అయన తిరుగుబాటు అభ్యర్థిగా బరిలో నిలబడేందుకు నిర్ణయించుకున్నారు. ప్రజల్లో తిరుగుతూ తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నారు. అదేవిధంగా డోర్నకల్‌లో డీఎస్.రెడ్యానాయక్‌పై తిరుగుబావుటా ఎగురవేసేందుకు సత్యవతి రాథోడ్ వర్గాలు సన్నద్ధమైనట్లు తెలుస్తోంది. మరిపెడ మండలం ఎడ్జర్లలో సత్యవతి రాథోడ్ శనివారం తన అనుచరులతో అంతర్గత సమావేశం నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment