సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ, అనుబంధరంగాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి తగిన సబ్సిడీలు ఇస్తూ రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేలా కేంద్రం ఈ నెల ఒకటో తేదీ నుంచి కృషి కళ్యాణ్ అభియాన్ పథకాన్ని ప్రారంభించింది. దేశవ్యాప్తంగా పైలెట్ ప్రాజెక్టు కింద 111 జిల్లాలను ఎంపిక చేసింది. రాష్ట్రంలో జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, కొమురం భీం జిల్లాల్లో అమలు చేయనుంది. నీతి ఆయోగ్ సిఫార్సు మేరకు ఆ 3 జిల్లాల్లో 75 గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తారు. జూన్ మొదటి తేదీ నుంచి జూలై 31 వరకు ముందుగా సిద్ధం చేసుకున్న ప్రణాళిక ప్రకారం ఆ గ్రామాల్లో ప్రణాళిక అమలు చేస్తారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యవసాయ శాఖకు లేఖ రాసింది.
భూసార కార్డుల పంపిణీ..
ఈ పథకంలో భాగంగా గ్రామంలో పూర్తిగా భూసార పరీక్ష కార్డులను పంపిణీ చేస్తారు. పప్పులు, నూనెగింజలకు సంబంధించి రైతులందరికీ మినీకిట్స్ ఇస్తారు. రైతు కుటుంబంలోని ఐదుగురికి ఉద్యాన, వెదురు మొక్కలను పంపిణీ చేస్తారు. పశువులకు వచ్చే బోవైన్ వ్యాధి వ్యాక్సినేషన్ నూటికి నూరు శాతం ఇస్తారు. భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి, కృషి విజ్ఞాన కేంద్రాలతో రైతులకు అవగాహన శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం వంటివి కృషి కళ్యాణ్ అభియాన్ పథకంలో ఉన్నాయి. యంత్రాల కొనుగోలుకు కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం నిధులు భరిస్తాయి. మొత్తం సబ్సిడీ రూ.2.5 కోట్లు మించరాని కేంద్రం స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment