సంక్షోభంలోనూ సంక్షేమం | KTR And Niranjan Reddy Visited Rajanna Sircilla | Sakshi
Sakshi News home page

సంక్షోభంలోనూ సంక్షేమం

Published Wed, May 27 2020 4:52 AM | Last Updated on Wed, May 27 2020 4:52 AM

KTR And Niranjan Reddy Visited Rajanna Sircilla - Sakshi

రాచర్ల బొప్పాపూర్‌లో రైతు వేదికకు భూమిపూజ చేస్తున్న మంత్రులు కేటీఆర్, నిరంజన్‌రెడ్డి

సిరిసిల్ల: కరోనా కష్టకాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సంక్షోభంలో ఉన్నా.. ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలు ఆపలేదని ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్‌శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. మంగళవారం ఆయన వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డితో కలసి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్, ఎల్లారెడ్డిపేట, వేములవాడ, బోయినపల్లి మండలాల్లో పర్యటించారు. నియంత్రిత పంటల సాగుపై అవగాహన సదస్సులు నిర్వహించి, రైతు వేదిక నిర్మాణా లకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ లాక్‌డౌన్‌ వల్ల రాష్ట్రం లో 95 శాతం ప్రభుత్వ ఆదాయం తగ్గినా సం క్షేమ పథకాల అమలును ఎక్కడా ఆపలేదన్నారు. తొలివిడతగా 5.5 లక్షల మంది రైతుల పంటల రుణాలను రూ.1,200 కోట్లమేర మాఫీ చేశామన్నారు.

ఏ ప్రధానీ చేయని విధంగా రైతుబంధు కోసం రూ.14 వేల కోట్లు అందించామని, రూ.1,400 కోట్లతో రైతుబీమా అమలు చేస్తున్నామని వివరించారు. అలాగే రైతులకు ఎరువులు, విత్తనాలను సకాలంలో అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కాళేశ్వరం, సీతారామ, పాలమూరు సాగునీటి పథకాల ద్వారా వ్యవసాయ రంగానికి నిరంతరం నీరందిస్తామని పేర్కొన్నారు. అక్కరకు రాని, మద్దతు ధరలేని పంటలు వేయొద్దని రైతులకు మంత్రి కేటీఆర్‌ సూచించారు. రైతులకు మేలు చేయడం తప్ప సీఎం కేసీఆర్‌కు వేరే ఎజెండా లేదన్నారు. అనేక మంచి పనులు చేస్తున్న ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తుందా? అని ప్రశ్నించారు. బీడు భూములకు నీళ్లు వచ్చి పల్లెలు పచ్చబడుతుంటే ప్రతిపక్షాలకు కళ్లు మండుతున్నాయని, రాష్ట్రంలో ప్రతీ రైతుకు రైతుబంధు ఇస్తుంటే మొసలికన్నీరు కారుస్తున్నాయని విమర్శించారు. రైతులను సంఘటితం చేయడమే రైతు వేదిక లక్ష్యమన్నారు. రైతు వేదికలో కంప్యూటర్లు ఏర్పాటుచేసి ఆధునిక వ్యవసాయాన్ని రైతులకు అందుబాటులోకి తెస్తామన్నారు.

సేద్య ఆలయాలుగా రైతు వేదికలు: రాష్ట్రంలో రైతు వేదికలు సేద్యానికి ఆలయాలుగా ఉంటాయని వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లబొప్పాపూర్, వేములవాడలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 2,602 క్లస్టర్లు ఉన్నాయ ని, ప్రతీ క్లస్టర్‌లో రైతు వేదికలు నిర్మిస్తామని తెలిపారు. రైతుల కు నీళ్లు, పెట్టుబడి సాయం, 24 గంటల ఉచిత కరెంటు ఇస్తూ.. రైతు బీమా కల్పిస్తున్న ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదన్నారు. రైతులకు లాభసాటిగా ఉండే పంటలనే ప్రభుత్వం సూచిస్తుందన్నారు. అయితే ప్రతిపక్షాలు దీనిని గుడ్డిగా వ్యతిరేకిస్తున్నాయని, అవి ప్రజలకు అందనంత దూరంలో ఉన్నాయని మంత్రి ఆరోపించారు. రైతులను సీఎం కేసీఆర్‌ నెత్తినపెట్టుకుని పూజిస్తున్నారన్నారు. బడ్జెట్‌లో ఏ టా రూ.60 వేల కోట్లు వ్యవసాయానికి కేటాయిస్తున్నారని ఆయన వివరించారు.

వ్యవసాయం బాగుంటేనే అన్నీ బాగుంటా యని సీఎం కేసీఆర్‌ బలంగా నమ్ముతున్నారన్నారు. రైతు వేదికల ఏర్పాటు ద్వారా పంట మార్పులతో తెలంగాణ రైతులు దేశ చిత్రపటంలో అగ్రస్థానంలో ఉంటారన్నా రు. పంట మార్పిడి విధానం పాటించాలని, శాస్త్రవేత్తలు, నిపుణులతో సంప్రదించే ఏయే పంటలు వేయాలో నిర్ణయిస్తామన్నారు. చాలామంది రైతులు ప్రభుత్వ నిర్ణయం పై హర్షం వ్యక్తం చేస్తూ తీర్మానాలు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో రైతుల గురించి సీఎం కేసీఆర్‌ కంటే ఎక్కువగా ఆలోచించే మొనగాడు ఉన్నాడా.. అని మంత్రి ప్రశ్నిం చారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో గోదావరి జలాలను చూసి సంతోషం అనిపించిందని నిరంజన్‌రెడ్డి అన్నారు. మంత్రి కేటీఆర్‌  తం డ్రికి తగిన తనయుడిగా రాష్ట్ర అభివృద్ధిలో కీలకంగా ఉన్నారని మంత్రి కితాబిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌కుమార్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, జెడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ, టెస్కాబ్‌ చైర్మన్‌ కొండూరి రవీందర్‌రావు, కలెక్టర్‌ కృష్ణభాస్కర్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు గడ్డం నర్సయ్య, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

సొంత ఖర్చులతో 6 రైతు వేదికలు
జిల్లాలో తాను సొంత ఖర్చులతో ఆరు రైతు వేదికలను నిర్మిస్తానని మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. ముస్తాబాద్, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, వీర్నపల్లి, తంగళ్లపల్లి మండ లాలతోపాటు తమ అమ్మమ్మ ఊరు అయిన బోయినపల్లిలో వీటిని నిర్మిస్తానని పేర్కొన్నారు. రెండు నెలల్లో ఈ వేదికలను అందుబాటులోకి తేవాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ వేదికలు వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పులకు నాందిపలుకుతాయని మంత్రి స్పష్టం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement