సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం నెలకొన్న కరోనా సంక్షోభం వల్ల అన్ని రంగాల మాదిరిగానే రియల్ ఎస్టేట్ రంగం కూడా ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వంతో కలిసి రియాల్టీ రంగానికి చేయూతనిచ్చేందుకు సిమెంట్ ధరలను తగ్గించాల్సిన అవసరం ఉందని తెలంగాణ ప్రభుత్వం సిమెంట్ కంపెనీల ప్రతినిధులను కోరింది. ఈ మేరకు గురువారం సిమెంట్ కంపెనీలతో మంత్రులు కేటీఆర్, వేముల ప్రశాంత్‌రెడ్డి సమావేశం అయ్యారు. ప్రస్తుతం నెలకొన్న కోవిడ్, లాక్‌డౌన్ అనంతర పరిస్థితుల నేపథ్యంలో కంపెనీలు సిమెంట్ బస్తా ధరని తగ్గించాలని మంత్రులు కోరారు. సిమెంట్ కంపెనీలు అధికంగా ఉన్న హుజూర్‌నగర్ పరిసర ప్రాంతాల్లో స్థానిక యువతకు ఉపాధి కల్పించే ఉద్దేశంతో యువతకు శిక్షణ ఇచ్చేందుకు అవసరమైన శిక్షణ కేంద్రాలను ‘నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్’ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్నట్లు మంత్రులు నిర్ణయం తీసుకున్నారు. (అతడే సుడా నూతన చైర్మన్)
2016లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణానికి రూ.230 ఒక బస్తా సిమెంట్‌ను ఇచ్చేందుకు అంగీకరించిన కంపెనీలు, మరో మూడేళ్ల పాటు ప్రభుత్వ పథకాలకు యథాతథ ధరకు ఇచ్చేందుకు కంపెనీలు అంగీకరించాయి. ప్రభుత్వం చేసిన పలు సూచనలకు సిమెంట్ కంపెనీలు సానుకూలంగా స్పందించాయి. అంతర్గతంగా మాట్లాడుకుని వచ్చే వారంలో ఎంత ధరను తగ్గిస్తామనే విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేస్తామని కంపెనీల ప్రతినిధులు తెలిపారు. సిమెంట్ కంపెనీలకు అవసరమైన సిబ్బందిని ప్రభుత్వ ఏర్పాటు చేసే శిక్షణ కేంద్రం నుంచి తీసుకుంటామని తెలిపారు. అదే విధంగా శిక్షణ కేంద్రానికి అన్నివిధాలుగా అండగా ఉంటామని కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ సమావేశంలో చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్, హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. (డిశ్చార్జీల కంటే.. రెండింతల కేసులు)
Comments
Please login to add a commentAdd a comment