రాముడొచ్చాడు | KTR Appointed Working President Of TRS | Sakshi
Sakshi News home page

Published Sat, Dec 15 2018 2:19 AM | Last Updated on Sat, Dec 15 2018 2:19 AM

KTR Appointed Working President Of TRS - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గులాబీ దళానికి కొత్తగా యువ సారథి వచ్చారు. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) తొలి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా (వర్కింగ్‌ ప్రెసిడెంట్‌) కల్వకుంట్ల తారక రామారావు నియమితులయ్యారు. ఈ మేరకు తన కుమారుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే అయిన కేటీఆర్‌కు పగ్గాలు అప్పగిస్తూ టీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు శుక్రవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ భవన్‌లో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఈ నియామకం గురించి కేసీఆర్‌ వివరించారు. అధినేత నిర్ణయానికి కార్యవర్గం సంపూర్ణ ఆమోదం తెలిపింది. టీఆర్‌ఎస్‌లో ఇప్పటివరకు కార్యనిర్వాహక అధ్యక్ష పదవి లేదు. కేటీఆర్‌ను ఈ పదవిలో నియమించడం ద్వారా కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌లో కొత్త అధ్యాయానికి తెరతీశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి రెండోసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన మర్నాడే కేసీఆర్‌ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. 

విధేయత, సమర్థతకు పట్టం...  
దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తెచ్చేందుకు జాతీయ రాజకీయాలపై సీఎం కేసీఆర్‌ దృష్టి పెట్టారు. ప్రభుత్వపరంగా నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణంతోపాటు ఎన్నికల్లో ప్రజలకిచ్చిన వాగ్దానాలను తు.చ. తప్పకుండా అమలు చేయాల్సిన బాధ్యత తనపై ఉన్న దృష్ట్యా అత్యంత నమ్మకస్తుడు, సమర్థుడికి పార్టీ బాధ్యతలు అప్పగించాలని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ ఉద్యమానికి రాజకీయ వేదిక ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో కేసీఆర్‌ 2001లో టీఆర్‌ఎస్‌ను స్థాపించారు. తెలంగాణ ఉద్యమాన్ని గమ్యానికి చేర్చి ప్రత్యేక రాష్ట్రం సాధించిన టీఆర్‌ఎస్‌... తెలంగాణ రాష్ట్రంలో తొలి ప్రభుత్వం ఏర్పాటు చేయడంతోపాటు బంగారు తెలంగాణ నిర్మాణం దిశగా పరిపాలన సాగించింది.

ఇటీవలి ఎన్నికల్లో ప్రజలు మరోసారి టీఆర్‌ఎస్‌కు భారీ మెజారిటీతో అధికారం అప్పగించడంతో రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు నడిపించడంతోపాటు జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించాలనుకుంటున్న కేసీఆర్‌పై పనిభారం పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే టీఆర్‌ఎస్‌ను తాను అనుకున్న విధంగా ముందుకు తీసుకెళ్లే బాధ్యతను, పార్టీలో తాను అత్యంత ఎక్కువగా విశ్వసించే కేటీఆర్‌కు కేసీఆర్‌ అప్పగించారు. టీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించడం, జిల్లాల్లో పార్టీ కార్యాలయాలు నిర్మించడం, సంస్థాగతంగా తిరుగులేని శక్తిగా టీఆర్‌ఎస్‌ను తీర్చిదిద్దే బాధ్యతను చేపట్టాల్సిందిగా కేటీఆర్‌కు సూచించారు. దేశంలోనే అతిగొప్ప పార్టీగా టీఆర్‌ఎస్‌ను రూపుదిద్దాలనే సంకల్పంతో కేసీఆర్‌ ఉన్నారు. ఇప్పటివరకు ప్రభుత్వంలో, పార్టీలో ఇచ్చిన బాధ్యతలన్నీ అత్యంత విజయవంతంగా కేటీఆర్‌ నిర్వహించడంతో ఆయన పనితీరు, నిబద్ధత, దార్శనికత, నాయకత్వ లక్షణాలు చూసి ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించారు. 

కలసి పని చేస్తాం: హరీశ్‌రావు 
టీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమితుడైన వెంటనే మాజీ మంత్రి కేటీఆర్‌... సీఎం కేసీఆర్‌ ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం టీఆర్‌ఎస్‌ సెక్రటరీ జనరల్‌ కె. కేశవరావు ఇంటికి వెళ్లి ఆయన ఆసీస్సులు అందుకున్నారు. ఆ తర్వాత హోంమంత్రి మహమూద్‌ అలీ, మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఇళ్లకు వెళ్లి కలిశారు. అక్కడి నుంచి మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఇంటికి వెళ్లి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. టీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కేటీఆర్‌ను నియమించడంపై హరీశ్‌రావు హర్షం వ్యక్తం చేశారు.

కేటీఆర్‌ తనను కలిసిన అనంతరం హరీశ్‌ విలేకరులతో మాట్లాడుతూ ‘కేటీఆర్‌ నన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. కేటీఆర్‌ను టీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమించడంపై హర్షం వ్యక్తం చేస్తున్నా. ఉదయమే కేటీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపా. కేటీఆర్‌ భవిష్యత్తులో మరింత మంచి పేరు తెచ్చుకోవాలి. కేసీఆర్‌కు కేటీఆర్‌ చేదోడు వాదోడుగా ఉండాలని కోరుకుంటున్నా. స్థానిక సంస్థల ఎన్నికల్లో మరింత బాగా పనిచేయాలని కోరుకుంటున్నా. మేమిద్దరం కలసి పని చేస్తాం. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో మేము కలసి పని చేశాం. రేపు రాష్ట్రాన్ని ముందుకు నడిపించడంలో కూడా కలసి పనిచేస్తాం’అని పేర్కొన్నారు.  

తెలంగాణ తల్లికి పూలమాల... 
టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమితులైన అనంతరం కేటీఆర్‌ ముఖ్యనేతల ఆశీర్వాదం తీసుకుని తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. అక్కడి ఆవరణలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. అలాగే ఆచార్య జయశంకర్‌ చిత్రపటానికి నివాళుర్పించారు. టీఆర్‌ఎస్‌లో కీలక పదవి పొందిన తర్వాత తొలిసారి తెలంగాణ భవన్‌కు చేరుకున్న కేటీఆర్‌కు పార్టీ నేతలు, కార్యకర్తలు భారీగా స్వాగతం పలికారు. డప్పు చప్పుళ్లు, బాణాసంచా మోతలతో తెలంగాణ భవన్‌ ప్రాంగణం మార్మోగింది.

జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ ఆధ్వర్యంలో భారీగా స్వాగత కార్యక్రమాన్ని నిర్వహించారు. మాజీ మంత్రులు జగదీశ్వర్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్, ఈటల రాజేందర్, సి.లక్ష్మారెడ్డి, పద్మారావుగౌడ్, వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు కేటీఆర్‌కు పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. 

ట్విట్టర్‌లో శుభాకాంక్షలు... 
టీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమితులైన కేటీఆర్‌కు హదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ హరీశ్‌రావు ట్వీట్‌ చేశారు. హరీశ్‌ ట్వీట్‌కు ‘థ్యాంక్స్‌ బావా’అంటూ కేటీఆర్‌ రిప్లై ఇచ్చారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ సైతం ట్విట్టర్‌ ద్వారా కేటీఆర్‌కు అభినందనలు తెలిపారు. ‘టీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కీలక బాధ్యతలు చేపట్టిన కేటీఆర్‌కు శుభాకాంక్షలు’అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.  

‘టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ నాకు అప్పగించిన వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బాధ్యతలను వినయపూర్వకంగా స్వీకరిస్తున్నా. కేసీఆర్‌ నాయకత్వంపై ప్రజలు చూపిన విశ్వాసాన్ని మరింత పెంచేందుకు శాయశక్తులా కృషి చేస్తా..’   – ట్విట్టర్‌లో కేటీఆర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement