హైదరాబాద్పై సర్వాధికారాలు మావే: కేటీఆర్
రెండు రాష్ట్రాలకు తాత్కాలికంగా ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ నగరంపై సర్వాధికారాలు తమవేనని, ఈ విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె. తారక రామారావు (కేటీఆర్) స్పష్టం చేశారు. శాంతి భద్రతల అంశం ముమ్మాటికీ రాష్ట్రానికి సంబంధించినదేనని, దాన్ని దురాక్రమిస్తే సహించబోమని ఆయన అన్నారు. ప్రధాని నరేంద్రమోడీ కూడా నిన్న మొన్నటి వరకు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగానే ఉన్నందున ఆయన రాష్ట్రాల అధికారాల విషయాన్ని గుర్తించాలని చెప్పారు.
ఇప్పుడు హైదరాబాద్ అధికారాల విషయంలో తమకు ఇబ్బందులు సృష్టిస్తే చట్టపరంగా ఎదుర్కొంటామని ఆయన అన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తమ అతిథి అని, ఆయన హైదరాబాద్లో నిరభ్యంతరంగా ఉండొచ్చని కేటీఆర్ తెలిపారు. అయితే.. గురుకుల భూముల్లో చంద్రబాబుకు ఎవరైనా బినామీలున్నారా, అక్కడ అక్రమ నిర్మాణాలు కూలిస్తే చంద్రబాబు ఎందుకు ఉలిక్కి పడుతున్నారని ప్రశ్నించారు.