ఉద్యమ నేపథ్యంతో ప్రభుత్వం ఏర్పడిందని చెబుతున్న టిఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రతిదీ వివాదస్పదం చేస్తోందని ‘తెలంగాణ ఉద్యమ వేదిక’ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్ అన్నారు. ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో ఉస్మానియా ఆసుపత్రిని ట్విన్ టవర్స్ కడతామని, కొద్ది రోజులు గడిచాక దాని స్థలంలో పేదలకు ఇళ్లు నిర్మించాలని తదితర పొంతన లేని విషయాలతో ప్రజలను అయోమయానికి గురి చేస్తోందని ఆయన మండిపడ్డారు. తాజాగా జిల్లాల విభజన పేరుతో ప్రజల మధ్యనే ప్రభుత్వం చిచ్చుపెడుతూ తన అస్థిత్వాన్ని కోల్పోతోందని విమర్శించారు. బుధవారం ఆదర్శ్‌నగర్‌లో ‘తెలంగాణ ఉద్యమ వేదిక’ పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజలతో చర్చించకుండా సొంత పోకడలతో జిల్లాలను విభజించడం ఏంటని ప్రశ్నించారు. ఇష్టానుసారంగా జిల్లాలను విభజించడం వల్ల ప్రజలు కొట్టుకునే పరిస్థితి దాపురిస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్ర పాలనా వ్యవస్థ గాడితప్పి ఫామ్ హౌస్‌కు పరిమితం అయ్యిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రభుత్వం సాయం చేయలేని పరిస్థితిలో ఉందన్నారు. దీనిద్వారా ప్రజలు రోగాల బారీన పడుతున్నారన్నారు. నల్లగొండ జిల్లా ‘కొండకిందిగూడెం’ ఒక్క గ్రామంలోనే వంద మంది విషజ్వరాలతో మంచానకెక్కారన్నారు. వీరికి ప్రభుత్వ ఆసుపత్రిల్లో వైద్యం ఇవ్వనందున ప్రైవేటు ఆసుపత్రుల్లో వీరు పెట్టిన ఖర్చు అక్షరాల రూ.1.5కోట్లనితెలిపారు. డెంగీ జ్వరాన్ని కూడా ‘ఆరోగ్యశ్రీ’లో కలపాలని ఇప్పటికే రాష్ట్ర ఆరోగ్యమంత్రి, సీఎస్‌ను కలసి విన్నవించామన్నారు. ప్రభుత్వం సరైన విధంగా చర్యలు తీసుకోకపోతే చికెన్‌గున్యా వచ్చే అవకాశం ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రానికి సెప్టెంబర్ 17 ఎంతో ప్రముఖమైన రోజన్నారు. ఆ రోజును అధికారికంగా నిర్వహించేందుకు ప్రభుత్వం కిందామీదా పడటం సిగ్గుచేటన్నారు. ఏ మాత్రం ఉద్యమంలో లేని ఎంపీ కవిత, మంత్రి కేటీఆర్‌లు 17పై అనవసర మాటలు మాట్లాడం తగదన్నారు. పాలనను గాడిలో పెట్టి ప్రజలకు సురక్షిత పాలను అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉందని తెలిపారు.
‘తెలంగాణ ప్రభుత్వం ప్రతిదీ వివాదం చేస్తోంది’
Published Wed, Sep 14 2016 7:24 PM | Last Updated on Tue, Sep 4 2018 5:24 PM
Advertisement