Dr. cheruku Sudhakar
-
విలాస జీవితాన్ని గడుపుతున్న కేసీఆర్
గిరిజనులకిచ్చిన హామీలను విస్మరించారు: ఉత్తమ్ హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం వచ్చాక కేసీఆర్ కోట్లాది రూపాయల ప్రజల సొమ్ముతో అధునాతన భవనాలు నిర్మించుకొని, విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎద్దేవా చేశారు. గిరిజనులకు ఇచ్చిన హామీలను విస్మరించి, వారిని మోసం చేస్తున్నారని విమర్శించారు. ఆదివారం హైదరాబాద్‌లోని బాగ్‌లింగంపల్లి ఆర్టీసీ కల్యాణ మండపంలో తెలంగాణ గిరిజన జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఏప్రిల్‌లో జరగనున్న ‘గిరిజన రణ శంఖారావం’పోస్టర్‌ను ఉత్తమ్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే గిరిజనులకు ఉద్యోగాలు వస్తాయని మాయమాటలు చెప్పారని అన్నారు. దీనివల్ల 2014 ఎన్నికల్లో ఏజెంట్లు కూడా దొరకని గిరిజన తండాల్లో ఓట్లు కూడా ఎక్కువగా పడ్డాయని అన్నారు. గిరిజనులకు డబుల్ బెడ్రూంలు ఇస్తానని దగా చేశారని విమర్శించారు. ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో గిరిజనులు కూడా కీలక పాత్ర పోషించారని అన్నారు. తండాల అభివృద్ధి ఎంతో అవసరమని.. అందువల్ల తండాలను పంచాయతీలుగా గుర్తించాలని ఆయన కోరారు. భూసేకరణలో మొదటి దెబ్బ గిరిజనులపైనే పడుతుందని అన్నారు. అటవీ హక్కుల చèట్టాన్ని కూడా అమలు చేయకుండా గిరిజనులకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమ వేదిక అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్ మాట్లాడుతూ ఇచ్చిన మాటను నిలబెట్టుకోకుంటే ప్రజలు పాతర వేస్తారని అన్నారు. తెలంగాణ గిరిజన జేఏసీ కన్వీనర్, మాజీ ఎంపీ రవీంద్రనాయక్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, అమర్ సింగ్ తిలావత్, గిరిజన సంఘం నాయకులు గణేశ్‌నాయక్, దాసురాంనాయక్ తదితరులు పాల్గొన్నారు. -
‘తెలంగాణ ప్రభుత్వం ప్రతిదీ వివాదం చేస్తోంది’
ఉద్యమ నేపథ్యంతో ప్రభుత్వం ఏర్పడిందని చెబుతున్న టిఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రతిదీ వివాదస్పదం చేస్తోందని ‘తెలంగాణ ఉద్యమ వేదిక’ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్ అన్నారు. ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో ఉస్మానియా ఆసుపత్రిని ట్విన్ టవర్స్ కడతామని, కొద్ది రోజులు గడిచాక దాని స్థలంలో పేదలకు ఇళ్లు నిర్మించాలని తదితర పొంతన లేని విషయాలతో ప్రజలను అయోమయానికి గురి చేస్తోందని ఆయన మండిపడ్డారు. తాజాగా జిల్లాల విభజన పేరుతో ప్రజల మధ్యనే ప్రభుత్వం చిచ్చుపెడుతూ తన అస్థిత్వాన్ని కోల్పోతోందని విమర్శించారు. బుధవారం ఆదర్శ్‌నగర్‌లో ‘తెలంగాణ ఉద్యమ వేదిక’ పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజలతో చర్చించకుండా సొంత పోకడలతో జిల్లాలను విభజించడం ఏంటని ప్రశ్నించారు. ఇష్టానుసారంగా జిల్లాలను విభజించడం వల్ల ప్రజలు కొట్టుకునే పరిస్థితి దాపురిస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్ర పాలనా వ్యవస్థ గాడితప్పి ఫామ్ హౌస్‌కు పరిమితం అయ్యిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రభుత్వం సాయం చేయలేని పరిస్థితిలో ఉందన్నారు. దీనిద్వారా ప్రజలు రోగాల బారీన పడుతున్నారన్నారు. నల్లగొండ జిల్లా ‘కొండకిందిగూడెం’ ఒక్క గ్రామంలోనే వంద మంది విషజ్వరాలతో మంచానకెక్కారన్నారు. వీరికి ప్రభుత్వ ఆసుపత్రిల్లో వైద్యం ఇవ్వనందున ప్రైవేటు ఆసుపత్రుల్లో వీరు పెట్టిన ఖర్చు అక్షరాల రూ.1.5కోట్లనితెలిపారు. డెంగీ జ్వరాన్ని కూడా ‘ఆరోగ్యశ్రీ’లో కలపాలని ఇప్పటికే రాష్ట్ర ఆరోగ్యమంత్రి, సీఎస్‌ను కలసి విన్నవించామన్నారు. ప్రభుత్వం సరైన విధంగా చర్యలు తీసుకోకపోతే చికెన్‌గున్యా వచ్చే అవకాశం ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రానికి సెప్టెంబర్ 17 ఎంతో ప్రముఖమైన రోజన్నారు. ఆ రోజును అధికారికంగా నిర్వహించేందుకు ప్రభుత్వం కిందామీదా పడటం సిగ్గుచేటన్నారు. ఏ మాత్రం ఉద్యమంలో లేని ఎంపీ కవిత, మంత్రి కేటీఆర్‌లు 17పై అనవసర మాటలు మాట్లాడం తగదన్నారు. పాలనను గాడిలో పెట్టి ప్రజలకు సురక్షిత పాలను అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉందని తెలిపారు. -
కుటుంబ పాలన సాగిస్తున్న సీఎం కేసీఆర్
డాక్టర్ చెరుకు సుధాకర్ నల్లగొండ రూరల్ : అనేక మంది తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడంతో పాటు పలువురు ప్రాణత్యాగం చేయగా వచ్చిన తెలంగాణను సీఎం కేసీఆర్ కుటుంబమే తెచ్చినట్లు చరిత్రను మార్చేందుకు కుట్ర చేస్తున్నారని తెలంగాణ ఉద్యమవేదిక రాష్ట్ర కన్వీనర్ చెరుకు సుధాకర్ అన్నారు. తెలంగాణ స్ఫూర్తి యాత్రలో భాగంగా శుక్రవారం స్థానిక క్లాక్‌టవర్‌లోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఎన్నికైన ఎమ్మెల్యేలు, మంత్రు ల్లో అనేక మంది తెలంగాణ ద్రోహులు ఉన్నారని, ఏనాడూ జై తెలంగాణ అనని వారిని సీఎం నెత్తిన పెట్టుకుని పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు. ఉద్యమకారులు అనేక ఇబ్బందుల్లో ఉన్నా పట్టించుకోకుండా ఖమ్మం జిల్లాకు చెం దిన ఓ బాలిక తెలంగాణ చరిత్రను తెలి యజేసిందని రూ.10 లక్షలు అందించారని, రంగారెడ్డి జిల్లాకు చెందిన టీఆర్ఎస్ యువజన విభాగం ఉపాధ్యక్షుడు జక్కల యాకస్వామి భువనగిరిలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంటే పట్టించుకోలేదన్నారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పనులను అల్లుడికి, కొ డుకుకు అప్పగించారని,కుమార్తె కవితకు కేంద్రంలో మంత్రి పదవి కోసం తహతహలాడుతున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు ఫ్లోరైడ్ నివారణకు చర్యలు తీసుకుంటామని చెప్పి నేడు పట్టించుకోలేదన్నారు. అంశాల స్వామి లాంటి ఫ్లోై రెడ్ బాధితులు జిల్లాలో ఎంతో మంది ఉ న్నారని, వీరందరికీ విముక్తి కలగాల్సిన అవసరం ఉందన్నారు. మాజీ ఎమ్మెల్యే యన్నం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ అమరులని పూర్తిస్థాయిలో ఆదుకోలేదన్నారు. ఎన్నికల ముందు 1200 మంది తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేశారని చెప్పి సహా యం అందించే సమయంలో అందరికీ న్యాయం చేయలేదన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే చిట్టెం రాం మోహన్‌రెడ్డికి రూ.30 కోట్లు ఇచ్చి పా ర్టీలో చేర్చుకున్నారని ఆరోపించారు. యానాల లింగారెడ్డి, చెరుకు లక్ష్మి, పాల్వాయి రవి, చుక్కా సైదులు పాల్గొన్నారు. -
ఉద్యమ ద్రోహులకు టీఆర్ఎస్ టికెట్లు
*టీఆర్ఎస్పై చెరుకు సుధాకర్ ధ్వజం *పార్టీకి రాజీనామా సాక్షి,హైదరాబాద్: తెలంగాణ వ్యతిరేకులకు, ద్రోహులకు.. కేసీఆర్ టికెట్లు కేటాయిస్తూ అపరిచితుడిగా మారుతున్నారని టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు డా.చెరుకు సుధాకర్ ఆరోపించారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత వాచ్‌డాగ్‌లా ఉంటానని, దళితుడిని తెలంగాణకు మొదటి ముఖ్యమంత్రి చేస్తానని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న నాయకులను కొట్టి తరిమేసిన వారికే కేసీఆర్ టికెట్లు ఇస్తున్నారని విమర్శించారు. తనకు టికెట్ కేటాయించని టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. త్వరలోనే తన కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు. ప్రధాన పార్టీలు తనను ఉద్యమకారుడిగా గుర్తిస్తే తన వారితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. సుధాకర్‌ను అడ్డుకున్న టీఆర్ఎస్ కార్యకర్తలు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి, పదవికి రాజీనామా చేసేందుకు వచ్చిన చెరుకు సుధాకర్‌ను తెలంగాణ భవన్‌లోకి వెళ్లకుండా పార్టీ కార్యకర్తలు అడ్డుకొన్నారు. మంగళవారం ఉదయం ఆయన రాజీనామా లేఖతో తెలంగాణ భవన్‌కు వచ్చారు. లోపలికి వెళ్లడానికి ప్రయత్నించగా కార్యకర్తలు ‘సుధాకర్ గో బ్యాక్’ అంటూ నినాదాలు చేస్తూ అడ్డుకున్నారు. కేసీఆర్‌పై విమర్శలు చేసే నువ్వు భవన్‌లోకి అడుగుపెట్టడానికి అనర్హుడివంటూ అడ్డుతగిలారు. తాను తెలంగాణ భవన్ కార్యదర్శికి రాజీనామా లేఖను ఇవ్వడానికి వచ్చానని, గొడవకు రాలేదని ఆయన చెప్పినా కార్యకర్తలు విన్పించుకోకుండా అడ్డుకున్నారు. దీంతో ఇరుపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పరిస్థితి ఉద్రిక్తతంగా మారకుండా బంజారాహిల్స్ పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. బందోబస్తు నడుమ తెలంగాణ భవన్ కార్యదర్శి వద్దకు వెళ్లి సుధాకర్ రాజీనామా లేఖను ఇచ్చారు.