విలాస జీవితాన్ని గడుపుతున్న కేసీఆర్
గిరిజనులకిచ్చిన హామీలను విస్మరించారు: ఉత్తమ్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం వచ్చాక కేసీఆర్ కోట్లాది రూపాయల ప్రజల సొమ్ముతో అధునాతన భవనాలు నిర్మించుకొని, విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎద్దేవా చేశారు. గిరిజనులకు ఇచ్చిన హామీలను విస్మరించి, వారిని మోసం చేస్తున్నారని విమర్శించారు. ఆదివారం హైదరాబాద్‌లోని బాగ్‌లింగంపల్లి ఆర్టీసీ కల్యాణ మండపంలో తెలంగాణ గిరిజన జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఏప్రిల్‌లో జరగనున్న ‘గిరిజన రణ శంఖారావం’పోస్టర్‌ను ఉత్తమ్ ఆవిష్కరించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ టీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే గిరిజనులకు ఉద్యోగాలు వస్తాయని మాయమాటలు చెప్పారని అన్నారు. దీనివల్ల 2014 ఎన్నికల్లో ఏజెంట్లు కూడా దొరకని గిరిజన తండాల్లో ఓట్లు కూడా ఎక్కువగా పడ్డాయని అన్నారు. గిరిజనులకు డబుల్ బెడ్‌రూంలు ఇస్తానని దగా చేశారని విమర్శించారు. ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో గిరిజనులు కూడా కీలక పాత్ర పోషించారని అన్నారు. తండాల అభివృద్ధి ఎంతో అవసరమని.. అందువల్ల తండాలను పంచాయతీలుగా గుర్తించాలని ఆయన కోరారు. భూసేకరణలో మొదటి దెబ్బ గిరిజనులపైనే పడుతుందని అన్నారు. అటవీ హక్కుల చèట్టాన్ని కూడా అమలు చేయకుండా గిరిజనులకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ ఉద్యమ వేదిక అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్ మాట్లాడుతూ ఇచ్చిన మాటను నిలబెట్టుకోకుంటే ప్రజలు పాతర వేస్తారని అన్నారు. తెలంగాణ గిరిజన జేఏసీ కన్వీనర్, మాజీ ఎంపీ రవీంద్రనాయక్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, అమర్ సింగ్ తిలావత్, గిరిజన సంఘం నాయకులు గణేశ్‌నాయక్, దాసురాంనాయక్ తదితరులు పాల్గొన్నారు.