ఉద్యమ ద్రోహులకు టీఆర్‌ఎస్ టికెట్లు
*టీఆర్‌ఎస్‌పై చెరుకు సుధాకర్ ధ్వజం
*పార్టీకి రాజీనామా
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ వ్యతిరేకులకు, ద్రోహులకు.. కేసీఆర్ టికెట్‌లు కేటాయిస్తూ అపరిచితుడిగా మారుతున్నారని టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు డా.చెరుకు సుధాకర్ ఆరోపించారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత వాచ్‌డాగ్‌లా ఉంటానని, దళితుడిని తెలంగాణకు మొదటి ముఖ్యమంత్రి చేస్తానని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదన్నారు.
తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న నాయకులను కొట్టి తరిమేసిన వారికే కేసీఆర్ టికెట్లు ఇస్తున్నారని విమర్శించారు. తనకు టికెట్ కేటాయించని టీఆర్‌ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. త్వరలోనే తన కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు. ప్రధాన పార్టీలు తనను ఉద్యమకారుడిగా గుర్తిస్తే తన వారితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని చెప్పారు.
సుధాకర్‌ను అడ్డుకున్న టీఆర్‌ఎస్ కార్యకర్తలు
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి, పదవికి రాజీనామా చేసేందుకు వచ్చిన చెరుకు సుధాకర్‌ను తెలంగాణ భవన్‌లోకి వెళ్లకుండా పార్టీ కార్యకర్తలు అడ్డుకొన్నారు. మంగళవారం ఉదయం ఆయన రాజీనామా లేఖతో తెలంగాణ భవన్‌కు వచ్చారు. లోపలికి వెళ్లడానికి ప్రయత్నించగా కార్యకర్తలు ‘సుధాకర్ గో బ్యాక్’ అంటూ నినాదాలు చేస్తూ అడ్డుకున్నారు. కేసీఆర్‌పై విమర్శలు చేసే నువ్వు భవన్‌లోకి అడుగుపెట్టడానికి అనర్హుడివంటూ అడ్డుతగిలారు.
తాను తెలంగాణ భవన్ కార్యదర్శికి రాజీనామా లేఖను ఇవ్వడానికి వచ్చానని, గొడవకు రాలేదని ఆయన చెప్పినా కార్యకర్తలు విన్పించుకోకుండా అడ్డుకున్నారు. దీంతో ఇరుపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పరిస్థితి ఉద్రిక్తతంగా మారకుండా బంజారాహిల్స్ పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. బందోబస్తు నడుమ తెలంగాణ భవన్ కార్యదర్శి వద్దకు వెళ్లి సుధాకర్ రాజీనామా లేఖను ఇచ్చారు.