సాక్షిప్రతినిధి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కొందరు టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు మంత్రివర్గ విస్తరణ షాక్ నుంచి ఇంకా తేరుకోవడం లేదు. ఏళ్ల తరబడిగా తెలంగాణ ఉద్యమం, టీఆర్‌ఎస్ పార్టీలో గులాబీ దళనేత కేసీఆర్ వెంట నడిచిన పలువురి ఆశలు అడియాసలు అయ్యాయి. రెండోసారి తెలంగాణలో టీఆర్‌ఎస్ అధికారంలో వచ్చిన నేపథ్యంలో చివరి నిమిషంలో అవకాశం చేజారడాన్ని ఆశావహులు ఇంకా జీర్ణించుకోవడం లేదు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కనీసం రెండు మంత్రి పదవులన్నా దక్కుతాయని భావించగా... ఎర్రబెల్లి దయాకర్‌రావు ఒక్కరితోనే సరిపెట్టడంతో అమాత్య పదవి రేసులో ఉన్న నేతలకు చుక్కెదురు అయ్యింది. టీఆర్‌ఎస్ పార్టీ అధినాయకత్వం, సీఎం కేసీఆర్‌పై విధేయత ఉన్నా... చివరి నిముషంలో చేజారిన బృహత్తర అవకాశాన్ని మరచిపోలేక పోతున్నారు. ఇదే సమయంలో టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్లమెంట్ నియోజకవర్గాల సన్నాహక సమావేశాల షెడ్యూల్ ఖరారు కాగా, ఆ సమావేశాలను సక్సెస్ చేయాల్సిన బాధ్యత ఉమ్మడి జిల్లా ప్రజాప్రతిని«ధులు భుజాన వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
గత కేబినెట్‌ను పోల్చుకున్న ఆశావహులు
తెలంగాణ రాష్ట్ర తొలి కేబినెట్‌లో జిల్లాకు స్పీకర్, రెండు మంత్రి పదవులు దక్కాయి. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య, రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్, స్పీకర్‌గా సిరికొండ మధుసూదనాచారికి అవకాశం దక్కింది. తర్వాత డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా రాజయ్య పదవి కోల్పోవడంతో ఆయన స్థానంలో కడియం శ్రీహరికి ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రిగా అవకాశం కల్పించారు. డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ విజయం సాధించగా రెండోసారి సీఎంగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టిన సమయంలో మహమూద్ అలీతో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. అయితే ›ఫిబ్రవరి 19న జరిగిన విస్తరణలో మాజీ మంత్రితో పాటు మరొకరికైనా మంత్రి పదవులు వస్తాయని ఆశించారు.
ఇందులో భాగంగానే కడియం శ్రీహరి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్, ధరంసోత్ రెడ్యానాయక్ తదితరులు ఎవరికీ వారుగా మంత్రి వర్గంలో చోటు లభిస్తుందని ఆశించారు. అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఒక్క ఎర్రబెల్లి దయాకర్‌రావుకే మంత్రి పదవి దక్కడంతో మిగతా నేతల ఆశలపై నీళ్లు జల్లినట్లయ్యింది. చివరి నిమిషం వరకు వస్తుందనుకున్నప్పటికీ రాకపోవడంతో పలువురు అసంతృప్తికి గురి కాగా... యువనేత, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రంగంలోకి దిగడంతో అసంతృప్తి నేతలు కలిసి నడుస్తున్నారు. ఇలా అసంతృప్తులపై ‘తారక’మంత్రం పని చేస్తోంది.
మంత్రి ‘ఎర్రబెల్లి’ ఇంట్లో నేతల భేటీ
కేటీఆర్ పర్యటనను విజయవంతం చేసేందుకు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు హన్మకొండలోని రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు నివాసంలో శనివారం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మంత్రి ఎర్రబెల్లితో పాటు మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, రాజ్యసభ సభ్యులు బండా ప్రకాష్, ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌భాస్కర్, నన్నపనేని నరేందర్, టి.రాజయ్య, చల్లా ధర్మారెడ్డి, అరూరి రమేష్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ గద్దల పద్మ, కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, టీవీవీ చైర్మన్ వాసుదేవరెడ్డి, పార్టీ నాయకులు మార్నేని రవిందర్‌రావు, బీరెల్లి భరత్‌కుమార్, ధర్మరాజు తదితరులు పాల్గొన్నారు.
కేటీఆర్ పర్యటనను విజయవంతం చేద్దాం..
ఈ సందర్భంగా మంత్రి దయాకర్‌రావు మాట్లాడుతూ ఈ నెల 7న వరంగల్ పర్యటనకు వస్తున్న కల్వకుంట్ల తారకరామారావు పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పార్లమెంట్ ఎన్నికలపై పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా ముఖ్యకార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తున్న టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈనెల 7న ఉదయం వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి ముఖ్యకార్యకర్తలతో సన్నాహక సమావేశంలో పాల్గొనేందుకు నగరానికి వస్తున్నారని తెలిపారు. ఆయనకు ఘనస్వాగతం పలకడానికి, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మూడువేల మంది ముఖ్యకార్యకర్తలు హాజరయ్యే విధంగా చూడాలన్నారు. నగరాన్ని సుందరంగా తీర్చిదిద్ది, స్వాగతం తోరణాలు ఏర్పాటు చేయాలని, అందుకు అవసరమైన కమిటీలను వేసి ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment