సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు దావోస్ పర్యటన విజయవంతంగా ముగిసింది. అక్కడ జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు సమావేశాలు ముగియడంతో శుక్రవారం రాత్రి ఆయన హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా కేటీఆర్ పలు ప్రముఖ కంపెనీల ప్రతినిధులు, వివిధ దేశాల మంత్రులను కలిశారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించి స్థానికంగా ఉపాధి అవకాశాలను పెంచే లక్ష్యంగా వారితో చర్చలు జరిపారు. నాలుగు రోజుల్లో 50కి పైగా ముఖాముఖి సమావేశాలతో పాటు, వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహించిన 5 చర్చా గోష్ఠిల్లో పాల్గొన్నారు.
ఆల్ఫాబెట్, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, కోకోకోల సీఈఓ జేమ్స్ క్వేన్సీ, సేల్స్‌ఫోర్స్ చైర్మన్ మార్క్ బెనియాఫ్, యూట్యూబ్ సీఈవో సుసాన్ వొజ్కికి వంటి కార్పొరేట్ దిగ్గజాలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో అమలు చేస్తున్న ప్రగతిశీల విధానాలు, పారిశ్రామిక పాలసీ, పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, వనరులను పరిచయం చేశారు. సరళీకృత వ్యాపార ర్యాంకుల్లో రాష్ట్రం అగ్రస్థానంలో నిలుస్తున్న అంశాన్ని ప్రస్తావించారు. గత ఐదేళ్లుగా నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతున్న తీరును, ఇక్కడి విశ్వనగర సంస్కృతి, అత్యుత్తమ జీవన ప్రమాణాలను వివరించారు.
ఈ సదస్సుల్లో భాగంగా నిర్వహించిన చర్చల సందర్భంగా పిరమల్ గ్రూపు రూ.500 కోట్ల పెట్టుబడితో రాష్ట్రంలోని తమ ఔషధ పరిశ్రమను విస్తరించేందుకు ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. పెట్టుబడి దారులను ఆకర్షించేందుకు దావోస్‌లో ప్రభుత్వం తెలంగాణ పెవిలియన్ ఏర్పాటు చేసింది. మధ్యప్రదేశ్, కర్ణాటక తదితర రాష్ట్రాలు ఈ సదస్సులో పాల్గొన్నప్పటికీ, రాష్ట్రానికి మాత్రమే పెట్టుబడులు వచ్చాయని మంత్రి కేటీఆర్ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment