ఎల్లారెడ్డిపేట: నాలుగేళ్ల కేసీఆర్ పాలనపై ప్రతిపక్షాలకు కడుపు మండుతోందని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. ఒక్క కేసీఆర్‌ను ఓడించేందుకు విపక్షాలన్నీ కూటమిగా ఏర్పాటు అవుతున్నాయని చెప్పారు. పందులు గుంపులుగా వస్తాయి.. సింహం సింగిల్‌గా వస్తుందనే విషయం మరచిపోకూడదని విపక్షాలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్‌నగర్, పదిర, ఎల్లారెడ్డిపేట, రాచర్ల గొల్లపల్లిలో రూ.1.32 కోట్ల వ్యయంతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు సోమవారం ఆయన శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం హరిదాస్‌నగర్‌లో జరిగిన సభలో మంత్రి మాట్లాడారు. ప్రభుత్వం కమీషన్ల కోసమే ప్రాజెక్టులు కడుతోందని నీతిమాలిన వ్యాఖ్యలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ.. తన హయాంలో చేపట్టిన ప్రాజెక్టులు కూడా కమీషన్ల కోసమే కట్టిందా? అని ప్రశ్నించారు.
14 ఏళ్లు కొట్లాడి సాధించుకున్న తెలంగాణను బంగారు రాష్ట్రంగా మార్చడానికి టీఆర్‌ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతోందని మంత్రి వివరించారు. తమ ప్రభుత్వ పాలనకు ప్రజలు పట్టం కడుతున్నారనే దానికి జీహెచ్‌ఎంసీలో వంద సీట్లు, వరంగల్, నారాయణఖేడ్, పాలేరు ఉపఎన్నికల ఫలితాలే నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. 2019 ఎన్నికల్లో కేసీఆర్ సీఎంగా ఉండాలని గ్రామాలు ఏకగ్రీవ తీర్మానాలు చేస్తున్నాయని తెలిపారు.
మరో 119 గురుకులాల ఏర్పాటు
రాష్ట్రంలో ఇప్పటి వరకు 119 బీసీ గురుకుల పాఠశాలలు ఉండగా అదనంగా 119 గురుకులాలను ఏర్పాటు చేస్తున్నామని కేటీఆర్ తెలిపారు. ఏడాది రూ.1.20 లక్షల చొప్పున వెచ్చించి ఆంగ్లమాధ్యమంలో విద్యాబోధన చేస్తున్నామని, నాణ్యమైన భోజనాన్ని అందిస్తున్నామని చెప్పారు.
రాష్ట్రంలో 12,751 గ్రామపంచాయతీలు పదిర, హరిదాస్‌నగర్ పంచాయతీలను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. అధికార వికేంద్రీకరణలో భాగంగానే పాలనను ప్రజల చెంతకు తెచ్చేందుకు కొత్త గ్రామపంచాయతీల ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు, కలెక్టర్ కృష్ణభాస్కర్, ఎస్పీ రాహుల్‌హెగ్డే, రైతు సమన్వయ సమితి జిల్లా కో ఆర్డీనేటర్ గడ్డం నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment