బాధితులకు అండగా ఉంటాం: కేటీఆర్
హైదరాబాద్: అమెరికాలో తెలుగువారిపై జరిగిన దాడులపై తెలంగాణ రాష్ట్ర మంత్రి కే తారకరామారావు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. వంశీ, శ్రీనివాస్, అలోక్‌ల కుటుంబాలకు ట్విట్టర్ వేదికగా తన సానుభూతి తెలిపారు. బాధితులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. దాడులపై విదేశాంగ శాఖతో చర్చిస్తామని తెలిపారు.
కన్సాస్ రాష్ట్రం ఒలాతేలో బుధవారం రాత్రి ఓ బార్‌లో జాతి విద్వేషంతో అమెరికన్ జరిపిన కాల్పుల్లో ఇంజనీర్లు శ్రీనివాస్ కూచిబొట్ల ప్రాణాలు కోల్పోగా, అలోక్‌కు గాయాలయ్యాయి. వీరిద్దరూ గార్నిమ్ కంపెనీలో ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. జేఎన్‌టీయూలో డిగ్రీ చదివిన శ్రీనివాస్ అమెరికాలోని టెక్సాస్ యూనివర్సిటీలో ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు.
(చదవండి: అమెరికాలో జాతి విద్వేష కాల్పులు)
గత 15 రోజుల్లో అమెరికాలో దుండగులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు తెలుగు వారు మృతి చెందారు. ఈ నెల 12న కాలిఫోర్నియాలో వరంగల్‌కు చెందిన వంశీరెడ్డి ఓ యువతిని కాపాడబోయే ప్రయత్నంలో దుండగుడు జరిపిన కాల్పుల్లో మృతి చెందిన విషయం తెలిసిందే.