జాతి వివక్షకు 'అధికారం' తోడైతే.. | After Donald trump the increasing racial attacks in the United States | Sakshi
Sakshi News home page

జాతి వివక్షకు 'అధికారం' తోడైతే..

Published Sat, Feb 25 2017 2:25 AM | Last Updated on Thu, Apr 4 2019 5:04 PM

జాతి వివక్షకు 'అధికారం' తోడైతే.. - Sakshi

జాతి వివక్షకు 'అధికారం' తోడైతే..

- ట్రంప్‌ వచ్చాక అమెరికాలో పెరిగిపోతున్న జాతి వివక్ష దాడులు
- ఇప్పటిదాకా ఏకంగా 1,094 ఘటనలు
- అత్యధికం యూనివర్సిటీ క్యాంపస్‌లలోనే..
- భారతీయ విద్యార్థులకు కరువవుతున్న భద్రత


‘మా దేశం నుంచి వెళ్లిపొండి...’ తెలుగు ఇంజనీర్‌ కూచిబొట్ల శ్రీనివాస్‌ను కాల్చి చంపుతూ దుండగుడు అడమ్‌ పూరింటన్‌ గట్టిగా అరుస్తూ అన్న మాటలివి! వీటిలో అతడి నరనరాన జీర్ణించుకుపోయిన జాతి వివక్ష ధ్వనిస్తోంది. ‘అమెరికా మాది. ఎక్కడెక్కడి నుంచో వచ్చి మా ఉద్యోగాలను కొల్లగొడుతున్నారు. మా పొట్ట కొడుతున్నారు. విదేశీయులకు ఇక్కడ స్థానం లేదు. వెళ్లిపోవాల్సిందే...’ అన్నది ఇలాంటి వారి ఆక్రోశం. శ్వేత జాత్యహంకార భావజాలం.

అయితే ఇది ఏ కొద్దిమందికో పరిమితమైంది కాదు. శ్వేత జాతీయుల్లో అంతర్లీనంగా విస్తరించి.. బలపడుతోంది. అందుకే ‘ఫస్ట్‌ అమెరికా...’ అన్న డొనాల్డ్‌ ట్రంప్‌ వీరికి నచ్చాడు. విద్వేషపూరిత భావజాలమున్న వారిని ట్రంప్‌ తన బృందంలో చేర్చుకోవడంతో.. అధికారంపై ఈ అతివాదుల పట్టు బిగుస్తోంది. భవిష్యత్తులో ద్వేషపూరిత దాడులు మరింత తీవ్రమవుతాయేమోననే భయాన్ని రేకెత్తిస్తోంది. ఈ భయం సహేతుకమే అని చెప్పడానికి తగిన ఆధారాలూ ఉన్నాయి.


ట్రంప్‌ వచ్చాక ఇదీ పరిస్థితి..
ట్రంప్‌ గెలుపు ఖాయమైన రోజు(నవంబర్‌ 9) నుంచి తీసుకుంటే.. మొత్తం 1,094 ద్వేషపూరిత ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇందులో దూషణలు మొదలుకుని దాడులు చేయడం, కాల్పులకు తెగబడటం దాకా అన్నిరకాల విద్వేషపూరిత ఘటన లున్నాయి. మత, జాతి వివక్ష, వలస జీవులపై వ్యతిరేకత, స్వలింగసంపర్కులపై ఏహ్యభావం, మహిళల పట్ల చులకన భావం వంటివి ఎన్నో రకాల ద్వేషపూరిత దాడులున్నాయి. సదరన్‌ పావర్టీ లా సెంటర్‌ ఇలాంటి ఘటనలను నమోదు చేస్తుంది.

ఇందులో వలసలపై వ్యతిరేకతతో జరిగిన ఘటనలే 315. తర్వాతి స్థానం జాతి వివక్షది. నల్ల జాతీయులపై దాడులు, దూషణలకు దిగిన ఘటనలు 221. న్యూయార్క్‌ పోలీసు విభాగానికి చెందిన డిటెక్టివ్స్‌ చీఫ్‌ రాబర్ట్‌ బోయెస్‌ కూడా ద్వేషపూరిత దాడులు 115% పెరిగాయని(ట్రంప్‌ గెలిచాక) అంగీకరించారు. అంతకుముందు అమెరికావ్యాప్తంగా తీసుకున్నా ఇలాంటి ఘటనలు రెండంకెలకు మించలేదు. ట్రంప్‌ గెలిచిన రోజున ఏకంగా 200 పైగా ఘటనలు నమోదయ్యాయి. ద్వేషపూరిత దాడుల్లో చాలావాటిలో దుండగులు ట్రంప్‌ పేరును వాడటం.. ‘మా వాడొచ్చాడు, మీకిక మూడినట్లే..’ అని అనడం శ్వేతజాత్యహంకారుల్లో బలపడిన నమ్మకాన్ని రుజువు చేస్తోందని విశ్లేషకుల అభిప్రాయం.

శ్వేతసౌధంలో అతివాదులు...
ట్రంప్‌ ఎన్నిక... రాజకీయాల్లో అతివాదులకు మార్గం సుగమం చేసింది. స్వలింగ సంపర్కాన్ని గట్టిగా వ్యతిరేకించే కెన్నెత్‌ బ్లాక్‌వెల్‌ను అధికార మార్పిడి బృందానికి సారథిగా ట్రంప్‌ నియమించారు. ఇస్లాంను ‘భయంకరమైన క్యాన్సర్‌’గా పోల్చిన, ముస్లింలను చూసి భయపడటం సహేతుకమేనన్న మైక్‌ ఫ్లిన్‌ను జాతీయ భద్రతా సలహాదారుగా నియమించారు (ఈయన కొద్దిరోజులకే వివాదంలో ఇరుక్కొన్ని పదవిని పోగొట్టుకున్నారు). ముస్లింలను తీవ్రంగా వ్యతిరేకించే సంస్థలతో సన్నిహిత సంబంధాలున్న మైక్‌ పాంపియోను సీఐఏ డైరెక్టర్‌గా ట్రంప్‌ ఎంచుకున్నారు.

వీటన్నింటి కంటే ముఖ్యమైనది... చీఫ్‌ స్ట్రాటజిక్‌ అడ్వైజర్‌గా స్టీఫెన్‌ బానన్‌ను నియమించడం. అందరికంటే శ్వేతజాతి గొప్పదని, అమెరికా వాళ్లకే చెందినదనే భావజాలాన్ని ప్రచారం చేసే ‘బ్రీయిట్‌బార్ట్‌’ వెబ్‌సైట్‌కు బానన్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా పనిచేశారు. తీవ్ర జాత్యహంకార భావజాలమున్న వ్యక్తి. తాను అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక ద్వేషపూరిత దాడులు పెరిగాయనే వార్తలు రావడంతో ‘వాటిని ఆపండి’ అంటూ ట్రంప్‌ ఖండించారు. అయితే అధ్యక్షుడికి కనులు, చెవులుగా స్టీఫెన్‌ బానన్‌ లాంటి వ్యక్తి శ్వేతసౌధంలో ఉండగా... ఈ శక్తులు తగ్గుతాయా అనేదే ప్రశ్న.

ఆజ్యం పోస్తున్న ట్రంప్‌ మాటలు...చేతలు
నేషనల్‌ పాలసీ ఇనిస్టిట్యూట్‌ అనే సంస్థ ద్వారా శ్వేత జాత్యహంకార భావజాలాన్ని రిచర్డ్‌ స్పెన్సర్‌ లాంటి అతివాదులు ప్రచారం చేస్తున్నప్పటికీ... వీరికి ట్రంప్‌ రూపంలో పెద్ద అండ కనబడింది. కాబట్టే ఈ భావజాలంతో ఉన్న గ్రూపులు, సంస్థలు ట్రంప్‌ విజయానికి శాయశక్తులా దోహదపడ్డాయి. ‘ఐడెంటిటీ ఎవ్రోపా’ అనే కాలిఫోర్నియా కేంద్రంగా ఉన్న క్యాంపస్‌ గ్రూపు, ది రైట్‌ స్టఫ్, అమెరికన్‌ వాన్‌గార్డ్‌ అనే సంస్థలు ఇంటర్నెట్‌ కార్యక్షేత్రంగా ట్రంప్‌కు అనుకూలంగా విస్తృత ప్రచారం చేశాయి. ద్వేషపూరిత భావజాలాన్ని వ్యాప్తి చేసే సైట్లలో నంబర్‌ వన్‌గా ఉన్న ‘డైలీ స్ట్రోమర్‌’ ట్రంప్‌ను మోసింది.

‘అమెరికాను మళ్లీ గొప్పదేశంగా నిలబెడదాం’ అనే నినాదంతో ఎన్నికల బరిలోకి దిగిన ట్రంప్‌ ప్రచారపర్వం ఆద్యంతం వ్యతిరేక భావజాలాన్నే రెచ్చగొట్టారు. మెక్సికన్లను రేపిస్టులు, డ్రగ్‌ డీలర్లుగా అభివర్ణిస్తూ... వలసలను అడ్డుకోవడానికి సరిహద్దుల్లో గోడ కడతానని వాగ్దానం చేశారు. అమెరికా ఉద్యోగాలు అమెరికన్లకే అన్నారు. ముస్లింలు అమెరికాలోకి అడుగుపెట్టకుండా అడ్డుకుంటామన్నారు. అన్నట్లుగానే ఏడు ముస్లిం ఆధిక్య దేశాల నుంచి వచ్చేవారిని అమెరికాలోకి రానీయకుండా నిషేధాజ్ఞలు జారీచేశారు. కోర్టులు దీన్ని కొట్టివేసినా.. దానిపై ముందుకే వెళుతున్నారు. హెచ్‌1–బీ వీసాలపై ఆంక్షలు పెట్టడం ద్వారా వలసలను అడ్డుకొనే ప్రయత్నం చేస్తున్నారు. అక్రమంగా అమెరికాలో నివసిస్తున్న వారిని స్వదేశానికి పంపే ఏర్పాట్లు చేస్తున్నారు. వీటన్నింటిని కారణంగా... జాత్యహంకార భావజాలమున్న వ్యక్తులు, సంస్థలు ట్రంప్‌ రూపంలో తమకో అండ ఉందనే భరోసాతో రెచ్చిపోతున్నారు. ఆర్థిక అసమానతలు కూడా అమెరికన్లలో అసంతృప్తిని పెంచి అతివాదం వైపు మొగ్గేలా చేస్తున్నాయి.

క్యాంపస్‌లలో భద్రత ఏది?
ఈ ఘటనల్లో ఏకంగా 74% యూనివర్సిటీ క్యాంపస్‌లలోనే చోటుచేసుకున్నాయని ఎస్‌పీఎల్‌సీ సంస్థ గణాంకాలు చెబుతున్నాయి. అమెరికన్‌ వర్సిటీల్లో దాదాపు లక్షా 65 వేల మంది భారతీయులు చదువుతున్నారు. వీరిలో తెలుగు విద్యార్థులు గణనీయంగా ఉంటారు. ఇది మనకు ఆందోళన కలిగించే విషయం. భారత విద్యార్థుల భద్రతపై భయాలను పెంచుతోంది.

పెరుగుతున్న వలసలు...
విదేశాల్లో జన్మించిన అమెరికా పౌరులు 1970లో ఆ దేశ జనాభాలో 4.7 శాతం ఉండగా... 2015లో ఇది ఏకంగా 13.7 శాతం. వలసలు పెరిగిన తీరుకు ఇది అద్దం పడుతుంది. అలాగే అమెరికా జనాభాలో శ్వేత జాతీయుల (మెక్సికో, లాటిన్‌ అమెరికా మూలాలున్న వారు కాకుండా) శాతం 1960ల దాకా 90 ఉండేది. ఇప్పుడిది 62 శాతానికి పడిపోయింది. 2043 కల్లా ఇది జనాభాలో వీరి శాతం 50 లోపునకు పడిపోతుందని సెన్సెస్‌ బ్యూరో అంచనా.

పెరుగుతున్న గ్రూపులు
ద్వేషపూరిత భావజాలాన్ని ప్రచారం చేసే సంస్థలు, గ్రూపులు 1999లో 457 ఉండగా 2016 కల్లా ఇవి రెట్టింపయ్యాయి. 917 గ్రూపులు ప్రస్తుతం పనిచేస్తున్నాయి. ఉగ్రదాడులు, ముస్లింలు కాల్పులకు తెగబడి పదుల సంఖ్యలో జనాలను చంపడం లాంటి ఘటనలతో ముస్లిం వ్యతిరేకతను ప్రచారం చేసే గ్రూపులు ఒక్క ఏడాదిలోనే అనూహ్యంగా పెరిగిపోయాయి. 2015లో 34 ముస్లిం వ్యతిరేక గ్రూపులుంటే 2016 కల్లా వీటి సంఖ్య 101కి చేరింది.

- సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement