వైట్‌హౌస్ సంప్రదాయాలు కాలరాస్తున్న ట్రంప్!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తనకు వ్యతిరేకంగా వార్తలు రాసే మీడియా సంస్థలపై చర్యలు తీసుకున్నారు. ఇన్నాళ్లూ మీడియా తనకు వ్యతిరేకంగా వార్తలు రాస్తోందని తీవ్ర ఆరోపణలు చేస్తూ వచ్చిన ట్రంప్ ఈసారి ఏకంగా పలు మీడియా సంస్థలను శ్వేతసౌధంలో రోజూ జరిగే ప్రెస్ కాన్ఫరెన్స్‌కు అనుమతించకుండా నిషేధం విధించారు. వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ సీన్ స్పైసర్ మీడియా సమావేశం నుంచి సీఎన్‌ఎన్, న్యూయార్క్ టైమ్స్, లాస్‌ఏంజిల్స్ టైమ్స్ సహా పలు మీడియా సంస్థలను మినహాయించారు. తనకు అనుకూల కథనాలు ప్రసారం చేసే కొన్ని మీడియా సంస్థలనే ఈవెంట్లకు ఆహ్వానిస్తున్నారు.
మరోవైపు వైట్‌హౌస్ సంప్రదాయాలను ట్రంప్ కాలరాస్తున్నారు. ప్రెస్ బ్రీఫింగ్ గదిలో నిత్యం జరిగేలా ఆన్-కెమెరా సమావేశం కాకుండా ఆఫ్-కెమెరా కెమెరా సమావేశం నిర్వహించారు. దీన్నిబట్టి చూస్తే మీడియాపై తన అధికారాలను మరింత విస్తృతం చేస్తూ అధ్యక్షుడు ట్రంప్ తన ఇష్ట రీతిన వ్యవహిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు జాతి విద్వేషంతో శ్వేతజాతి ఉన్మాది భారతీయ ఇంజినీర్ శ్రీనివాస్ కుచిభోట్లను కాల్చి హత్య చేయడంపై అమెరికాలో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ ప్రమాణం చేసినప్పటి నుంచి దేశంలో విద్వేష నేరాలు, జాతి వివక్ష దాడులు పెరిగిపోయాయని ఇక్కడ నివాసం ఉంటున్న విదేశీయులు ఆందోళన వ్యక్తం చేశారు.
గతేడాది అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం సమయంలోనూ మీడియా తనపై కావాలనే ఉద్దేశపూర్వకంగా తప్పుడు కథనాలు ప్రచారం చేస్తుందని ట్రంప్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఓ సందర్భంలోనైతే ఏకంగా ఓ మీడియా ప్రతినిధిపై ట్రంప్ ఆదేశాలతో ఓ అధికారి దాడికి పాల్పడి చెయ్యి చేసుకోవడం వివాదానికి దారి తీసింది. తాజాగా భారతీయ ఇంజినీర్ శ్రీనివాస్ కుచిభోట్లను దారుణంగా కాల్చిచంపిన ఘటనపై ట్రంప్ పరోక్షంగా వ్యాఖ్యలు చేసి తీవ్ర విమర్శల పాలయ్యారు. తాను కేవలం అమెరికాకే ప్రతినిధినని.. అమెరికా ప్రజలకు రక్షణ కల్పించడం, వారికి మాత్రమే ఉద్యోగాలు వచ్చేలా చేయడం తన పని అంటూ కన్సర్వేటీవ్ పొలిటికల్ యాక్షన్ కాన్ఫరెన్స్ (సీపీఏసీ)లో పాల్గొన్న సందర్భంగా విదేశీ వలసదారులపై ట్రంప్ ఈ విద్వేష పూరిత వ్యాఖ్యలుచేశారు.