మొక్కుబడి ఉత్సవాలు వద్దు: కేటీఆర్
Published Wed, Mar 8 2017 8:13 PM | Last Updated on Tue, Sep 5 2017 5:33 AM
హైదరాబాద్: మహిళలు ఎవరూ తమను పూజించాలని కోరుకోవడం లేదని, పురుషులతో సమానంగా అన్ని రంగాల్లోఅవకాశాలు కల్పిస్తే
చాలుననుకుంటున్నారని ఐటీ, వాణిజ్య శాఖల మంత్రి కె.టి.రామారావు (కేటీఆర్) వ్యాఖ్యానించారు. మహిళా దినోత్సవాల పేరుతో జీవితంలో వారు చేసే త్యాగాలపై మొక్కబడిగా ఏకరువు పెట్టే బదులు ఆ కష్టాలను కొంచమైనా తగ్గించేందుకు ప్రయత్నించడం మేలని ఆయన సూచించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ శివార్లలోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్‌లో జరిగిన కార్యక్రమానికి గౌరవ అతిథిగా హాజరైనారు.
కేటీఆర్ మాట్లాడుతూ.. తాను ఈ రోజు ఈ స్థాయిలో ఉండేందుకు తన చుట్టూ ఉన్న శక్తిమంతమైన మహిళలు.. అమ్మ,, చెల్లి, భార్య
తదితరులే కారణమని కొనియాడారు. అయితే మహిళలను పురుషులకు సాయపడే వారిగా చిత్రీకరిస్తూ వారిని పొగడటం కంటే వారి
వ్యక్తిత్వాలను, సామర్థ్యాలను ప్రతిరోజూ సెలబ్రేట్ చేసుకుందామని, గౌరవిద్దామని ఆయన పిలుపునిచ్చారు. ‘‘మహిళలతో కలిసి జీవించలేము... వారు లేకుండా జీవించనూ లేము’’ అంటూ కేటీఆర్ ఛలోక్తి విసిరారు. కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సుభాష్ భమ్రే మాట్లాడుతూ.. దేశ రక్షణ రంగ ప్రాజెక్టుల్లో మహిళా శాస్త్రవేత్తల భాగస్వామ్యం ఎనలేనిదని, వారి కారణంగానే దేశం ఈనాడు ఉన్నత శిఖరాలను అధిరోహించగలిగిందని కొనియాడారు.
రక్షణ మంత్రి శాస్త్రీయ సలహాదారు జి.సతీశ్‌రెడ్డి మాట్లాడుతూ... ‘‘డీఆర్‌డీవో మహిళా శాస్త్రవేత్తలు, సిబ్బంది నిబద్ధత తనకు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకమని అన్నారు. దేశం రక్షణ రంగంలో స్వావలంబన సాధించేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో మహిళా సిబ్బంది పాత్ర ఎంతైనా కొనియాడదగినదని అన్నారు. బాధ్యతల నిర్వహణ తరువాత మళ్లీ విధుల్లోకి... మహిళలు కుటుంబ బాధ్యతల నిర్వహణ కోసం కొన్నిసార్లు వృత్తిని వదులుకోవాల్సిన పరిస్థితి వస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి కార్యదర్శి స్మితా సభర్మాల్ అన్నారు. అయితే ఆ బాధ్యతలు పూర్తయిన తరువాత వారు మళ్లీ విధుల్లోకి హాజరయ్యేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పారు.
కంపెనీలు, ప్రభుత్వ సంస్థలు ఇందుకు అనుగుణంగా విధానాలను రూపొందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కార్యదర్శి అన్నారు. లింగవివక్షను పటాపంచలు చేస్తూ రక్షణ రంగంలో అగ్రస్థానానికి చేరుకున్న టెస్సీ థామస్ వంటి శాస్త్రవేత్తలు మరింత మంది అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నట్లు స్మితా సభర్వాల్ తెలిపారు. కార్యక్రమంలో డీఆర్‌డీవో ఛైర్మన్ డాక్టర్ క్రిస్టోఫర్, చీఫ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ సర్వీసెస్ లెఫ్టినెంట్ జనరల్ సతీశ్ దువా, అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లేబొరేటరీ ఛైర్ పర్సన్ టెస్సీ థామస్, డీఆర్‌డీవో వుమెన్స్ సెల్‌కు చెందిన అల్కా సూరి తదితరులు పాల్గొన్నారు.
డీఆర్‌డీవోలో 15 శాతం మహిళలు: దేశ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీవో)లో ప్రస్తుతం 15 శాతం మంది మహిళలు పనిచేస్తున్నారని అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లేబొరేటరీ ఛైర్ పర్సన్, అగ్ని -5 క్షిపణి ప్రాజెక్టు డైరెక్టర్ టెస్సీ థామస్ విలేకరులకు
తెలిపారు. 2030 నాటికల్లా దీన్ని 50 శాతానికి చేర్చాలని తాము ఆకాంక్షిస్తున్నట్లు డీఆర్‌డీవోలోని ఉన్నత స్థానాల్లో మహిళా సిబ్బంది 25 శాతం వరకూ ఉన్నారని చెప్పారు. సుమారు 30 ఏళ్ల క్రితం తాను డీఆర్‌డీవోలో చేరినప్పుడు రెండు మూడు శాతం మాత్రమే ఉన్న మహిళా సిబ్బంది ఈనాడు ఈ స్థాయికి చేరుకోవడం ఆనందంగా ఉందన్నారు. శాస్త్రవేత్తల నియామకాల విషయంలో తాము ప్రతిభకు మాత్రమే విలువనిస్తామని, మహిళా, పురుషుడా అన్నది పట్టించుకోమని ఒక ప్రశ్నకు సమాధానంగా థామస్ చెప్పారు.
Advertisement
Advertisement