subhash bhamre
-
‘రాఫెల్’పై కాగ్ విచారణ
న్యూఢిల్లీ: ఫ్రాన్స్‌తో భారత్ కుదుర్చుకున్న రూ.58,000 కోట్ల విలువైన 36 రాఫెల్ యుద్ధవిమానాల కొనుగోలు ఒప్పందాన్ని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) పరిశీలిస్తున్నట్లు రక్షణశాఖ సహాయ మంత్రి సుభాష్ భమ్రే లోక్‌సభకు తెలిపారు. 2019, సెప్టెంబర్ నుంచి భారత్‌కు ఈ యుద్ధ విమానాల అప్పగింత ప్రారంభమవుతుందన్నారు. రక్షణ రంగానికి సంబంధించి 2015 నుంచి ఇప్పటివరకూ సీబీఐ 4 కేసుల్ని నమోదు చేసిందన్నారు. రైల్వేశాఖపై నయాపైసా భారం లేకుండా దేశంలోని అన్ని రైల్వేస్టేషన్లలో ఉచిత వైఫై సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు రైల్వేశాఖ సహాయ మంత్రి రాజెన్ గొహైన్ పార్లమెంటుకు రాతపూర్వకంగా తెలిపారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ 707 రైల్వేస్టేషన్లలో ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చామన్నారు. ది ఎయిర్‌పోర్ట్స్ ఎకనమిక్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(సవరణ) బిల్లు–2018ను పౌరవిమానయాన సహాయ మంత్రి జయంత్ సిన్హా పార్లమెంటులో ప్రవేశపెట్టారు. దీనిప్రకారం ఏటా 35 లక్షల మంది ప్రయాణికుల రద్దీ ఉండే విమానాశ్రయాలనే మేజర్ ఎయిర్‌పోర్టులుగా పరిగణిస్తారు. ప్రస్తుతం ఈ పరిమితి 15 లక్షలుగా ఉంది. అలాగే వేర్వేరు విమానాశ్రయాలు, ఎయిర్‌డ్రోమ్‌లకు మార్కెట్ ధరల ఆధారంగా వేర్వేరు టారీఫ్‌లు ఉండేలా ఈ చట్టంలో సవరణలు చేశారు. దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలను మిగిలిన పట్టణాలతో అనుసంధానించేందుకు మరో వెర్షన్ ‘ఉడాన్’ పథకాన్ని తీసుకురానున్నట్లు పౌరవిమానయాన సహాయ మంత్రి జయంత్ సిన్హా రాజ్యసభకు రాతపూర్వకంగా తెలిపారు. ఏ సందర్భంలో దేశ ద్రోహ చట్టాన్ని ప్రయోగించవచ్చన్న విషయమై సలహాలు అందించేందుకు జాతీయ న్యాయ కమిషన్ భారతీయ శిక్షా స్మృతిలోని ఆర్టికల్ 124(ఏ)ను పరిశీలిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. భారత వాతావరణ శాఖ(ఐఎండీ) వర్షపాతంపై మరింత కచ్చితత్వంతో అంచనాలు అందించేందుకు వీలుగా చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర మంత్రి హర్షవర్ధన్ సింగ్ లోక్‌సభకు తెలిపారు. పనితీరును మెరుగుపర్చుకోవడంలో భాగంగా ఐఎండీ దేశీయ, అంతర్జాతీయ విద్యాసంస్థలతో కలసి పనిచేస్తున్నట్లు వెల్లడించారు.వివాదాస్పద ఎఫ్ఆర్డీఐ (ఫైనాన్షియల్ రిజల్యూషన్ అండ్ డిపాజిట్ ఇన్సూరెన్స్) బిల్లు–2017ను కేంద్రం పార్లమెంటు నుంచి వెనక్కు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ బిల్లులోని ‘బెయిల్ ఇన్’ నిబంధనపై విమర్శలు రావడంతో బిల్లును వెనక్కు తీసుకునేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. -
హైదరాబాద్ మునిగిపోతే?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో గత కొన్ని రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలు.. చెరువులను తలపిస్తున్న మల్కాజ్గిరి, అల్వాల్, నిజాంపేట, బేగంపేట తదితర ప్రాంతాల్లోని పలు కాలనీలు.. వరద సుడిగుండంలో చిక్కుకున్న విద్యాసంస్థలు, షాపింగ్‌మాల్స్, భవనాలు.. ఇళ్లలోకి చేరిన మురుగునీరు.. వరద నీటిలో కొట్టుకుపోతున్న వాహనాలు.. బాధితుల ఆక్రందనలు.. రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక సంస్థలు, పోలీసులు సహాయం చేస్తున్నా అదుపులోకి రాని పరిస్థితులు.. చివరికి రంగంలోకి దిగిన త్రివిధ దళాలు.. హెలికాప్టర్ నుంచి సాగర్‌లోకి తాడు సాయంతో కిందకి దిగి అక్కడి నుంచి పడవల ద్వారా నీటమునిగిన భవంతుల వద్దకు చేరుకున్న సైన్యం.. బాధితులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చింది.. అక్కడే ఉన్న 108 అంబులెన్స్ ద్వారా సమీప పునరావాస కేంద్రాలకు తరలించింది.. ..ప్రకృతి విపత్తుల వల్ల హైదరాబాద్ మహానగరం మునిగిపోతే.. ఎలా స్పందించాలనే దానిపై నిర్వహించిన ‘ప్రళయ్ సహాయ్’లో కళ్లకు కట్టిన దృశ్యాలివీ.. ఒకవేళ ప్రకృతి విపత్తులు వస్తే అన్ని ప్రభుత్వ విభాగాలు అప్రమత్తంగా ఉండి ప్రజలను ఎలా సంరక్షిస్తాయనే సందేశాన్ని ఇవ్వడంతో పాటు ప్రజలు కూడా వరదల్లో నుంచి బయటపడేందుకు తోడ్పాటును అందించే ఉద్దేశంతో చేపట్టిందే ఈ మాక్‌డ్రిల్. హుస్సేన్‌సాగర్‌లో భారత సైనిక దళం దక్షిణ విభాగం కమాండెంట్ హరీజ్ ఆధ్వర్యంలో శనివారం ఉదయం తొమ్మిది గంటల నుంచి 10.30 గంటల వరకు ‘ప్రళయ్ సహాయ్’మాక్‌డ్రిల్ నిర్వహించింది. ఇందులో స్థానిక సంస్థలు మొదలుకుని కేంద్ర ప్రభుత్వ విభాగాల వరకు సిబ్బంది పాలుపంచుకున్నారు. సమన్వయంతో ప్రకృతి విపత్తును ఎదుర్కొని చేసే సహాయ, పునరావాస చర్యల గురించి కళ్లకు కట్టినట్టు చూపించారు. సంజీవయ్య పార్కు ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన ఈ డ్రిల్‌ను రక్షణ శాఖ సహాయ మంత్రి రామారావు సుభాష్ బామ్రే, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ తిలకించారు. సమన్వయంతో.. సహజసిద్ధంగా.. ప్రకృతి విపత్తులు.. ముఖ్యంగా భారీ వర్షాల వల్ల సంభవించే వరదల్లో చేపట్టే సహాయ, పునరావాస చర్యలను తెలిపేదే ఈ ‘ప్రళయ్ సహాయ్’. త్రివిధ దళాల సైనికులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఈ మాక్ డ్రిల్‌లో పాల్గొన్నారు. భారత సైనిక దళం దక్షిణ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రళయ్ సహాయ్‌లో భారీ వరదల సందర్భంగా ముంపుకు గురయ్యే కాలనీలు సహాయం కోసం బాధితులు చేసే ఆక్రందనలు, నీట మునిగిన వాహనాలతో సహజసిద్ధమైన సెట్టింగ్‌లను హుస్సేన్‌సాగర్‌లో ఏర్పాటు చేశారు. డ్రిల్‌లో భాగంగా ఆయా ప్రాంతాల్లోని భవనాలపై ఆహారం కోసం ఎదురుచూస్తున్న ప్రజలకు హెలికాప్టర్ల ద్వారా ఆహార ప్యాకెట్లు అందించారు. ఆర్మీ సిబ్బంది హెలికాప్టర్ నుంచి రాఫ్ట్ సాయంతో కిందకు దిగి పడవలో నీటమునిగిన భవంతుల వద్దకు చేరుకుని బాధితులను రక్షించారు. రెడ్‌క్రాస్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ జెండాతో వారిని ఒడ్డుకు చేర్చి అంబులెన్స్‌లో పునరావాస ప్రాంతాలకు పంపారు. కొంతమంది బాధితులను అత్యాధునిక పరికరాలతో తాడుకు కట్టి హెలికాప్టర్ ద్వారా ఇతర ప్రాంతాలకు తరలించారు. మరో ప్రాంతంలో షార్ట్ సర్క్యూట్‌తో భవనం కాలిపోతుంటే తెలంగాణ స్టేట్ డిజాస్టర్ రెస్క్యూ అండ్ ఫైర్ సర్వీస్, విద్యుత్ విభాగాల అధికారులు చేరుకుని సహాయక చర్యలు అందించడాన్ని కళ్లకు కట్టినట్టు చూపారు. ఇలా అన్ని ప్రభుత్వ విభాగాలు విపత్తుల సమయంలో సమర్థంగా పనిచేస్తే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేరవేయవచ్చనే సందేశాన్ని ఇచ్చారు. ఈ మాక్‌డ్రిల్‌లో రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, పోలీసు, రాష్ట్ర అగ్నిమాపక, అత్యవసర సేవలు, ఎన్డీఆర్ఎఫ్, సీఐఎస్ఎఫ్, ఆర్మ్డ్ ఫోర్సెస్, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్, ఎంఐ–17 హెలికాప్టర్లతో పాటు ఆర్మీ ఏవియేషన్, అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్, చేతక్ హెలికాప్టర్లతో చేపట్టిన సహాయక చర్యలు, ఆర్మీ కమాండ్లు, మెరైన్ కమాండోస్, పోలీసు, ఎన్డీఆర్ఎఫ్ డాగ్ స్క్వాడ్లు పాల్గొన్నాయి. మాక్‌డ్రిల్ విజయవంతం: బామ్రే కేంద్ర మంత్రి సుభాష్ బామ్రే మాట్లాడుతూ.. ప్రకృతి విపత్తులు ఎదురైనప్పుడు స్థానిక సంస్థల నుంచి కేంద్ర ప్రభుత్వ విభాగాల వరకు సమన్వయంతో పనిచేస్తే బాధితులను రక్షించవచ్చన్నారు. హైదరాబాద్ వేదికగా ‘ప్రళయ్ సహాయ్’మాక్‌డ్రిల్ నిర్వహించడం హర్షణీయమన్నారు. అన్ని విభాగాలూ మద్దతివ్వడంతో మాక్‌డ్రిల్ విజయవంతమైందన్నారు. మహమూద్ అలీ మాట్లాడుతూ విపత్తులు జరిగినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయాలపై మాక్‌డ్రిల్ ద్వారా అవగాహన కల్పించడం అభినందనీయమన్నారు. ఇలాంటి మాక్‌డ్రిల్ రాష్ట్రంలో నిర్వహించడం ఇదే తొలిసారని చెప్పారు. ప్రకృతి విపత్తు సంభవిస్తే ఎలా రక్షిస్తారనే విషయం ప్రజలకు అర్థమైందన్నారు. అవగాహన కలిగించేలా స్టాళ్లు.. అనంతరం పీపుల్స్ ప్లాజాలో విపత్తుల నివారణలో భాగస్వాములయ్యే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ విభాగాలు, ప్రైవేట్ సంస్థలు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ స్టాళ్లను నగర మేయర్ బొంతు రామ్మోహన్, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డితో కలసి సుభాష్ బామ్రే, మహమూద్ అలీ సందర్శించారు. విపత్తులు సంభవించినప్పుడు ప్రజలను, ప్రాణులను ఎలా కాపాడాలి.. ఆ సమయంలో త్రివిధ దళాలు, సైనికులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఎలా పనిచేస్తాయి.. ఎలాంటి సామగ్రిని ఉపయోగిస్తారు.. అనే విషయాలపై ఈ స్టాళ్లలో అవగాహన కలిగించారు. రెండు రోజుల ఈ ఎగ్జిబిషన్ శనివారంతో ముగిసింది. మనోధైర్యం కలిగిస్తున్నాం.. సముద్రంలో సెర్చ్, రెస్క్యూ ఆపరేషన్లు, మంటలు ఎగిసిపడుతున్నప్పుడు, వరదలు ముంచెత్తినప్పుడు కాపాడేందుకు ఉపయోగించే సామగ్రిని వాడే విధానంపై ఎగ్జిబిషన్‌కు వచ్చే సందర్శకులకు అవగాహన కలిగిస్తున్నాం. విపత్తులో ప్రజలు కూడా సహాయం చేసేలా మనోధైర్యం కల్పిస్తున్నాం. – ప్రకాశ్‌కుమార్, డిప్యూటీ కమాండెంట్, కోస్ట్‌గార్డు, వైజాగ్ బాంబు విచ్ఛిన్నంపై జాగృతం బాంబు డిస్పోజల్, డీప్ సెర్చ్ మిషన్, ట్రాన్సిస్టర్ రిమోట్ ఆపరేటింగ్‌తో పని చేసే పరికరాలు, మొబైల్ ఎక్స్‌రే స్కానర్, 2 కేజీల టీఎన్టీ బాంబు పేలినా నష్టం జరగకుండా అడ్డుకునే బాంబు ఇన్హిబిటర్ ఇలా అనేక వస్తువుల పనితీరును తెలియజేశాం. – ఎం.రామకృష్ణ, ఇంటెలిజెన్స్ సెక్యురిటీ వింగ్ డీఎస్పీ -
సాయుధ దళాలకు ఖాదీ
న్యూఢిల్లీ: సాయుధ దళాల సిబ్బందికి త్వరలోనే ఖాదీ యూనిఫారాలు అందించనున్నామని, ఇందుకు సంబంధించిన చర్యలను వేగవంతం చేశామని లోక్‌సభలో శుక్రవారం కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సుభాష్ భామ్రే వెల్లడించారు. ఖాదీ విలేజస్ ఇండస్ట్రీస్ కమిషన్(కేవీఐసీ) విన్నపం మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని మంత్రి తెలిపారు. దుస్తులకు సంబంధించిన నమూనాలను కేవీఐసీకి పంపామని తెలిపారు. సైన్యంలో సోషల్ మీడియా వినియోగంపై భారత ఆర్మీ కొత్త విధివిధానాలను రూపొందించిందని తెలిపారు. -
‘పాక్ 268 సార్లు కాల్పులు జరిపింది’
న్యూఢిల్లీ: గత ఏప్రిల్ నుంచి మార్చి వరకు పాకిస్థాన్ 268సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని కేంద్రం వెల్లడించింది. రాజ్యసభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు రక్షణశాఖ సహాయమంత్రి సుభాష్ బమ్రే సమాధానమిచ్చారు. నవంబర్‌లో అత్యధికంగా 88సార్లు, గత నెలలో 22సార్లు ఉల్లంఘించిందని తెలిపారు. ఇరు దేశాల అధికారుల మధ్య జరిగిన వివిధ చర్చలో ఈ విషయాన్ని లేవనెత్తామని ఆయన వెల్లడించారు. ఆర్మీలో 33,458, నేవీలో 14,041, ఎయిర్‌ఫోర్స్‌లో 13,614 ఖాళీలు ఉన్నాయని పేర్కొన్నారు. నీతి అయోగ్ సిఫార్సు మేరకు కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలో పెట్టుబడుల ఉపసంహరణకు కేంద్రం అనుమతించిందన్నారు. సు–30 ఎంకేఐ యుద్ధవిమానాల విడిభాగాల తయారీకి రష్యా నుంచి టెక్నాలజీని దిగుమతి చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. -
మొక్కుబడి ఉత్సవాలు వద్దు: కేటీఆర్
హైదరాబాద్: మహిళలు ఎవరూ తమను పూజించాలని కోరుకోవడం లేదని, పురుషులతో సమానంగా అన్ని రంగాల్లోఅవకాశాలు కల్పిస్తే చాలుననుకుంటున్నారని ఐటీ, వాణిజ్య శాఖల మంత్రి కె.టి.రామారావు (కేటీఆర్) వ్యాఖ్యానించారు. మహిళా దినోత్సవాల పేరుతో జీవితంలో వారు చేసే త్యాగాలపై మొక్కబడిగా ఏకరువు పెట్టే బదులు ఆ కష్టాలను కొంచమైనా తగ్గించేందుకు ప్రయత్నించడం మేలని ఆయన సూచించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ శివార్లలోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్‌లో జరిగిన కార్యక్రమానికి గౌరవ అతిథిగా హాజరైనారు. కేటీఆర్ మాట్లాడుతూ.. తాను ఈ రోజు ఈ స్థాయిలో ఉండేందుకు తన చుట్టూ ఉన్న శక్తిమంతమైన మహిళలు.. అమ్మ,, చెల్లి, భార్య తదితరులే కారణమని కొనియాడారు. అయితే మహిళలను పురుషులకు సాయపడే వారిగా చిత్రీకరిస్తూ వారిని పొగడటం కంటే వారి వ్యక్తిత్వాలను, సామర్థ్యాలను ప్రతిరోజూ సెలబ్రేట్ చేసుకుందామని, గౌరవిద్దామని ఆయన పిలుపునిచ్చారు. ‘‘మహిళలతో కలిసి జీవించలేము... వారు లేకుండా జీవించనూ లేము’’ అంటూ కేటీఆర్ ఛలోక్తి విసిరారు. కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సుభాష్ భమ్రే మాట్లాడుతూ.. దేశ రక్షణ రంగ ప్రాజెక్టుల్లో మహిళా శాస్త్రవేత్తల భాగస్వామ్యం ఎనలేనిదని, వారి కారణంగానే దేశం ఈనాడు ఉన్నత శిఖరాలను అధిరోహించగలిగిందని కొనియాడారు. రక్షణ మంత్రి శాస్త్రీయ సలహాదారు జి.సతీశ్‌రెడ్డి మాట్లాడుతూ... ‘‘డీఆర్డీవో మహిళా శాస్త్రవేత్తలు, సిబ్బంది నిబద్ధత తనకు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకమని అన్నారు. దేశం రక్షణ రంగంలో స్వావలంబన సాధించేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో మహిళా సిబ్బంది పాత్ర ఎంతైనా కొనియాడదగినదని అన్నారు. బాధ్యతల నిర్వహణ తరువాత మళ్లీ విధుల్లోకి... మహిళలు కుటుంబ బాధ్యతల నిర్వహణ కోసం కొన్నిసార్లు వృత్తిని వదులుకోవాల్సిన పరిస్థితి వస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి కార్యదర్శి స్మితా సభర్మాల్ అన్నారు. అయితే ఆ బాధ్యతలు పూర్తయిన తరువాత వారు మళ్లీ విధుల్లోకి హాజరయ్యేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పారు. కంపెనీలు, ప్రభుత్వ సంస్థలు ఇందుకు అనుగుణంగా విధానాలను రూపొందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కార్యదర్శి అన్నారు. లింగవివక్షను పటాపంచలు చేస్తూ రక్షణ రంగంలో అగ్రస్థానానికి చేరుకున్న టెస్సీ థామస్ వంటి శాస్త్రవేత్తలు మరింత మంది అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నట్లు స్మితా సభర్వాల్ తెలిపారు. కార్యక్రమంలో డీఆర్డీవో ఛైర్మన్ డాక్టర్ క్రిస్టోఫర్, చీఫ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ సర్వీసెస్ లెఫ్టినెంట్ జనరల్ సతీశ్ దువా, అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లేబొరేటరీ ఛైర్ పర్సన్ టెస్సీ థామస్, డీఆర్డీవో వుమెన్స్ సెల్‌కు చెందిన అల్కా సూరి తదితరులు పాల్గొన్నారు. డీఆర్డీవోలో 15 శాతం మహిళలు: దేశ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో)లో ప్రస్తుతం 15 శాతం మంది మహిళలు పనిచేస్తున్నారని అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లేబొరేటరీ ఛైర్ పర్సన్, అగ్ని -5 క్షిపణి ప్రాజెక్టు డైరెక్టర్ టెస్సీ థామస్ విలేకరులకు తెలిపారు. 2030 నాటికల్లా దీన్ని 50 శాతానికి చేర్చాలని తాము ఆకాంక్షిస్తున్నట్లు డీఆర్డీవోలోని ఉన్నత స్థానాల్లో మహిళా సిబ్బంది 25 శాతం వరకూ ఉన్నారని చెప్పారు. సుమారు 30 ఏళ్ల క్రితం తాను డీఆర్డీవోలో చేరినప్పుడు రెండు మూడు శాతం మాత్రమే ఉన్న మహిళా సిబ్బంది ఈనాడు ఈ స్థాయికి చేరుకోవడం ఆనందంగా ఉందన్నారు. శాస్త్రవేత్తల నియామకాల విషయంలో తాము ప్రతిభకు మాత్రమే విలువనిస్తామని, మహిళా, పురుషుడా అన్నది పట్టించుకోమని ఒక ప్రశ్నకు సమాధానంగా థామస్ చెప్పారు. -
బీడీఎల్‌లో పేలుడు పదార్థాల నిల్వకేంద్రం ప్రారంభం
భారత్ డైనమిక్స్ లిమిటెడ్‌లో కొత్తగా ఏర్పాటుచేసిన పేలుడు పదార్థాల నిల్వ కేంద్రాన్ని రక్షణ శాఖ సహాయ మంత్రి డాక్టర్ సుభాష్ భమ్రే ప్రారంభించారు. గురువారం నాడు బీడీఎల్‌ను సందర్శించిన ఆయనకు సీఎండీ ఉదయభాస్కర్ సాదరస్వాగతం పలికారు. బీడీఎల్ సీనియర్ అధికారులతో పాటు వివిధ సంఘాల నేతలను కూడా కేంద్రమంత్రి కలిశారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఉత్పత్తి కార్యకలాపాలతో పాటు భవిష్యత్తు విస్తరణ ప్రణాళికల గురించి కూడా సీఎండీ ఆయనకు వివరించారు. ఫ్యాక్టరీలోని వివిధ ఉత్పత్తి కేంద్రాలను మంత్రి పరిశీలించారు. అనంతరం కంచన్‌బాగ్‌లో కొత్తగా ఏర్పాటుచేసిన పేలుడు పదార్థాల నిల్వకేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీడీఎల్ ఉన్నతాధికారులు ఎస్. పిరమనాయగం, వి.గురుదత్త ప్రసాద్, కె. దివాకర్ తదితరులు కూడా పాల్గొన్నారు. -
మరో సైనికుడు వీర మరణం.
-
మరో సైనికుడు వీర మరణం
-
మరో సైనికుడు వీర మరణం
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో యూరి సైనిక స్థావరంపై పాకిస్థాన్ ఉగ్రవాదులు జరిపిన దాడిలో వీర మరణం పొందిన సైనికుల సంఖ్య 18కి చేరింది. సిపాయి కె. వికాస్ జనార్థన్.. ఢిల్లీలోని ఆర్ ఆండ్ ఆర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచారు. ఉగ్రదాడిలో మృతి చెందిన సిపాయిల సంఖ్య 20కి చేరిందని వచ్చిన వార్తలను రక్షణశాఖ సహాయ మంత్రి సుభాష్ భామ్రి తోసిపుచ్చారు. క్షతగాత్రుల్లో ఎక్కువ మందికి కాలిన గాయాలయ్యాయని చెప్పారు. వీరిలో ముగ్గురిని మెరుగైన చికిత్స కోసం ఢిల్లీ ఆస్పత్రికి తరలించినట్టు వెల్లడించారు. మిగతావారికి కశ్మీర్ లోనే చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు. మృతి చెందిన సైనికుల వివరాలు.. 1. సుబేదార్ కర్నైల్ సింగ్(జమ్మూకశ్మీర్) 2. హవిల్దార్ రవి పాల్(జమ్మూకశ్మీర్) 3. హవిల్దార్ ఎన్ ఎస్ రావత్(రాజస్థాన్) 4. సిపాయి జావ్రా ముండా(జార్ఖండ్) 5. సిపాయి నైమాన్ కుజుర్(జార్ఖండ్) 6. సిపాయి రాజేశ్ సింగ్(బిహార్) 7. హవిల్దార్ అశోక్ కుమార్ సింగ్(బిహార్) 8. నాయక్ ఎస్ కే విదార్థి(బిహార్) 9. సిపాయి బిశ్వజిత్ గొరాయ్ (పశ్చిమ బెంగాల్) 10. సిపాయి గంగాధర్ దులాయ్(పశ్చిమ బెంగాల్) 11. లాన్స్ నాయక్ ఆర్ కే యాదవ్(ఉత్తరప్రదేశ్) 12. సిపాయి హరిందర్ యాదవ్(ఉత్తరప్రదేశ్) 13. సిపాయి గణేశ్ శంకర్(ఉత్తరప్రదేశ్) 14. సిపాయి రాజేశ్ కేఆర్ సింగ్(ఉత్తరప్రదేశ్) 15. లాన్స్ నాయక్ జి. శంకర్(మహారాష్ట్ర) 16. సిపాయి టీఎస్ సోమనాథ్(మహారాష్ట్ర) 17. సిపాయి ఉయికి జాన్‌రావు(మహారాష్ట్ర) 18. కె. వికాస్ జనార్థన్