సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో గత కొన్ని రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలు.. చెరువులను తలపిస్తున్న మల్కాజ్‌గిరి, అల్వాల్, నిజాంపేట, బేగంపేట తదితర ప్రాంతాల్లోని పలు కాలనీలు.. వరద సుడిగుండంలో చిక్కుకున్న విద్యాసంస్థలు, షాపింగ్‌మాల్స్, భవనాలు.. ఇళ్లలోకి చేరిన మురుగునీరు.. వరద నీటిలో కొట్టుకుపోతున్న వాహనాలు.. బాధితుల ఆక్రందనలు.. రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక సంస్థలు, పోలీసులు సహాయం చేస్తున్నా అదుపులోకి రాని పరిస్థితులు.. చివరికి రంగంలోకి దిగిన త్రివిధ దళాలు.. హెలికాప్టర్ నుంచి సాగర్‌లోకి తాడు సాయంతో కిందకి దిగి అక్కడి నుంచి పడవల ద్వారా నీటమునిగిన భవంతుల వద్దకు చేరుకున్న సైన్యం.. బాధితులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చింది.. అక్కడే ఉన్న 108 అంబులెన్స్ ద్వారా సమీప పునరావాస కేంద్రాలకు తరలించింది..
..ప్రకృతి విపత్తుల వల్ల హైదరాబాద్ మహానగరం మునిగిపోతే.. ఎలా స్పందించాలనే దానిపై నిర్వహించిన ‘ప్రళయ్ సహాయ్’లో కళ్లకు కట్టిన దృశ్యాలివీ.. ఒకవేళ ప్రకృతి విపత్తులు వస్తే అన్ని ప్రభుత్వ విభాగాలు అప్రమత్తంగా ఉండి ప్రజలను ఎలా సంరక్షిస్తాయనే సందేశాన్ని ఇవ్వడంతో పాటు ప్రజలు కూడా వరదల్లో నుంచి బయటపడేందుకు తోడ్పాటును అందించే ఉద్దేశంతో చేపట్టిందే ఈ మాక్‌డ్రిల్. హుస్సేన్‌సాగర్‌లో భారత సైనిక దళం దక్షిణ విభాగం కమాండెంట్ హరీజ్ ఆధ్వర్యంలో శనివారం ఉదయం తొమ్మిది గంటల నుంచి 10.30 గంటల వరకు ‘ప్రళయ్ సహాయ్’మాక్‌డ్రిల్ నిర్వహించింది.
ఇందులో స్థానిక సంస్థలు మొదలుకుని కేంద్ర ప్రభుత్వ విభాగాల వరకు సిబ్బంది పాలుపంచుకున్నారు. సమన్వయంతో ప్రకృతి విపత్తును ఎదుర్కొని చేసే సహాయ, పునరావాస చర్యల గురించి కళ్లకు కట్టినట్టు చూపించారు. సంజీవయ్య పార్కు ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన ఈ డ్రిల్‌ను రక్షణ శాఖ సహాయ మంత్రి రామారావు సుభాష్ బామ్రే, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ తిలకించారు.
సమన్వయంతో.. సహజసిద్ధంగా..
ప్రకృతి విపత్తులు.. ముఖ్యంగా భారీ వర్షాల వల్ల సంభవించే వరదల్లో చేపట్టే సహాయ, పునరావాస చర్యలను తెలిపేదే ఈ ‘ప్రళయ్ సహాయ్’. త్రివిధ దళాల సైనికులు, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు ఈ మాక్ డ్రిల్‌లో పాల్గొన్నారు. భారత సైనిక దళం దక్షిణ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రళయ్ సహాయ్‌లో భారీ వరదల సందర్భంగా ముంపుకు గురయ్యే కాలనీలు సహాయం కోసం బాధితులు చేసే ఆక్రందనలు, నీట మునిగిన వాహనాలతో సహజసిద్ధమైన సెట్టింగ్‌లను హుస్సేన్‌సాగర్‌లో ఏర్పాటు చేశారు. డ్రిల్‌లో భాగంగా ఆయా ప్రాంతాల్లోని భవనాలపై ఆహారం కోసం ఎదురుచూస్తున్న ప్రజలకు హెలికాప్టర్ల ద్వారా ఆహార ప్యాకెట్లు అందించారు. ఆర్మీ సిబ్బంది హెలికాప్టర్ నుంచి రాఫ్ట్ సాయంతో కిందకు దిగి పడవలో నీటమునిగిన భవంతుల వద్దకు చేరుకుని బాధితులను రక్షించారు.
రెడ్‌క్రాస్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ జెండాతో వారిని ఒడ్డుకు చేర్చి అంబులెన్స్‌లో పునరావాస ప్రాంతాలకు పంపారు. కొంతమంది బాధితులను అత్యాధునిక పరికరాలతో తాడుకు కట్టి హెలికాప్టర్ ద్వారా ఇతర ప్రాంతాలకు తరలించారు. మరో ప్రాంతంలో షార్ట్ సర్క్యూట్‌తో భవనం కాలిపోతుంటే తెలంగాణ స్టేట్ డిజాస్టర్ రెస్క్యూ అండ్ ఫైర్ సర్వీస్, విద్యుత్ విభాగాల అధికారులు చేరుకుని సహాయక చర్యలు అందించడాన్ని కళ్లకు కట్టినట్టు చూపారు. ఇలా అన్ని ప్రభుత్వ విభాగాలు విపత్తుల సమయంలో సమర్థంగా పనిచేస్తే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేరవేయవచ్చనే సందేశాన్ని ఇచ్చారు. ఈ మాక్‌డ్రిల్‌లో రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, పోలీసు, రాష్ట్ర అగ్నిమాపక, అత్యవసర సేవలు, ఎన్‌డీఆర్‌ఎఫ్, సీఐఎస్‌ఎఫ్, ఆర్మ్‌డ్ ఫోర్సెస్, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్, ఎంఐ–17 హెలికాప్టర్లతో పాటు ఆర్మీ ఏవియేషన్, అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్టర్, చేతక్ హెలికాప్టర్లతో చేపట్టిన సహాయక చర్యలు, ఆర్మీ కమాండ్‌లు, మెరైన్ కమాండోస్, పోలీసు, ఎన్‌డీఆర్‌ఎఫ్ డాగ్ స్క్వాడ్‌లు పాల్గొన్నాయి.
మాక్‌డ్రిల్ విజయవంతం: బామ్రే
కేంద్ర మంత్రి సుభాష్ బామ్రే మాట్లాడుతూ.. ప్రకృతి విపత్తులు ఎదురైనప్పుడు స్థానిక సంస్థల నుంచి కేంద్ర ప్రభుత్వ విభాగాల వరకు సమన్వయంతో పనిచేస్తే బాధితులను రక్షించవచ్చన్నారు. హైదరాబాద్ వేదికగా ‘ప్రళయ్ సహాయ్’మాక్‌డ్రిల్ నిర్వహించడం హర్షణీయమన్నారు. అన్ని విభాగాలూ మద్దతివ్వడంతో మాక్‌డ్రిల్ విజయవంతమైందన్నారు. మహమూద్ అలీ మాట్లాడుతూ విపత్తులు జరిగినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయాలపై మాక్‌డ్రిల్ ద్వారా అవగాహన కల్పించడం అభినందనీయమన్నారు. ఇలాంటి మాక్‌డ్రిల్ రాష్ట్రంలో నిర్వహించడం ఇదే తొలిసారని చెప్పారు. ప్రకృతి విపత్తు సంభవిస్తే ఎలా రక్షిస్తారనే విషయం ప్రజలకు అర్థమైందన్నారు.
అవగాహన కలిగించేలా స్టాళ్లు..
అనంతరం పీపుల్స్ ప్లాజాలో విపత్తుల నివారణలో భాగస్వాములయ్యే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ విభాగాలు, ప్రైవేట్ సంస్థలు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ స్టాళ్లను నగర మేయర్ బొంతు రామ్మోహన్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డితో కలసి సుభాష్ బామ్రే, మహమూద్ అలీ సందర్శించారు. విపత్తులు సంభవించినప్పుడు ప్రజలను, ప్రాణులను ఎలా కాపాడాలి.. ఆ సమయంలో త్రివిధ దళాలు, సైనికులు, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు ఎలా పనిచేస్తాయి.. ఎలాంటి సామగ్రిని ఉపయోగిస్తారు.. అనే విషయాలపై ఈ స్టాళ్లలో అవగాహన కలిగించారు. రెండు రోజుల ఈ ఎగ్జిబిషన్ శనివారంతో ముగిసింది.
మనోధైర్యం కలిగిస్తున్నాం..
సముద్రంలో సెర్చ్, రెస్క్యూ ఆపరేషన్లు, మంటలు ఎగిసిపడుతున్నప్పుడు, వరదలు ముంచెత్తినప్పుడు కాపాడేందుకు ఉపయోగించే సామగ్రిని వాడే విధానంపై ఎగ్జిబిషన్‌కు వచ్చే సందర్శకులకు అవగాహన కలిగిస్తున్నాం. విపత్తులో ప్రజలు కూడా సహాయం చేసేలా మనోధైర్యం కల్పిస్తున్నాం.
– ప్రకాశ్‌కుమార్, డిప్యూటీ కమాండెంట్, కోస్ట్‌గార్డు, వైజాగ్
బాంబు విచ్ఛిన్నంపై జాగృతం
బాంబు డిస్పోజల్, డీప్ సెర్చ్ మిషన్, ట్రాన్‌సిస్టర్ రిమోట్ ఆపరేటింగ్‌తో పని చేసే పరికరాలు, మొబైల్ ఎక్స్‌రే స్కానర్, 2 కేజీల టీఎన్‌టీ బాంబు పేలినా నష్టం జరగకుండా అడ్డుకునే బాంబు ఇన్‌హిబిటర్ ఇలా అనేక వస్తువుల పనితీరును తెలియజేశాం.
– ఎం.రామకృష్ణ, ఇంటెలిజెన్స్ సెక్యురిటీ వింగ్ డీఎస్పీ