సాక్షి, హైదరాబాద్: కరోనాను కట్టడి చేయడంతో పాటు ప్రజలను చైతన్యపర్చడంలో టెక్నాలజీ ఎంతో మేలు చేసిందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నా రు. కోవిడ్ మహమ్మారి విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో సాంకేతికత సమస్యల పరిష్కారంతో పాటు, నూతన అవకాశాలను సృష్టిస్తోందని చెప్పారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) ఆధ్వర్యంలో గురువారం జరిగిన ‘రీజినల్ యాక్షన్ గ్రూప్ ఫర్ సౌత్ ఏసియా’సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. ‘కోవిడ్ వైరస్‌ను ఎదుర్కోవడంలో ఎమర్జింగ్ టెక్నాలజీ పాత్ర’అనే అంశంపై ఇందులో ప్రసంగించారు. కరోనా నివారణకు కేంద్రంతో పాటు జిల్లా, గ్రామస్థాయి అధికారులతో మాట్లాడేందుకు టెక్నాలజీ ఎంతో ఉపయోగపడిందన్నారు. పట్టణాల్లో డ్రోన్ల ద్వారా క్రిమిసంహారకాల పిచికారీ, లాక్‌డౌన్ సమయంలో ప్రజల కదలికల నియంత్రణకు డ్రోన్ల విని యోగం తదితర అంశాలను కేటీఆర్ ప్రస్తావించారు. కోవిడ్ సమాచారాన్ని ప్రజలకు అందించేందుకు ప్రత్యేక యాప్, వెబ్‌సైట్‌ను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిందని చెప్పారు. రేషన్ సరుకుల పంపిణీలోనూ సాంకేతిక పరిజ్ఞానం వినియోగించామని వెల్లడించారు.
టెక్నాలజీతోనే జీవితాల్లో మార్పు..
ప్రజల జీవితాల్లో మార్పు తేలేని టెక్నాలజీ వృథా అని, అన్ని రంగాల్లోనూ టెక్నాలజీ వినియోగానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. కరోనా నేపథ్యంలో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించేందుకు నూతన సాంకేతిక పరిష్కారాలు వస్తాయనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. సమావేశంలో కేటీఆర్‌తో పాటు మాల్దీవుల ఆర్థికాభివృద్ధి శాఖ మంత్రి ఫయాజ్ ఇస్మాయిల్, సింగపూర్ ఐటీ, కమ్యూనికేషన్ల శాఖ మంత్రి ఎస్.ఈశ్వరన్, వరల్డ్ ఎకానామిక్ ఫోరమ్ అధ్యక్షుడు బోర్జే బ్రెండెలు మాట్లాడారు. వీరితో పాటు వివిధ దేశాల మేధావులు, నిపుణులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment