ఏరోస్పేస్, డిఫెన్స్‌ రంగాల్లో పెట్టుబడికి అవకాశాలు | KTR Speech In Wings India 2020 | Sakshi
Sakshi News home page

ఏరోస్పేస్, డిఫెన్స్‌ రంగాల్లో పెట్టుబడికి అవకాశాలు

Published Fri, Jan 10 2020 2:15 AM | Last Updated on Fri, Jan 10 2020 2:16 AM

KTR Speech In Wings India 2020 - Sakshi

వింగ్స్‌ ఇండియా సన్నాహక సమావేశంలో కేటీఆర్‌

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో ఏరోస్పేస్, రక్షణ రంగాల్లో భారీ పెట్టుబడికి అవకాశాలున్నాయని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. ఈ రంగాలు తెలంగాణలో ప్రాధాన్య రంగాలని చెప్పారు. కేంద్రం ఢిల్లీలో నిర్వహిస్తున్న ఏరోస్పేస్‌ షో ‘వింగ్స్‌ ఇండియా–2020’కార్యక్రమ సన్నాహక సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. కార్యక్రమం లో పారిశ్రామిక వర్గాల ప్రతినిధులు, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రతినిధులు, ఏరోస్పేస్, డిఫెన్స్‌ కంపెనీల అత్యున్నతస్థాయి ప్రతినిధులు పాల్గొన్నారు. వింగ్స్‌ ఇండియా–2020తో పాటు గ్లోబల్‌ ఏవియేషన్‌ సమ్మిట్‌ సదస్సును హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నందుకు కేటీఆర్‌ ధన్యవాదాలు తెలిపారు. దేశంలోని ప్రగతి శీల రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వ పాలసీలు, ప్రభుత్వ పనితీరు వల్ల ఈజ్‌ అఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ ర్యాంకుల్లో అగ్రస్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. ఏరోస్పేస్‌ తయారీ రంగంలో బోయింగ్, జీఈ, సఫ్రాన్, రఫేల్, లాక్‌ హీడ్‌ మార్టిన్‌ వంటి ప్రపంచస్థాయి కంపెనీలు తెలంగాణకు వచ్చాయని తెలిపారు. తెలంగాణలో 4 ఏరో స్పేస్‌ పార్కులు ఉన్నాయని, అనేక ఎలక్ట్రానిక్స్‌ తయారీ క్లస్టర్లు, హర్డ్‌వేర్‌ పార్కులు, టెక్నా లజీ సెజ్‌లు ఉన్నాయని వివరించారు.

మరింత అభివృద్ధి చెందాలి..
ఏరోస్పేస్‌ రంగానికి సైతం తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, ఏటీఎఫ్‌పై పన్ను 16 శాతం నుంచి 1 శాతానికి తెలంగాణ తగ్గించిందని పేర్కొన్నారు. దీని వల్ల ప్రాంతీయంగా విమానయానం వృద్ధి చెందుతుందని తెలిపారు. ‘ఫ్లయింగ్‌ ఫర్‌ ఆల్‌’ అనే నినాదంతో జరిగే వింగ్స్‌ ఇండియా–2020 కార్యక్రమ స్ఫూర్తి మేరకు ఏరో స్పేస్‌ రంగం మరింత అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు. 

పలు కంపెనీల ప్రతినిధులతో కేటీఆర్‌ భేటీ 
పలు ప్రముఖ ఏరోస్పేస్, డిఫెన్స్‌ రంగ కంపెనీల ప్రతినిధులతో మంత్రి కేటీఆర్‌ భేటీ అయ్యారు. ఎయిర్‌ బస్, జీఈ ఏవియేషన్, సాఫ్రాన్, బీఏఈ కంపెనీల ఇండియా అధిపతులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని కోరారు. ఎయిర్‌ బస్‌ ఇండియా సీఈవో ఆనంద్‌ స్టాన్లీ, సాఫ్రాన్‌ ఇండియా సీఈవో పియర్రీ డికెలీ, బే సిస్టమ్స్‌ ఎండీ నిక్‌ కన్నా, జీఈ ఏవియేషన్‌ ఇండియా అధినేత (కంట్రీ హెడ్‌) విక్రమ్‌ రాయ్, తలాస్‌ కంపెనీ ఉపాధ్యక్షుడు కపిల్‌ కిశోర్, యునైటెడ్‌ టెక్నాలజీస్‌ ప్రాంతీయ డైరెక్టర్‌ సమిత్‌ రే పాల్గొన్నారు.  

పీయూష్‌ గోయల్‌తో కేటీఆర్‌ భేటీ 
ఫిబ్రవరిలో తెలంగాణలో నిర్వహించే బయో ఏషియా సదస్సుకు ఆహ్వానించేందుకు కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌తో గురువారం రాత్రి రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ సమావేశమయ్యారు. తెలంగాణలో కొత్తగా 2 పారిశ్రామిక కారిడార్‌లు అభివృద్ధి చేయాలని, వరంగల్‌–హైదరాబాద్‌ కారిడార్, హైదరాబాద్‌–నాగ్‌పూర్‌ కారిడార్‌ అభివృద్ధి చేయాలని కేంద్రమంత్రిని కోరారు. హైదరాబాద్‌–బెంగళూరు–చెన్నైని కలుపుతూ దక్షిణాది పారిశ్రామిక కారిడార్‌ కావాలని మరోసారి నివేదించారు. అంతకుముందు కేటీఆర్‌ మీడియాతో మాట్లాడుతూ, ఈ ఏడాదే తెలంగాణలో ఏరోస్పేస్‌ ఇన్‌స్టిట్యూట్‌ ప్రారంభించబోతున్నామని, తొలుత ఒక ఇన్‌స్టిట్యూట్‌గా ప్రారంభించి, తరువాత అంతర్జాతీయ స్థాయి సంస్థగా, యూనివర్సిటీగా విస్తరించబోతున్నామని మీడియా అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement