
సాక్షి, సిరిసిల్ల : టైంపాస్ ఉద్యోగాలు వద్దని..చిత్తశుద్ధి, అంకితభావం, సేవాభావంతో పని చేసే వారు కావాలని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారక రామారావు అన్నారు. సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిని కేటీఆర్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రి వైద్యులతో కేటీఆర్ సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రి అంటే ప్రజల్లో నమ్మకాన్ని పెంచామన్నారు. కేసీఆర్ కిట్ల పథకంతో సర్కారు ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య రెట్టింపు అయిందన్నారు.
ప్రజారోగ్య మెరుగుకు సీఎం కేసీఆర్ ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నారన్నారు. సిరిసిల్ల ఆస్పత్రిలో ఐసీయూ సెంటర్, బ్లడ్‌బ్యాంక్, డయాలసిస్ సెంటర్, నర్సింగ్ కాలేజీ ఏర్పాటు చేశామని ఇంత చేస్తున్నా..ఎందుకు చెడ్డపేరు వస్తుందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పైసలు ఉన్నవాళ్లు ఎటైనా పోతరు..కానీ పేదలు సర్కారు ఆస్పత్రికి వస్తే.. కరీంనగర్ పొమ్మని చెప్పడం సరికాదన్నారు. పేదలకు మరింత మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకోవాలని కేటీఆర్ కోరారు.
నలుగురు గైనకాలజిస్ట్‌లను నియమిస్తాం..
సిరిసిల్ల ఆస్పత్రిలో ఏడుగురు గైనకాలజిస్ట్‌లు ఉండాల్సి ఉండగా.. ఒక్కరూ లేకపోవడం సరికాదన్నారు. సిరిసిల్లకు పోస్టింగ్ ఇస్తే..కొద్ది రోజులు పని చేసి వెళ్లిపోతున్నారని ఇది సరికాదన్నారు. నలుగురు గైనకాలజిస్ట్‌లను నియమించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి శాంతికుమార్‌తో కేటీఆర్ ఫోన్‌లో మాట్లాడి సిరిసిల్ల ఆస్పత్రికి గైనకాలజిస్ట్‌లను నియమించాలని కోరారు. ఎవరైనా సిరిసిల్లలో వైద్యసేవలు అందించేందుకు ఆసక్తితో ఉన్న మహిళాడాక్టర్లు ఉంటే వారి వివరాలు సేకరించాలని వైద్యులను కోరారు.
గతంతో పోల్చితే ఆస్పత్రిలో ఎంతో మార్పు వచ్చిందని ఇంకా మెరుగైన వైద్యసేవలు అందించాలని కోరారు. తక్షణ అవసరాలపై నివేదిక ఇవ్వాలని సూచించారు. ఆస్పత్రిలో పని చేస్తున్న స్పెషలిస్ట్ డాక్టర్ల పేర్లు అడిగి తెలుసుకున్నారు. అవుట్ పేషెంట్లు ఎంత మంది వస్తున్నారని కేటీఆర్ ప్రశ్నించగా..రోజూ 450 నుంచి 600 మంది వస్తున్నారని డాక్టర్లు తెలిపారు.
300 పడకల ఆస్పత్రిగా విస్తరిస్తాం..
సిరిసిల్ల జిల్లా ఆస్పత్రిని వంద పడకల నుంచి 300 పడకల ఆస్పత్రిగా విస్తరిస్తామని కేటీఆర్ ప్రకటించారు. కోర్టు భవనం స్థలాన్ని సేకరించేందుకు కలెక్టర్ మాట్లాడుతున్నారని, వారిని ఒప్పించి కోర్టుకు మరోచోట విశాలమైన స్థలాన్ని అప్పగిస్తామన్నారు. ప్రజలకు ఆస్పత్రి అందుబాటులో ఉండేలా సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రిగా విస్తరిస్తామన్నారు. సిరిసిల్ల ఆస్పత్రిలో సిటీ స్కాన్ మిషన్ ఏర్పాటు చేస్తామన్నారు. వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ సిరిసిల్ల ఆస్పత్రిని సందర్శించాలని కోరుతామని కేటీఆర్ అన్నారు. నర్సింగ్ కాలేజీ పూర్తి అవుతుందన్నారు. ఆస్పత్రిలో మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. భవనం ఊరుస్తున్న విషయాన్ని గుర్తించిన కేటీఆర్ కాంట్రాక్టర్‌తో మాట్లాడి రిపేరు చేయించాలని ఆస్పత్రి సూపరింటెండెంట్ తిరుపతికి సూచించారు.
పారిశుధ్యం ఎలా ఉంది.. బెడ్‌షీట్లు మార్చుతున్నారా..?
ఆస్పత్రిలో పారిశుధ్యం ఎలా ఉంది.. రోజూ బెడ్‌షీట్లు మార్చుతున్నారా అని కేటీఆర్ ఆరా తీశారు. ఏడు రకాల బెడ్‌షీట్లు ఉన్నాయా అని కేటీఆర్ ప్రశ్నించారు. రెండురకాలు ఉన్నాయని డాక్టర్లు వివరించారు. రోజూ బెడ్‌షీట్లు మార్చాలని, పారిశుధ్యం బాగుండాలని కేటీఆర్ సూచించారు. సిరిసిల్లలో ఇంత మంది డాక్టర్లు ఉండి.. ప్రసూతికోసం వచ్చే వారిని కేవలం గైనకాలజిస్ట్ లేరనే కారణంతో కరీంనగర్‌కు పంపడం సరికాదని కేటీఆర్ అన్నారు. సిరిసిల్ల ఆస్పత్రిలోని ఖాళీలను భర్తీ చేయిస్తామని అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. సిరిసిల్ల కార్మిక క్షేత్రం..పేదలు ఎక్కువగా ఉండే ఇక్కడ ప్రభుత్వ వైద్యం బాగుండాలని కేటీఆర్ కోరారు.
అధికారుల హడావుడి
సిరిసిల్ల ఆస్పత్రికి చంద్రంపేటకు చెందిన స్వప్న అనే గర్భిణి గురువారం రాగా కడుపులో పాప మరణించింది. ఆస్పత్రిలో మహిళా డాక్టర్ లేక ప్రసూతి సేవలు అందడం లేదని శుక్రవారం పత్రికల్లో కథనాలు వచ్చాయి. దీంతో ఆస్పత్రి సలహా సంఘం అధ్యక్షుడైన ఎమ్మెల్యే కేటీఆర్ శుక్రవారం ఆకస్మిక తనిఖీకి వచ్చారు. కేటీఆర్ వస్తున్నట్లు తెలియడంతో అధికారులు హడావుడిగా ఆస్పత్రికి చేరుకున్నారు. కేటీఆర్ రాగానే ముందుగా డాక్టర్లతో సమీక్షించి ఆస్పత్రిలో కలియతిరిగారు.
పారిశుధ్య సిబ్బంది జీతాలు రావడం లేదని కేటీఆర్‌కు విన్నవించారు. ప్రసూతి వార్డులో బాలింతలతో కేటీఆర్ మాట్లాడారు. ఆస్పత్రిలోని బాలింత మహిళ కేటీఆర్‌తో సెల్ఫీ దిగారు. కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ షేక్ యాస్మిన్‌బాషా, ఆర్డీవో టి.శ్రీనివాస్‌రావు, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పి.చంద్రశేఖర్, ఆస్పత్రి సూపరిటెండెంట్ డాక్టర్ ఆర్.తిరుపతి, ఇన్‌ఛార్జి సూపరింటెండెంట్ డాక్టర్ మురళీధర్ డాక్టర్లు, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment