తెలుగు వెలుగులు ప్రపంచానికి పంచుదాం.. తెలంగాణ ఖ్యాతిని దశదిశలా చాటుదాం అన్న నినాదాలతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు ఉత్సవంలో నిర్వహించిన ‘తెలంగాణ వైభవం’ గీతానికి ప్రముఖ నర్తకి దీపికారెడ్డి నృత్యానికి అంతర్జాతీయస్థాయిలో ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి. తెలంగాణ భాషా, సాహిత్యాల గలగలలు.. కూచిపూడి మువ్వలు సవ్వడులై ప్రేక్షకులను పులకింపజేశాయి. ఆ పులకింతలు ఆనంద తాండవమై తెలుగు రస జగతిని పరవశింపజేశాయి. దీపికారెడ్డి బృందంలోని 200 మంది కళాకారులు సకల జనులను సమ్మోహనపరిచారు. నృత్య సాధన, ప్రశంసలపై దీపికారెడ్డి ఏమంటున్నారో ఆమె మాటల్లోనే..
నా నృత్య జీవితంలో మరుపురాని సందర్భం..
నా నృత్య జీవితంలో ఇప్పటివరకు చేసిన నృత్యాలు వేరు. తెలుగు సాహితీ వైతాళికులకు వందనం.. తెలుగు సాహితీ చరితకు తెలంగాణ విత్తనం.. జైజై తెలంగాణ ప్రపంచ మహాభలకు.. జై జై తెలంగాణ సాహితీ మహోన్నతులకు’.. అంటూ ‘తెలంగాణ వైభవం’ గీతానికి చేసిన నృత్యం వేరు. ఇప్పటికీ ఆ సందర్భాన్ని తలుచుకొంటే ఒళ్లు పులకరిస్తుంది.
కరతాళ ధ్వనులు.. ఆనంద బాష్పాలు
ప్రపంచ తెలుగు మహాసభలు. ఎల్‌బీ స్టేడియం నిండిపోయింది. జనసంద్రమైంది. ప్రారంభ నృత్యం మాదే. అంతే తల్లి, తండ్రి, గురువు, దైవాన్ని, తెలంగాణ వైతాళికులను ఒక క్షణం స్మరించుకున్నా. యుద్ధానికి వెళ్తున్నా.. ఆశీర్వదించాలని మనసులోనే ప్రార్థించా. వేదికపైకి 200 మందితో వెళ్లా. ఎలా చేశానో. అంతా అమ్మవారే చేయించారు. అర్ధగంట పాటు నృత్యం సాగింది. స్టేడియంలోని వేలాది మంది ఆకాశం దద్దరిల్లేలా కరతాళ ధ్వనులు చేశారు. నా కళ్ల వెంట ఆనందబాష్పాలు రాలాయి.
ప్రాక్టీస్‌కు స్కూల్ గ్రౌండ్ ఎంచుకొన్నాం...
చాలా పెద్ద స్టేజ్. అంతా స్టేజ్‌కి తగ్గట్లుగా ప్రాక్టీస్ ఉండాలి. చివరి ఓ స్కూల్ గ్రౌండ్‌ను ఎంచుకొన్నాం. స్టేజీ జాగా ఎంత ఉందో మరీ కొలిచి, టైమ్‌సెట్ ఏర్పాటు చేసుకొని ప్రాక్టీస్ చేశాం.
ఆ ప్రశంస మరిచిపోలేని అనుభూతి..
నృత్యం ముగిసిన తర్వాత స్టేజీ దిగిపోతుంటే ఓ పోలీసు అధికారి.. ‘తెలంగాణ తల్లి అని విన్నామే కానీ ఇంత వరకు చూడలే. తెలంగాణ తల్లికి నమస్కారం.. మీ నృత్యం చూసిన తర్వాత.. అచ్చంగా తెలంగాణ తల్లిని చూసినట్లు అనిపించింది’ అని చెప్పడం నా జీవితంలో మరిచిపోలేని అనుభూతి.
తక్కువ సమయంలోనే ప్రోగ్రాం ఫిక్స్..
కేవలం పదిరోజుల ముందే నా ప్రోగ్రాం ఫిక్స్ చేశారు. తెలంగాణ గడ్డ కోసమని చేశా. అంత పెద్ద ఈవెంట్, అంత తక్కువ రోజుల్లో చేయలేం. నా దగ్గర అంతమంది విద్యార్థులు ఉన్నారు కాబట్టి సరిపోయింది. మా దీపాంజలి సిబ్బంది 24 గంటల పాటు పనిచేశారు. క్యాస్టూమ్స్ స్పెషల్‌గా తయారు చేసుకున్నాం.
వాటిని కలగలిపి చేశాను..
తెలంగాణ వైభవం నృత్యానికి కష్టపడినట్లు.. నా నృత్య జీవితంలో ఎప్పుడూ కష్టపడలేదు. గీతంలోని అంశాలకు తగ్గట్లు కొరియోగ్రఫీ చేసుకోవాల్సి వచ్చింది. నృత్యంలో భాగంగా తిరిగే లైన్‌లకు, భంగిమలకు చాలా జాగ్రత్తగా కొరియోగ్రఫీ చేశాను. ఫోక్ డ్యాన్స్, క్లాసికల్, బతుకమ్మ నృత్యాలు కలగలిపి చేశాను. 200 నృత్యకారుల్లో 40 మంది మగవారిని మాత్రమే వినియోగించాం. ఈ ప్రోగ్రాంను చూసి ప్రపంచవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అవకాశం కల్పించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, అభిమానులకు, మా నాట్య బృందానికి కృతజ్ఞతలు.
Comments
Please login to add a commentAdd a comment