బస్ డిపో నిర్మాణం కలేనా..?
మొయినాబాద్ మండల కేంద్రంలో ఆర్టీసీ డిపో ఏర్పాటు ప్రతిపాదనలకే పరిమితమయింది.
► ఆరేళ్ల కిందటే స్థలం కేటాయింపు పట్టించుకోని ప్రజాప్రతినిధులు, అధికారులు
► బస్సుల కొరతతో ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు
మొయినాబాద్ రూరల్:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక అన్ని సౌకర్యాలుంటాయని తెలిపినా అవి అమలుకు నోచుకోవడం లేదని వివిధ గ్రామాల ప్రజలు పేర్కొంటున్నారు. మండల కేంద్రంలో ఆర్టీసీ డిపో ఏర్పాటు ప్రతిపాదనలకే పరిమితమయింది. ఆరేళ్ల కిందట స్థలం కేటాయించినా ఏర్పాటులో ముందడుగువేయలేదు. ప్రజాప్రతినిధులు డిపో నిర్మాణం ఊసెత్తడంలేదు. ప్రయాణికుల ఇబ్బందులూ తప్పడంలేదు. విద్యార్థులు ఫుట్‌బోర్డుపై ప్రమాదకరంగా ప్రయాణం చేస్తున్నారు.
అధికారుల స్థల పరిశీలన
మండలంలో ఆర్టీసీ డిపో ఏర్పాటుకు ముర్తుజాగూడ రెవెన్యూ పరిధిలో 21ఎకరాల భూమిని 2011లో అప్పటి ప్రభుత్వం స్థలం కేటాయించింది. స్థలాన్ని పరిశీలించిన ఆర్టీసీ అధికారులు త్వరలోనే డిపో ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ప్రభుత్వాలు మారినా ప్రజల ఆశనెరవేరలేదు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి పలు సమావేశాల్లో స్థానికంగా డిపో ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు దాటినా డిపో ఏర్పాటు పట్టించుకోవడంలేదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు...
అరకొర బస్సులతో ప్రయాణికులు ఇక్కట్లు తప్పడం లేదు. మండలంలో పలు ఇంజినీరింగ్, మెడికల్, ఫార్మసీ కళాశాలలు 28వరకున్నాయి. రోజూ సుమారు 30వేల మంది విద్యార్థులు, ప్రజలు నగరం నుంచి రాకపోకలు సాగిస్తుంటారు. కళాశాలల సమయాల్లో సరిపడ బస్సులు లేక విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదర్కొంటున్నారు. వ్యాపారులు, ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ మండలానికి సాధారణంగా మెహిదీపట్నండిపో నుంచి బస్సులు నడుస్తున్నాయి. వికారాబాద్, పరిగి, తాండురు, కర్ణాటక డిపోలకు చెందిన బస్సులు మండలం నుంచి వేళ్లె బీజాపూర్– హైదరాబాద్ రహదారిపై నడుస్తున్నా ప్రయాణికులకు సరిపోవడం లేదు.
ప్రభుత్వ నిర్లక్ష్యమే..
మొయినాబాద్‌లో ఆర్టీసి డిపో ఏర్పాటుకు స్థలం కేటాయించినా ఇప్పటి వరకు డిపో ఏర్పాటు కాలేదు. జిల్లాకు చెందిన రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి డిపో ఏర్పటుపై హామీలు చేశారు. డిపో ఏర్పాటులో నిర్లక్ష్యం వహిస్తున్నారు.21గ్రామ పంచాయతీలు, 17అనుబంధ గ్రామాల్లో ఇతర డిపోల బస్సులు నడుస్తున్నాయి. మండలంలోనే డిపో ఏర్పాటు చేస్తే ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది. --మోత్కుపల్లి రాములు, కాంగ్రెస్‌పార్టీ జిల్లా ఎస్సీసెల్ మాజీ అధ్యక్షుడు